• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూయజ్ కాలువను బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్న అమెరికా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సుయాజ్‌ కాలువ

ఇజ్రాయెల్ సైన్యం 1956 అక్టోబర్ 29న ఉదయం, సినాయ్ ఎడారిపై దాడి చేసింది. దాడికి 'ఆపరేషన్ మస్కటీర్స్' అని పేరు పెట్టింది.

ఈజిప్టు ఆధీనంలోకి తీసుకున్న సూయజ్ కెనాల్‌ను స్వాధీనం చేసుకోవడమే ఇజ్రాయెల్ దాడి ముఖ్య ఉద్దేశ్యం.ఆపరేషన్ మస్కటీర్స్‌కు బ్రిటిష్ జనరల్ సర్ చార్లెస్ కీట్లీ నాయకత్వం వహించారు. ఈ దాడిని బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ కలిసి చేయాల్సి ఉంది. కానీ, ఇజ్రాయెల్ దానిని అక్టోబర్ 29న ప్రారంభించింది. ఇజ్రాయెల్ మొదటి దాడి గురించి తనకు తెలియదని అప్పటి బ్రిటిష్ ప్రధాన మంత్రి సర్ ఆంటోనీ ఈడెన్ తరువాత పేర్కొన్నారు.ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెన్ గురియన్ తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మోషే దయాన్‌ను ఈజిప్టుపై దాడికి ప్లాన్ చేయమని ఆదేశించారు.1956 అక్టోబరు 29న, సినాయ్ ఎడారిలోని మిట్లా పాస్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ వైమానిక దళానికి మోషే దయాన్‌ నాయకత్వం వహించారు. ఈజిప్టు, ఇజ్రాయెల్ సైన్యాల మధ్య భీకర యుద్ధం జరిగింది.పోరాటాన్ని వెంటనే ఆపాలని మరుసటి రోజు బ్రిటన్, ఫ్రాన్స్ ఇరుపక్షాలకు అల్టిమేటం జారీ చేశాయి. ఈజిప్టు ప్రతీకారాన్ని ఊహించి ఇజ్రాయెల్‌ తన చర్యలను కొనసాగించింది. అయితే, ఇజ్రాయెల్ అంచనాలకు విరుద్ధంగా, ఈజిప్టు అధ్యక్షుడు నాజర్ తమ బలగాలను వెనక్కి పిలిపించారు.

సుయాజ్‌ కాలువ

పారాట్రూపర్ల దాడి

ఈజిప్టు అధ్యక్షుడు నాజర్‌... బ్రిటన్, ఫ్రాన్స్ డిమాండ్లను అంగీకరించడానికి నిరాకరించడంతో, మిత్రరాజ్యాల దళాలచే వైమానిక దాడులు జరుగుతాయనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఈజిప్టు వైమానిక దళాన్ని వెనక్కు పిలిపించారనే ప్రచారం ప్రారంభమైంది.బ్రిటన్‌కు చెందిన మూడవ బెటాలియన్ పారాచూట్ రెజిమెంట్ ఎల్ జమిల్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే ఫ్రెంచ్ పారాట్రూపర్లు పోర్ట్ ఫవాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈజిప్ట్‌ అధ్యక్షుడు నాజర్ సూయజ్ కాలువను జాతీయం చేసిన దాదాపు మూడు నెలల 10 రోజుల తర్వాత, నవంబర్ 5న సూయజ్ కాలువపై బ్రిటన్, ఫ్రాన్స్ దాడి చేశాయి. అంతకుముందు జరిపిన వైమానిక దాడిలో ఈజిప్టు వైమానిక దళంపై పైచేయి సాధించాయి.

ఈజిప్టు సైన్యంపై పైచేయి45 నిమిషాలలోనే, బ్రిటీష్ నావికాదళం గగనతలంలో ఈజిప్షియన్ దళాల ప్రతిఘటనను తిప్పికొట్టింది. అల్-జమీల్ విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, బ్రిటీష్ పారాట్రూపర్లు తూర్పు వైపు పోర్ట్ సెయిడ్ వైపు వెళ్లారు. అక్కడ వారు గట్టి ప్రతిఘటనను ఎదుర్కొన్నారు.

