• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీ-20 వరల్డ్ కప్-2007 ఫైనల్: మిస్బా-ఉల్-హక్‌ను ఇప్పటికీ వెంటాడుతున్న పెడల్ స్వీప్ షాట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మిస్బా అవుట్ కాగానే భారత జట్టు సంబరం

మిస్బా-ఉల్- హక్ ఒక్కసారిగా మోకాళ్లపై కూలబడిపోయాడు. తన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడూ అవుట్ కాని తన ఫేవరెట్ షాట్‌కు ఎలా అవుటయ్యానా అనే ఆలోచనల్లో పడిపోయాడు.

అది 2007 సెప్టెంబర్ 24. దక్షిణాఫ్రికా వాండరర్స్ స్టేడియంలో క్రికెట్ ప్రపంచంలో మొదటి టీ-20 టోర్నీ ఫైనల్లో చివరి బంతి అప్పుడే పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఆ ఫైనల్ జరిగింది. క్రికెట్‌లో దీనిని మించిన ఆసక్తికరమైన మ్యాచ్ ఏదీ ఉండదు.

ఆ సమయంలో వాండరర్స్ స్టేడియంలోని రెండు వేరు వేరు పరిస్థితులు ఊహించడం అంత కష్టం కాదు. ఒకటి మిస్బా-ఉల్- హక్ షాక్‌లో ఉంటే, మరోవైపు భారత క్రికెట్ జట్టు సంబరాలు చేసుకుంటోంది. చివరి ఓవర్ వరకూ సాగిన ఈ మ్యాచ్‌ ఉత్కంఠను మాటల్లో వర్ణించడం చాలా కష్టం.

భారత్ - పాక్ టీ20 ఫైనల్

చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాలి

పాకిస్తాన్ విజయం కోసం చివరి ఓవర్‌లో 13 రన్స్ చేయాలి. అలాంటి టైంలో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ మీడియం పేసర్ జోగిందర్ శర్మకు బంతి అందించాడు. అక్కడ పాకిస్తాన్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఆ జట్టుకు మిస్బా-ఉల్-హక్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు.

బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసిన మిస్బా 158 పరుగుల లక్ష్యాన్ని వెంటాడుతూ జట్టును చివరి ఓవర్‌కు చేర్చాడు.

జోగిందర్ శర్మ మొదటి బంతి వైడ్ వేశాడు. తర్వాత బంతికి రన్ రాలేదు. ఆ తర్వాత బంతిని మిస్బా బలంగా బాదాడు. అది నేరుగా సైట్ స్క్రీన్ మీద పడింది. 'సిక్స్'...

ఇప్పుడు పాకిస్తాన్‌కు నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి.

కోచ్ జెఫ్ లాసన్, డగవుట్‌లో ఉన్న పాకిస్తాన్ ఆటగాళ్లకు విజయం కనిపించడం మొదలైంది. మరో క్షణంలో జట్టు ఓటమి మూటగట్టుకుంటోందని వారిలో ఒక్కరు కూడా ఊహించలేదు.

మూడో బంతి పడగానే జరిగింది ఒక చరిత్రగా నిలిచిపోయింది. శర్మ విసిరిన బంతిని మిస్బా-ఉల్-హక్ పెడల్ స్వీప్ షాట్ ఆడాడు. కానీ, బంతి వెళ్లి శ్రీశాంత్ చేతుల్లో పడింది. అతడు అప్పుడు బౌండరీకి బదులు షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్నాడు. ఆ క్యాచ్‌తో భారత్ ఐదు పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. మొదటి వరల్డ్ టీ20 చాంపియన్‌గా కూడా నిలిచింది.

