నేడు చంద్ర గ్రహణం: ఆ ఘడియలు ఇవే
న్యూఢిల్లీ: నేడు చంద్ర గ్రహణం (Lunar eclipse 2023) ఏర్పడబోతోంది. ఇది పాక్షికం. అత్యంత అరుదైన గ్రహణం ఇది. శరద్ పౌర్ణమితో కలిసి రావడం దీని ప్రత్యేకత. ఇదివరకు ఇలాంటి సందర్భం ఎప్పుడూ రాలేదు. గ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల సహా పలు ఆలయాలు మూత పడనున్నాయి.
ఈ చంద్ర గ్రహణం భారత్‌లో కనిపిస్తుంది. అర్ధరాత్రి దాటిన తరువాత 1:05 నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభమౌతుంది. గంటా 20 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఆదివారం తెల్లవారు జామున 2:24 నిమిషాలకు ముగుస్తుంది. ఈ మధ్యాహ్నం 2:50 నిమిషాల నుంచి గ్రహణం ముగిసేంత వరకు సూతక కాలంగా భావిస్తారు.

భారత్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల ప్రజలు చంద్ర గ్రహణాన్ని తిలకించవచ్చు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్, టర్కీ, అల్జీరియా, జర్మనీ, పోలాండ్, నైజీరియా, బ్రిటన్, స్పెయిన్, స్వీడెన్, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేసియా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది.
సూర్యుడు- భూమి-చంద్రుడు ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంటుంది. భూమి నీడ పడినప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్లిపోతాడు. దీన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారు. భూమి నీడ చంద్రుడిపై కొంతభాగమే పడినప్పుడు అది పాక్షిక చంద్ర గ్రహణం అవుతుంది.
చంద్ర గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రహణకాలంలో నేరుగా చంద్రుడిని చూడొచ్చు. కంటి చూపుపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. ఈ గ్రహణాన్ని నాసా లైవ్‌లో చిత్రీకరించనుంది. తన అధికారిక వెబ్ సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.
చంద్ర గ్రహణం నేపథ్యంలో శ్రీకాళహస్తి తప్ప అన్ని ఆలయాలు మూతపడనున్నాయి. తిరుమల, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయం, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం, సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలను మూసివేస్తారు.
సుమారు ఎనిమిది గంటల పాటు అన్ని దేవాలయాలు మూతపడనున్నాయి. సాయంత్రం 7.05 నిమిషాలకు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను మూసివేస్తారు అర్చకులు. సంప్రోక్షణ అనంతరం ఆదివారం తెల్లవారుజామున 3:15 నిమిషాలకు మళ్లీ తెరుస్తారు. యధాతథంగా భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారు.












Click it and Unblock the Notifications