వైమానిక దళాల మద్దతుతో, వారు ఈజిప్టు సైన్యంపై పైచేయి సాధించి, రాత్రి అక్కడ విడిది చేశారు. ఎందుకంటే మిత్రరాజ్యాల వైమానిక దళం మరుసటి రోజు సముద్రం నుండి పోర్ట్ సెయిడ్ తీర ప్రాంతంపై భారీ బాంబు దాడి చేయాల్సి ఉంది. నవంబర్ 6న, ఈజిప్ట్ తీరంలో సముద్రం, ఆకాశ మార్గం ద్వారా ఈజిప్ట్ తీరంపై దాడి చేశారు. హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేశారు.బ్రిటన్ రాయల్ మెరైన్ కమాండోలు, బ్రిటిష్ ట్యాంకర్లు, బ్రిటీష్, ఫ్రెంచ్ వైమానిక దళాలు కలిసి ఈజిప్టు సైన్యాన్ని త్వరగా ఓడించారు.నవంబర్ 6 అర్ధరాత్రి, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ డాగ్ హమర్స్క్ గౌల్డ్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు. ఆంగ్లో-ఫ్రెంచ్ దళాలు పోర్ట్ సెయిడ్‌కు దక్షిణంగా ఉన్న ఎల్ కేప్‌కు చేరుకున్నాయి. అయితే ఆ సమయంలో మొత్తం సూయజ్ కాలువ వారి నియంత్రణలోకి రాలేదు.సైనిక పరిశీలకుల సమాచారం ప్రకారం, ఈ ఆపరేషన్ సైనిక స్థాయిలో పెద్ద విజయం దిశగా కొనసాగుతోంది. కానీ ప్రపంచ రాజకీయ సమూహాలు బ్రిటన్‌ చర్యలను తప్పుబట్టాయి. కాబట్టి ఈ దాడి సైనికపరంగా విజయవంతమైనా, రాజకీయంగా మాత్రం బ్రిటన్‌కు అవమానకర ఓటమిని మిగిల్చింది. ఎందుకంటే బ్రిటన్‌‌కు సహకరించడానికి అమెరికా నిరాకరించింది.

సుయాజ్‌ కాలువ

నేపథ్యం

1956 జూలైలో ఫ్రాంకో-బ్రిటీష్ సూయజ్ కెనాల్ కంపెనీని జాతీయం చేస్తున్నట్లు ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్ ప్రకటించారు. ఈజిప్షియన్లు అస్వాన్ డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థిక వనరుగా సూయజ్ కెనాల్ నుంచి ఆదాయం వస్తుందని భావించారు. గతంలో ఈ డ్యామ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా నిరాకరించింది.కేవలం ఐదేళ్లలో సూయజ్ కెనాల్ గుండా ప్రయాణించే నౌకల ద్వారా వచ్చే ఆదాయం ఆనకట్ట నిర్మాణానికి సరిపోతుందని ఈజిప్షియన్లు విశ్వసించారు. ఈజిప్టు పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికకు ఈ ఆనకట్ట చాలా ముఖ్యమైనది.ఆ సమయంలో ఈజిప్టు ప్రణాళికలు పశ్చిమ దేశాలకు సోషలిస్ట్ ధోరణిగా అనిపించాయి. షా ఫరూఖ్ హయాంలో అంతకు ముందు బ్రిటన్‌తో చేసుకున్న అనేక ఒప్పందాలను నుంచి విముక్తి పొందేందుకు ఈజిప్ట్ ప్రయత్నిస్తున్నట్లుగా అవి భావించాయి. 1954 అక్టోబర్‌లో బ్రిటన్ కెనాల్ జోన్ కంటోన్మెంట్‌ను ఖాళీ చేసేందుకు బ్రిటన్, ఈజిప్ట్ ఒప్పందం చేసుకున్నాయి. సూయజ్ కెనాల్ కంపెనీ 1968 వరకు ఈజిప్టు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లదని కూడా ఆ ఒప్పందం పేర్కొంది. బ్రిటన్, ఫ్రాన్స్ రెండింటి పెట్టుబడితో 19వ శతాబ్దం చివరలో ఈ కాలువను నిర్మించారు.