భారత్ - పాక్ టీ20 ఫైనల్

14 ఏళ్లయినా ఆ మ్యాచ్ మర్చిపోలేదు

ఆ మ్యాచ్ జరిగి 14 ఏళ్లు గడిచాయి. కానీ, ఇప్పటికీ ఆ మ్యాచ్ ఆడిన పాక్ జట్టులోని ఆటగాళ్లు, భారత్-పాక్ అభిమానులు ఆ క్షణాలను మర్చిపోలేకపోతున్నారు. ఆ షాట్ కొట్టిన మిస్బా-ఉల్- హక్‌కు అది మర్చిపోవడం చాలా కష్టంగా మారింది.

బీబీసీ ఉర్దూతో మాట్లాడిన మిస్బా-ఉల్-హక్ ఆ మ్యాచ్‌కు సంబంధించి క్రికెట్ అభిమానుల మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

"ఆ ఓటమి వల్ల ఏర్పడిన బాధ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, అది ఎప్పటికీ ఉండిపోతుంది. ఎందుకంటే అక్కడ గెలుపే ముఖ్యం. ఎంత ప్రయత్నించినా మనం విజయం సాధించినపుడే, ఆ భావన భిన్నంగా ఉంటుంది" అన్నాడు మిస్బా-ఉల్-హక్.

ఎప్పుడూ గతంలోనే ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఉండనని కూడా మిస్బా చెప్పాడు.

"నేను చాలా నిరుత్సాహానికి గురయ్యా. ఎందుకంటే మనం పడిన కష్టమంతా వృధా కావాలని ఎవరూ కోరుకోరు. నేను మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాను. నాకు తెలిసి అప్పుడు అది మా చేతుల్లో ఉంది. మ్యాచ్ చేజారడం బాధగా ఉంటుందిగా" అన్నాడు

మనం జీవితాంతం గతంలోనే జీవించలేం. జరిగిందేదో జరిగిపోయింది. అది బాధకలిగించేదే. కానీ ఆ దారి నుంచ తప్పుకుని, ముందుకు వెళ్లడం కూడా అవసరమే" అంటాడు మిస్బా.

భారత్ - పాక్ టీ20 ఫైనల్

పెడల్ స్వీప్ షాట్‌తో ఎప్పుడూ అవుట్ కాలేదు

క్రికెట్ ప్రపంచంలో పెడల్ స్వీప్ షాట్ ఆడే బ్యాట్స్‌మెన్ చాలా తక్కువే ఉంటారు. కానీ, ఆ షాట్ ఆడడం అంటే ఎంత ఇష్టమో మిస్బా-ఉల్-హక్‌ మాటల్లో తెలుస్తుంది.

"నేను ఆ షాట్ ఆడి తప్పు చేశానని జనం ఇప్పటికీ అంటుంటారు. కానీ, అది నిజం కాదు. నేను ఇంతకు ముందెప్పుడూ పెడల్ స్వీప్ షాట్ ఆడి అవుట్ కాలేదు. అది నా ఫేవరెట్ షాట్."

మిస్బా 2007 వరల్డ్ టీ20లో చాలాసార్లు ఆ షాట్ ఆడారు. "ఫీల్డర్ ఫైన్ లెగ్‌ కంటే వెనకుంటే ఆ షాట్‌తో నాకు సింగిల్ వచ్చేది. ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో కూడా నేను అదే షాట్ కొట్టాను" అని చెప్పాడు.

మిస్బా "స్కోర్ సమం చేయడానికి ఐదు పరుగులు చేద్దామని నేను ఆలోచిస్తున్నా. అందుకే వికెట్ కీపర్ పైనుంచి ఫోర్ కొట్టాలనుకున్నా. వాళ్లు ఫీల్డర్‌ను వెనక పెట్టుంటే, నేను సింగిల్ తీసుండేవాడిని. దగ్గరగా పెట్టడంతో అతడి పైనుంచి కొట్టాలనుకున్నా" అన్నాడు.

కానీ, పెడల్ స్వీప్ షాట్ కొట్టి అవుట్ కాగానే నా ఆలోచనలన్నీ వృథా అయ్యాయి. నేను ఆడే బెస్ట్ షాట్ అదేనని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. కానీ, ఆ సమయంలో సక్సెస్ కాలేదు" అన్నాడు.

