కాబూల్ విమానాశ్రయం జంట పేలుళ్లను ఖండించిన తాలిబన్: ఐఎస్ ఉగ్రవాదుల పనేనంటూ..
కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్ల ఘటనలను తాలిబన్లు ఖండించారు. ఇలాంటి ఘటనలను తాము అంగీకరించబోమని తెలిపారు. అంతేగాక, ఈ పేలుళ్లకు ఐఎస్ ఉగ్రవాదులే కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు తాలిబన్ అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజహిద్.
అమెరికా ఇప్పటికే ఉగ్రవాద దాడి జరగవచ్చని హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాలిబన్ల నేలను ఉగ్రవాదులు ఉపయోగించుకునేందుకు ఎంతమాత్రమూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులను చట్టం ముందు నిలబెడతామని మరో తాలిబన్ అధికార ప్రతినిధి సుహిల్ షాహీన్ తెలిపారు.

కాబూల్ జంట పేలుళ్లలో 60కి చేరిన మరణాలు, 150 మందికి తీవ్రగాయాలు
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జరిగిన జంట పేలుళ్లలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందారు. వీరిలో నలుగురు యూఎస్ మెరైన్స్ కూడా ఉన్నారు. 150 మందికిపైగా పౌరులు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురు అమెరికా సైనికులు ఉన్నారు.
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలం భీతావాహంగా మారింది. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు, గాయపడినవారి ఆర్తనాదాలతో ఘటనా స్థలాలు హృదయవిదారకంగా మారాయి. కాగా, మొదట పేలుడు బారన్ హోటల్ వద్ద జరిగింది. ఆ తర్వాత రెండో పేలుడు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం అబ్బే గేట్ సమీపంలో చోటు చేసుకుంది.
ఇతర దేశాలకు వెళ్లేందుకు వేలాది మంది విమానాశ్రయం ఆవరణలో వేచివున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులు భారీ జనసమూహాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 31 వరకు తరలింపు గడువు విధించడంతో వేలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడటంతో భారీ ప్రాణనష్టం జరిగింది. గురువారం ఉదయమే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా వర్గాలు వెల్లడించగా.. కొద్ది గంటల సమయంలోనే ఉగ్రవాదులకు దాడులకు దిగడం సంచలనంగా మారింది.
Recommended Video
పేలుళ్ల ఘటనతో ఆయా దేశాలు తమ పౌరులను వెంటనే తమ తమ దేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నాయి. భారత్ ఇప్పటికే 600 మందికిపైగా పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే, దీరిలో పలువురు ఆప్ఘాన్ పౌరులు కూడా ఉన్నారు. తాజాగా, మరో 140 మంది హిందువులు, సిక్కులను తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. గురువారం తాలిబన్లు అడ్డుకున్నారు. దీంతో వారు కాబూల్ విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వీరిని కూడా భారత్ తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది.












Click it and Unblock the Notifications