"మా పోరాటం ఈజిప్ట్‌ లేదా అరబ్ ప్రపంచంతో కాదు"

బ్రిటన్, ఫ్రాన్స్ రెండూ కూడా అధ్యక్షుడు నాజర్ విధానాలను ఈ ప్రాంతంలో తమ సొంత ప్రయోజనాలకు ముప్పుగా భావించాయి. చర్చలు ఓ కొలిక్కి రాకపోతే, సూయజ్ కాలువను స్వాధీనం చేసుకోవడానికి దళాలను పంపాలని, అవసరమైతే నాజర్‌ను తొలగించాలని రెండు దేశాలు అంగీకరించాయి.అల్జీరియాలో ఫ్రెంచ్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటుదారులకు ఈజిప్టు అధ్యక్షుడు మద్దతు ఇస్తున్నందున, ఫ్రాన్స్ కూడా అధ్యక్షుడు నాజర్‌ను వదిలించుకోవాలని కోరుకుంది. దీంతో బ్రిటన్, ఫ్రాన్స్ రెండూ ఈజిప్టు అధ్యక్షుడు నాజర్‌ను తమ భద్రతకు ముప్పుగా భావించాయి.''మా పోరాటం ఈజిప్ట్‌ లేదా అరబ్ ప్రపంచంతో కాదు. కల్నల్ నాజర్‌తో పోరాడుతున్నాము. ఆయన నమ్మదగిన వ్యక్తి కాదని నిరూపించుకున్నారు. సుయాజ్ కెనాల్ కంపెనీకి తన దేశం చేసిన వాగ్దానాలన్నింటినీ ఉల్లంఘించారు. ఆయన తన ప్రకటనలను కూడా వెనక్కి తీసుకున్నారు'' అని అప్పటి బ్రిటన్ ప్రధాని సర్ ఆంటోనీ ఈడెన్ యుద్ధానికి ముందు అన్నారు.''అనేక దేశాల జీవనోపాధిని ప్రమాదంలో పడేసే ఇటువంటి దోపిడీ చర్య విజయవంతం కావడాన్ని మేము అంగీకరించలేము. ప్రపంచంలోని ప్రధాన వాణిజ్య అవసరాలకు భవిష్యత్తులో సూయజ్ కాలువ స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి'' అని ఈడెన్ అన్నారు.అదే సమయంలో అధ్యక్షుడు నాజర్‌ను అరబ్‌ ప్రపంచంలో హీరోగా ఆదరిస్తున్నారు. ఇతర దేశాల్లో జరుగుతున్న వామపక్ష ఉద్యమాలకు, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వాతంత్య్ర సమరయోధులకు అధ్యక్షుడు నాజర్ హీరో అయ్యారు.

సోవియట్ యూనియన్, అమెరికా పోటీ పడుతున్న కాలం

అనేక బానిస దేశాలలో ఉవ్వెత్తున స్వాతంత్ర్య ఉద్యమాలు జరుగుతున్న సమయం అది. చాలా బానిస దేశాలు పాశ్చాత్య శక్తుల నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్నందున, వారు సోవియట్ యూనియన్‌ను తమకు ఆపన్నహస్తం అందించేదిగా అనుకున్నారు. సోవియట్ యూనియన్ కూడా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఈ దేశాల స్వాతంత్ర్యానికి మద్దతు తెలిపింది.ఈజిప్ట్, బ్రిటన్ మిత్రదేశాలు సూయజ్ కెనాల్ ఆక్రమణకు ప్రయత్నిస్తున్న సమయంలో, సోవియట్ యూనియన్ మధ్యప్రాచ్యంతో సహా ఆసియా, ఆఫ్రికాలోని బానిస దేశాలకు ఆచరణాత్మక రాజకీయ మద్దతును అందిస్తోంది. ప్రపంచ రాజకీయాలలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి అమెరికా, సోవియట్ యూనియన్లు ఒకదానికొకటి పోటీపడిన ప్రచ్ఛన్నయుద్ధ కాలం అది.