భారత్ - పాక్ టీ20 ఫైనల్

చివరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్

ఆ ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది.

భారత జట్టులో గౌతం గంభీర్ అత్యధికంగా 75 పరుగులు చేశాడు. పాకిస్తాన్ జట్టులో ఉమర్ గుల్ 3 వికెట్లు పడగొట్టాడు.

పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదట్లోనే మొహమ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ వికెట్లను కోల్పోయింది.

కానీ, సెమీ ఫైనల్ హీరో ఇమ్రాన్ నజీర్ దూకుడుగా ఆడాడు. అతడు రనౌట్ కాగానే మ్యాచ్ పాకిస్తాన్ చేజారుతున్నట్లు అనిపించింది.

ఒక సమయంలో పాకిస్తాన్ 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో మిస్బా క్రీజులోకి వచ్చాడు. మ్యాచ్‌ను చివరి ఓవర్లో విజయం కోసం 13 పరుగులే కావాల్సిన స్థితి వరకూ చేర్చాడు.

"ఇప్పుడు మనం ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటే, అందరికీ నేను అవుటైన ఆ చివరి ఓవరే గుర్తొస్తుంది. కానీ, ఈ మ్యాచ్‌లో ఇంకా ముఖ్యమైన ఎన్నో ఘట్టాలున్నాయి. ఇమ్రాన్ నజీర్ రనౌట్ అయ్యాడు. తను 14 బంతుల్లోనే 33 రన్స్ చేశాడు. అంతకు ముందు సెమీ ఫైనల్లో తను వేగంగా అర్థసెంచరీ చేశాడు" అని మిస్బా గుర్తు చేసుకున్నాడు.

"వరుసగా వికెట్లు పడుతూ వచ్చాయి. మొదటి బంతికే షాహిద్ అఫ్రిదీ అవుటయ్యాడు. సోహెల్ తన్వీర్ రెండు సిక్సర్లు కొట్టాక బౌల్డ్ అయ్యాడు. అయినా చివరి ఓవర్లో 13 రన్స్ చేయగలమని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. మీరు దాన్ని ఓవర్ కాన్ఫడెన్స్ అంటారేమో.. నేను ఆ బంతిని చాలా దగ్గరగా రానిచ్చి ఆడాను. అందుకే షాట్ దూరంగా వెళ్లడానికి బదులు పైకి లేచింది.." అని మిస్బా చెప్పాడు.

మొదటి టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు

జనం దృష్టిలో దోషి

మిస్బా ఆ షాట్ ఆడిన క్షణం పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది. దానికి అతడు తరచూ విమర్శలు ఎదుర్కుంటుంటాడు. కొందరు మిస్బా అసలు ఆ షాట్ ఆడుండకూడదని అంటారు. మరికొంతమంది ఆ షాట్ వల్లే టీమ్ చాంపియన్స్ కాలేకపోయిందని భావిస్తారు.

"ఆ విమర్శల గురించి మిస్బా-ఉల్-హక్‌కు కూడా బాగా తెలుసు. మ్యాచ్ ఓడిపోవడంతో మొత్తం టీమ్ బాధ పడింది. ఇంత దగ్గరగా వచ్చి కూడా గెలవలేకపోయామే అని నేను అందరికంటే ఎక్కువ బాధపడ్డా" అని చెప్పాడు.

బాధలో ఉన్నా మిస్బా-ఉల్-హక్‌ను అతడి సహచరులు డగవుట్‌లో తర్వాత డ్రెసింగ్ రూమ్‌లో ఓదార్చి, ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు డాక్టర్ నసీమ్ అష్రఫ్ కూడా అక్కడే ఉన్నారు. "ఫలితం ఏదైనా, నువ్వు నీ బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చావ్" అని ఆయన నన్ను మెచ్చుకున్నారు అన్నాడు.

