వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వీడన్: వందేళ్ల చరిత్రలో తొలి మహిళా ప్రధాని... పదవి చేపట్టిన గంటల్లోనే రాజీనామా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రిక్స్‌డాగ్‌లో ఎంపీల హర్షధ్వానాల మధ్య మగ్దలీనా అండర్సన్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు

స్వీడన్ దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా మగ్దలీనా అండర్సన్ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే, పదవి చేపట్టిన కొన్ని గంటల్లోనే ఆమె రాజీనామా చేశారు.

బుధవారం స్వీడన్ పార్లమెంటు భవనం రిక్స్‌డాగ్‌లో ఎంపీల హర్షధ్వానాల మధ్య మగ్దలీనా అండర్సన్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు.

స్వీడన్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించి వందేళ్లు దాటాయి. ఒక మహిళ దేశానికి ప్రధాన మంత్రి కావడం మాత్రం ఇదే తొలిసారి. నార్డిక్ దేశాల (డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్) చరిత్రలో ఇప్పటి వరకు మహిళ ప్రధానమంత్రిగా పనిచేయని దేశం స్వీడన్.

పార్లమెంటులో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. దీనికి ఆమెను ప్రధానిగా ఎన్నుకున్నారు.

మొత్తం 349 మంది సభ్యులు ఉన్న రిక్స్‌డాగ్‌లో ప్రధాన మంత్రిగా ఎంత మంది ఆమెకు మద్దతు ఇస్తారు? అని కాకుండా.. ఎంత మంది ఆమెను వ్యతిరేకిస్తున్నారు? అని ఓటింగ్ జరిగింది.

స్వీడన్ చట్టం ప్రకారం పార్లమెంటులో మెజార్టీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే చాలు.. ప్రధాన మంత్రి కావొచ్చు.

ఈ ఓటింగ్‌లో 174 మంది మగ్దలీనా అండర్సన్‌ను ప్రధానమంత్రిగా వ్యతిరేకించారు. 117 మంది సమర్థించారు. మరో 57 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో ఒక ఓటు తేడాతో మగ్దలీనా ప్రధానమంత్రి అయ్యారు.

ప్రధాని ఎలా అయ్యారంటే...

ఉప్సల సిటీ యూనివర్శిటీలో చదువుకున్న మగ్దలీనా ఒకప్పుడు జూనియర్ స్మిమ్మింగ్ చాంపియన్.

1996లో ఆమె అప్పటి ప్రధాన మంత్రి గోరాన్ పెర్సన్‌కు రాజకీయ సలహాదారుగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గత ఏడేళ్లుగా ఆమె దేశ ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు.

బుధవారం దేశ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే, సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఒక పార్టీ వైదొలగడంతో బడ్జెట్ ఆమోదం పొందలేదు. ప్రధాన మంత్రి రాజీనామా చేశారు.

దీంతో వలసలను తీవ్రంగా వ్యతిరేకించే అతివాద పార్టీ సహా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం తెలిపింది.

ఈ బడ్జెట్‌లో దేశ ప్రజలకు ఎక్కువ పెన్షన్ ఇవ్వాలన్న ప్రతిపక్ష లెఫ్ట్ పార్టీ డిమాండ్‌కు అంగీకరించడంతో చివరి నిమిషంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఆమె నాయకురాలు అయ్యారు. ఈ సంకీర్ణానికి గ్రీన్స్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది.

ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందంటే..

అయితే, బడ్జెట్‌కు మాత్రం గ్రీన్స్ పార్టీ మద్దతు ఇవ్వలేదు.

''మొట్టమొదటిసారి అతివాదులతో తయారు చేసిన'' ఈ బడ్జెట్‌ను తాము ఆమోదించలేమని గ్రీన్స్ పార్టీ ప్రకటించింది.

దీంతో తాను ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని స్పీకర్‌కు సోషల్ డెమొక్రాట్స్ పార్టీ నాయకురాలైన మగ్దలీనా అండర్సన్ తెలిపారు.

సంకీర్ణ ప్రభుత్వానికి కాకుండా ఏక పార్టీ ప్రభుత్వానికి ప్రధానమంత్రి అయ్యేందుకు తాను ప్రయత్నిస్తానని మగ్దలీనా ఆవాభావం వ్యక్తం చేశారు.

సంకీర్ణ ప్రభుత్వంలో అయితే.. ఒక పార్టీ సంకీర్ణం నుంచి తప్పుకుంటే ఆ ప్రభుత్వానికి ప్రధాని రాజీనామా చేయాల్సిన సంప్రదాయం ఉందని, చట్టబద్ధత ప్రశ్నార్థకంగా మారే ప్రభుత్వానికి తాను నాయకురాలిగా ఉండనని ప్రకటించారు.

కాగా, తర్వాత ఏం చర్యలు తీసుకోవాలి అనే అంశంపై అన్ని పార్టీల నాయకులతో చర్చిస్తానని పార్లమెంటు స్పీకర్ తెలిపారు.

బీబీసీ ప్రతినిధి విశ్లేషణ

మగ్దలీనా మళ్లీ ప్రధాని కావొచ్చు..

స్వీడిష్ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి అయినందుకు కనీసం ఒక్కరాత్రి అయినా సంబరాలు చేసుకోవాల్సిన మగ్దలీనా అండర్సన్.. సూర్యుడు అస్తమించకముందే రాజీనామా చేసేశారు.

అయితే, స్వీడిష్ రాజకీయాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ప్రధానిగా ఆమెను చూడటం ఇదే చివరిసారి అనుకోలేం. పార్లమెంటులో ప్రధాన మంత్రి పదవి కోసం మళ్లీ ఓటింగ్ జరిగితే.. మగ్దలీనా అండర్సన్ మరోసారి విజయం సాధించొచ్చు. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలిగినప్పటికీ.. గ్రీన్స్ పార్టీ ఆమెకు మద్దతు ఇస్తోంది. (అంటే పార్లమెంటు ఓటింగ్‌లో ప్రధానిగా మగ్దలీనాను వ్యతిరేకించకపోవచ్చు. దీని అర్థం వ్యతిరేక ఓట్లు తగ్గుతాయి. అంటే ఆమె ప్రధాని అయ్యేందుకు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లే)

కానీ, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా.. ఎప్పుడు పడిపోతుందో తెలియని మైనార్టీ ప్రభుత్వాన్ని ఆమె నడిపించాల్సి వస్తుంది. అలాగే, ఇప్పటికే అతివాద పార్టీల మద్దతుతో పార్లమెంటు ఆమోదం పొందిన బడ్జెట్‌ను అమలు చేయాల్సి ఉంటుంది.

స్వీడిష్ రాజకీయాలు ప్రస్తుతం ఎంతగా విభజనకు గురయ్యాయో అనేది ఈ రాజకీయ గందరగోళాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

అయితే, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ గందరగోళానికి దేశ ఓటర్లు ముగింపు పలుకుతూ రైటో, లెఫ్టో.. ఎటో ఒకవైపుకు మద్దతు ఇచ్చి ఈ ప్రతిష్టంభనను తొలగిస్తారా? వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.) 

English summary
Sweden: The first woman Prime Minister in hundreds of years ... resigned within hours of taking office
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X