సుయాజ్‌ కాలువ

బ్రిటన్ దాడిపై అమెరికా ఆగ్రహం

ఆ సమయంలో సోవియట్ యూనియన్‌కు బదులుగా బానిస దేశాల స్వాతంత్ర్యం కోసం యూఎస్‌ కూడా ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో సుయాజ్ కెనాల్‌లో రాజకీయ జోక్యం, బ్రిటన్‌కు ఎదురుదెబ్బగా మారింది. బ్రిటన్ దాడిపై అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్‌హోవర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బ్రిటన్‌లో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబూకింది. లండన్‌లో కూడా అనేక నిరసన కార్యక్రమాలు జరిగాయి. బ్రిటన్ కొద్ది సంవత్సరాల క్రితమే ప్రపంచ యుద్ధం నుండి బయటపడింది. దాని కారణంగా బ్రిటన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. పౌండ్ విలువ పడిపోవడంతోపాటూ, నిరుద్యోగ సమస్య పెరుగుతోంది.ఈ పరిస్థితులలో ఈ పోరాటాన్ని ఎలా ఆపాలో అమెరికాకు బాగా తెలుసు. అందుకే సోవియట్ యూనియన్‌ను ఈజిప్ట్‌కు మద్దతుగా ఈ యుద్ధంలో చేరేలా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తద్వారా తీవ్రమవుతున్న యుద్ధాన్ని ఆపవచ్చనేది అమెరికా ప్రణాళిక.అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ బ్రిటన్, ఫ్రాన్స్‌లను వెంటనే యుద్ధం నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.

అవమానకరమైన పరిస్థితిలో బ్రిటిష్, ఫ్రాన్స్‌

అమెరికా అధ్యక్షుడి ఆజ్ఞను పాటించడం తప్ప తమకు వేరే మార్గం లేకపోవడంతో బ్రిటన్, ఫ్రాన్స్‌లు అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ప్రపంచ శక్తులుగా వారి ప్రాబల్యం నిజంగా ముగిసిందనడానికి ఇది స్పష్టమైన సంకేతం.బ్రిటన్, ఫ్రాన్స్‌లను వెనకడుగు వేసేలా కాల్పుల విరమణకు అమెరికా బలవంతం చేసింది. 1956 నవంబర్ 6, 7 నుంచి యుద్ధ విరమణ అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి సూయజ్ కాలువపై ఈజిప్టు సార్వభౌమాధికారాన్ని గుర్తించింది. కాల్పుల విరమణను పర్యవేక్షించడానికి, శాంతిని పునరుద్ధరించడానికి యూఎన్‌ శాంతి పరిరక్షక దళాన్ని పంపించింది.

సూయజ్ కెనాల్‌ని తిరిగి తెరిచారు. అయితే ప్రత్యేకించి తమ అంతర్జాతీయ ఖ్యాతిని, అమెరికా తీవ్రంగా దెబ్బతీసిందని బ్రిటన్ భావించింది. సూయజ్ కెనాల్‌పై దాడి చేయడం ద్వారా బ్రిటన్ ప్రభావం 'ఈస్ట్ ఆఫ్ సూయజ్' తగ్గింది.1956లో బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌లు కుమ్మక్కు అయినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే బ్రిటీష్ ప్రధాన మంత్రి ఈడెన్ పార్లమెంటులో ఆ ఆరోపణలను ఖండించారు. కానీ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.చివరగా, ఇజ్రాయెల్ దాడి గురించి ఆయనకి ముందస్తు అవగాహన ఉందా అని అడిగినప్పుడు ''ఇజ్రాయెల్ ఈజిప్టుపై దాడి చేస్తుందని ముందుగానే తెలియదు'' అని ఆయన హౌస్ ఆఫ్ కామన్స్‌లో చేసిన తన చివరి ప్రసంగంలో చెప్పారు.

సుయాజ్‌ కాలువ

బ్రిటన్ సూర్యాస్తమయం!

1950ల వరకు, బ్రిటన్ తనను తాను ప్రపంచ శక్తిగా భావించింది. "సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం"గా ఓ వెలుగు వెలిగింది. బ్రిటన్‌ ఆధిపత్యం ఆస్ట్రేలియా నుంచి ఆసియా, ఆఫ్రికాలోని అనేక చిన్న దేశాలతోపాటూ కెనడా వరకు విస్తరించింది.అయినప్పటికీ, దక్షిణాసియాలో భారతదేశం, బ్రిటన్‌ చేతుల్లో లేకుండా పోయింది. భారత్‌లో పోరాడటానికి పెద్ద సంఖ్యలో సైనికులు ఉన్నారు.1952లో ఇరాన్‌లోని ఆంగ్లో-ఇరానియన్ చమురు కంపెనీ జాతీయీకరణపై బ్రిటన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇరాన్‌కు గుణపాఠం చెప్పవలసిందిగా అమెరికాను ఒత్తిడి చేసింది. అందుకే అమెరికా, బ్రిటన్ కలిసి అప్పటి ఇరాన్ ప్రధాని డాక్టర్ మహమ్మద్ ముసాదిక్ ప్రభుత్వాన్ని కూలదోశాయి.అయితే, ఈజిప్ట్ సుయాజ్ కెనాల్‌ను జాతీయం చేసినప్పుడు, నాజర్ స్థానంలో ఒక తోలుబొమ్మ అధ్యక్షుడిని లేదా షా ఫరూఖ్ రాచరికాన్ని పునరుద్ధరించడం గురించి బ్రిటీష్ వర్గాల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అలా జరగడం సాధ్యం కాలేదు.అందువల్ల, తమ తమ కారణాల వల్ల అధ్యక్షుడు నాజర్‌ను వ్యతిరేకించిన ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌లు సుయాజ్ కాలువను స్వాధీనం చేసుకోవడానికి సైనిక చర్యకు ప్లాన్ చేశాయి. ఉత్తర ఆఫ్రికాలో ఆక్రమించిన దేశాల్లో స్వాతంత్ర్య ఉద్యమానికి ఈజిప్ట్ మద్దతు ఇవ్వడంతో ఫ్రాన్స్ ఆగ్రహానికి గురైంది. అయితే ఇజ్రాయెల్ అరబ్, పాలస్తీనా ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం వల్ల అధ్యక్షుడు నాజర్‌తో శత్రుత్వం ఏర్పడింది.