"మన తోటి క్రికెటర్లు మన మానసిక స్థితిని అర్థం చేసుకోగలరు. కానీ సాధారణంగా దాన్ని అర్థం చేసుకోగలిగేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. ఎక్కువ మంది నాదే తప్పు అంటారు. ఆ మ్యాచ్ మాది కాదని జనం ఆలోచించరు. మేం ఆ మ్యాచ్ ఓడిపోయామనే అంటారు. మేం మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకూ ఎలా తీసుకెళ్లామో ఎవరూ ఆలోచించరు" అని మిస్బా చెప్పాడు.

"ఇప్పుడు ఇన్నేళ్లైనా కొందరు నాతో 'నేరుగా సిక్స్ కొట్టుండచ్చు కదా, ఆ షాట్ ఆడాల్సిన అవసరం ఏముంది' అంటుంటారు. నేను స్ట్రెయిట్ షాట్ కొట్టినా లాంగాన్ లేదా లాంగాఫ్‌లో అది క్యాచ్ కావచ్చు. బ్యాటింగ్ చేస్తుంటే మనకు ఉన్నట్టే, అవతల బౌలర్ మనసులో కూడా ఒక యుద్ధం జరుగుతుంటుంది" అని మిస్బా ఆనాటి మ్యాచ్ గురించి చెప్పాడు.

భారత్ - పాక్ టీ20 ఫైనల్

ఏం భయపడకని జోగీందర్‌కు ధోనీ భరోసా

హర్భజన్‌కు ఇంకా ఒక ఓవర్ ఉన్నప్పటికీ చివరి ఓవర్‌ జోగిందర్ శర్మకు ఎందుకు ఇచ్చావని ధోనీని ఇప్పటికీ ప్రశ్నిస్తుంటారు.

మహేంద్ర సింగ్ ధోనీ తరచూ అలాంటి మాస్టర్ స్ట్రోక్స్ కొడుతుంటారు. అలాంటి మాస్టర్ స్ట్రోక్‌లతోనే ధోనీ తన కెప్టెన్సీ ప్రారంభంలో ఒక తెలివైన కెప్టెన్ అనిపించుకున్నాడు.

"మిస్బా-ఉల్-హక్ హర్భజన్ మూడో ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టాడు. అతడు స్పిన్నర్లను ఎంత బాగా ఆడతాడో నాకు బాగా తెలుసు. మిస్బా స్పిన్ బౌలింగ్‌లో దూకుడుగా ఆడడం నేను ఇంతకు ముందు చాలా మ్యాచుల్లో చూశా. అందుకే మీడియం పేసర్‌తో చివరి ఓవర్ వేయించాలకున్నా" అని ధోనీ చెప్పాడు.

జోగిందర్ శర్మతో చివరి ఓవర్ వేయించడం గురించి ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ మరో ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

"తనకు చివరి ఓవర్ వేయాలని ఉందని జోగిందర్ శర్మ స్వయంగా ధోనీని అడిగిన విషయం చాలా మందికి తెలీదు. ఆ ఓవర్ నాకివ్వు, ఆ ఓవర్ నాకివ్వు అని తను అడుగుతూనే ఉన్నాడు" అన్నాడు శ్రీశాంత్.

జోగిందర్ శర్మ కూడా ఆ మ్యాచ్‌లో తన చివరి ఓవర్ గుర్తు చేసుకున్నాడు.

"మిస్బా చివరి ఓవర్లో సిక్స్ కొట్టినా, అతడిని అవుట్ చేయగలను అని నాకు నమ్మకంగా అనిపించింది. అంతకు ముందు ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో చివరి ఓవర్ వేసిన నేను రెండు వికెట్లు కూడా తీశాను" అని చెప్పాడు.

"ధోనీ నాపైన పూర్తి నమ్మకం ఉంచాడు. భయపడాల్సిన అవసరం లేదని ఎంకరేజ్ చేశాడు. నేను మొదటి బంతి వైడ్ వేశా. కానీ అది చాలా స్వింగ్ అయ్యింది. ఆఫ్ స్టంప్ మీద యార్కర్ వేయాలనేది మా ప్లాన్.

మూడో బంతి వేయడానికి పరిగెత్తగానే మిస్బా పెడల్ స్వీప్ కోసం సిద్ధమయ్యాడు. దాంతో నేను నా ప్లాన్ మార్చి స్లో బాల్ విసిరాను. ఎందుకంటే, నేను మామూలు వేగంతో ఆ బంతి వేసుంటే ఆ షాట్ బయటకు వెళ్లుండేది" అంటాడు జోగీందర్.

భారత్ - పాక్ మ్యాచ్

లీగ్ మ్యాచ్‌లో కూడా అంతే

అదే టీ20 వరల్డ్ కప్‌ గ్రూప్ మ్యాచ్‌లో కూడా పాకిస్తాన్, భారత్ తలపడ్డాయి. అది కూడా చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగానే సాగింది. చివరికి టైగా ముగిసింది. తర్వాత బాల్ అవుట్‌తో భారత్ దాన్ని గెలిచింది.

ఆ మ్యాచ్‌లో కూడా మిస్బా జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చాడు.

"డర్బన్‌ వికెట్ అంత సులభం కాదు. దానిపై భారత్ 9 వికెట్లకు 141 పరుగుల మంచి స్కోర్ చేసింది. అది అందుకోవడం మాకు చాలా కష్టమైంది" అన్నాడు.

ఆ మ్యాచ్ చివర్లో మిస్బాతో యాసిర్ అరాఫత్ క్రీజులో ఉన్నాడు. వాళ్లు చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది.

"శ్రీశాంత్ చివరి ఓవర్లో నేను రెండు ఫోర్లు కొట్టాను. ఐదో బంతి షార్ట్ పిచ్ వేయడం నాకు గుర్తుంది. దాన్ని నేను కట్ చేయడానికి ప్రయత్నించా, అది వికెట్ కీపర్ దగ్గరికెళ్లింది. చివరి బంతికి ఒక పరుగు తీయగలమని నాకు నమ్మకంగా ఉంది. కానీ నా షాట్ నేరుగా కవర్ పొజిషన్లోకి వెళ్లింది. ఫీల్డర్ బౌలర్ వైపు త్రో వేయడంతో నేను రనౌట్ అయ్యా" అని మిస్బా చెప్పాడు.

యూనిస్ ఖాన్‌తో మిస్బా

యూనిస్ ఖాన్ మాటను మర్చిపోని మిస్బా

"రెండేళ్ల తర్వాత పాకిస్తాన్ టీమ్ 2009 టీ-20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆడుతున్నప్పుడు విన్నింగ్ షాట్ కొట్టే సమయం వచ్చింది. నేను బ్యాటింగ్ ఆర్డర్లో కిందున్నా యూనిస్ ఖాన్ నన్ను పాడ్స్ కట్టుకోమన్నారు. నేను వెళ్లాలనుకోలేదు. కానీ, రెండేళ్ల క్రితం ఫైనల్లో విన్నింగ్ షాట్ కొట్టలేకపోయిన విషయం యూనిస్ ఖాన్‌కు గుర్తుంది. అందుకే అప్పుడు ఆయన ఆ అవకాశం నాకివ్వాలనుకున్నారు."

"షాహిద్ అఫ్రిది, షోయబ్ మలిక్ ఆ మ్యాచ్ గెలిపించడంతో నాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ నేను యూనిస్ ఖాన్ మాటను ఎప్పటికీ మర్చిపోలేను" అంటాడు మిస్బా-ఉల్-హక్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
T20 World Cup Final 2007: Pedal sweep shot still haunting Misbah-ul-Haq
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X