సుయాజ్‌ కాలువ

సంక్షోభం అనంతర పరిణామాలుజనవరి 1957లో, సర్ ఈడెన్ ఆరోగ్యం క్షీణించడం, ఆయన రాజకీయ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతినడంతో, బ్రిటిష్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఫ్రెంచ్ ప్రధాన మంత్రి గై మౌలెట్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే అల్జీరియన్ యుద్ధానికి చెల్లించాల్సిన పన్ను కారణంగా జూన్ 1957లో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. సూయజ్ సంక్షోభం కారణంగా ఆంగ్లో-అమెరికన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినా వారు ప్రచ్ఛన్న యుద్ధ మిత్రులుగా ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)తో సహకరించడం కొనసాగించారు. 1962 నాటికి అమెరికన్ క్షిపణి వ్యవస్థను బ్రిటన్ స్వీకరించింది.ఏదీ ఏమైనప్పటికీ, రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలో అధికార సమతుల్యత స్పష్టంగా కనిపించింది. బ్రిటన్ ప్రతిష్టకు తీవ్ర దెబ్బ తగిలింది. ఇకపై తాను ప్రపంచాన్ని శాసించే దేశం కాదని బ్రిటన్‌తోపాటూ, మిగిలిన దేశాలు గ్రహించాయి. దీంతో ఆ స్థానం అమెరికాకు పోయింది.

భారతదేశం, పాకిస్తాన్ పాత్ర

సూయజ్ కెనాల్ సంక్షోభం కొనసాగుతున్నప్పుడు, అప్పటి పాకిస్తాన్ ప్రధాని హుస్సేన్ షహీద్ సెహ్రావర్ది ఈజిప్ట్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి బదులు 'జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో ఈక్వల్ టు జీరో' వంటి ప్రసిద్ధ పదాలను ఉపయోగించారు. ఆ తర్వాత అరబ్ ప్రపంచంతో పాకిస్తాన్ సంబంధాలు చాలా కాలం పాటు ఉద్రిక్తంగా మారాయి.సూయజ్ కెనాల్ సంక్షోభం సమయానికి, రెండు యూఎస్‌ సైనిక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు ఎస్‌ఈటీఓ, ఎస్‌ఏఎన్‌టీఓలలో సభ్యదేశంగా ఉండటంతో అమెరికన్ సర్కిల్‌లో పాక్‌ చేరింది. మరోవైపు, భారతదేశం అలీన దేశాల ఉద్యమంలో భాగమైంది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ప్రపంచ శక్తులు, అంటే సోవియట్ యూనియన్, యూఎస్ నుంచి ప్రయోజనం పొందడం కొనసాగించింది.అరబ్ ప్రపంచ రాజకీయ విశ్వసనీయతను పాకిస్తాన్ ప్రధాని అంగీకరించని సమయంలో... భారతదేశం, చైనా, తూర్పు యూరప్ దేశాలతోపాటూ స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు ఈజిప్టుకు మద్దతు ప్రకటించి, బ్రిటిష్-ఫ్రెంచ్-ఇజ్రాయెల్ దాడిని ముక్త కంఠంతో ఖండించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The United States prevented Britain, France, and Israel from seizing the Suez Canal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X