• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఏడాది పాలన ఎలా ఉందంటే..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జో బైడెన్

అమెరికా అధ్యక్షునిగా ఏడాది పూర్తి చేసుకున్నారు జో బైడెన్. 2021 జనవరి 20న అధ్యక్షునిగా ఆయన పాలనా పగ్గాలు చేపట్టారు.

జో బైడెన్ గెలుపు అంత సులభంగా జరిగిందేమీ కాదు. అమెరికా చరిత్రలో వివాదాస్పద ఎన్నికలుగా నిలిచిపోయాయి 2020 అధ్యక్ష ఎన్నికలు. అమెరికా కాంగ్రెస్ ఉండే క్యాపిటల్ హిల్స్‌పై దాడి జరిగింది ఆ ఎన్నికల సందర్భంగానే.

తుది ఫలితాలు వెల్లడి కాకముందే తానే గెలిచానని నాటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించుకుంది కూడా ఆ ఎన్నికల్లోనే. అనేక ఆరోపణలు, వివాదాలు, విమర్శలు, దాడుల తరువాత చివరకు అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టగలిగారు జో బైడెన్.

అమెరికా చరిత్రలోనే వివాదాస్పద ఎన్నికలు

2016లో తొలిసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన డోనల్డ్ ట్రంప్, 2020 ఎన్నికల్లో రెండోసారి ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడ్డారు. డెమోక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్, ట్రంప్‌తో తలపడ్డారు.

వివాదాస్పద ప్రెసిడెంట్‌గా పేరు తెచ్చుకున్న ట్రంప్, ముందు నుంచే ఎన్నికలపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగితే తప్ప తాను ఓడిపోనని చెప్పుకొచ్చారు ట్రంప్. అంతేకాదు అవకతవకలు జరుగుతాయంటూ పోస్టల్ ఓటింగ్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

ట్రంప్ ఆరోపణల మధ్యే 2020 నవంబరు 3న అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. కానీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక ముందే తానే గెలిచానంటూ ప్రకటించుకున్నారు ట్రంప్. జో బైడెన్ విజయాన్ని గుర్తించని ట్రంప్, తన ఓటమిని ఒప్పుకోవడానికి నిరాకరించారు.

'అమెరికా ప్రజాస్వామ్యం'పై దాడి

అమెరికా కాంగ్రెస్ ఉండే క్యాపిటల్ హిల్‌పై 2021 జనవరి 6న దాడికి దిగారు ట్రంప్ మద్దతుదార్లు. అధ్యక్షునిగా జో బైడెన్ విజయాన్ని చట్టపరంగా ఆమోదించేందుకు జనవరి 6న అమెరికా కాంగ్రెస్ సమావేశమైంది.

కానీ ఎన్నికల్లో డెమోక్రాట్లు అక్రమంగా గెలిచారంటూ ట్రంప్ మద్దతుదార్లు క్యాపిటల్ హిల్‌ను చుట్టుముట్టారు. అద్దాలను పగులగొట్టడంతోపాటు లోపలకు చొచ్చుకుని పోయారు. డోనల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావాలంటూ నినాదాలు చేశారు.

దీన్ని అమెరికా ప్రజాస్వామ్యంపై దాడిగా చాలామంది అభివర్ణించారు. చివరకు ఎన్నికల ఫలితాలను అధికారికంగా అమెరికా కాంగ్రెస్ ఆమోదించడంతో 46వ అధ్యక్షుడు అయ్యాడు జో బైడెన్.

ట్రంప్ విధానాలు రద్దు

తనకంటే ముందు అధ్యక్షునిగా పని చేసిన డోనల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను తొలి ఏడాది పాలనలో బైడెన్ రివర్స్ చేశారు. పారిస్ క్లయిమెట్ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరింది.

కరోనావైరస్ విషయంలో చైనాకు కొమ్ము కాస్తోందంటూ ట్రంప్ పాలనలో ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి బయటకు వచ్చిన అమెరికాను తిరిగి డబ్ల్యూహెచ్‌ఓలో చేర్చారు బైడెన్.

ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చే ముస్లింలపై విధించిన నిషేధాన్ని కూడా ఆయన తొలగించారు. మెక్సికో సరిహద్దుల నుంచి అక్రమంగా దేశంలోకి వలస వచ్చే తల్లిదండ్రుల నుంచి పిల్లలను విడతీసే పాలసీని రద్దు చేశారు. పాలస్తీనా అథారిటీతోనూ తిరిగి దౌత్య సంబంధాలను పునరుద్ధరించారు.

తాలిబాన్

తాలిబాన్ల అఫ్గాన్‌ ఆక్రమణ

అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆక్రమించడంపై జో బైడెన్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది.

అఫ్గానిస్తాన్‌లోని అమెరికా సైనికులను పూర్తిగా వెనక్కి తరలిస్తున్న తరుణంలో దాడులు ఉధృతం చేసిన తాలిబాన్లు 2021 ఆగస్టులో అఫ్గాన్ రాజధాని కాబుల్‌ను చేజిక్కుంచుకున్నారు.

అత్యాధునిక ఆయుధాలతో బలంగా ఉన్న అఫ్గాన్ సైనికులను తాలిబాన్లు ఓడించలేరంటూ అంతకుముందు చెప్పుకొచ్చారు బైడెన్. కానీ చివరకు అఫ్గాన్ తాలిబాన్ల వశం కావడంతో అమెరికా పౌరులను, సైన్యానికి సహకరించిన అఫ్గాన్లను విమానాల ద్వారా బయటకు అమెరికా తరలించాల్సి వచ్చింది.

అఫ్గానిస్తాన్‌లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడంలోనూ దాన్ని హ్యాండిల్ చేయడంలోనూ బైడెన్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలొచ్చాయి..

చైనాతో సంబంధాలు

అమెరికా, చైనాల మధ్య ఎంతోకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ పాలనలో అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ నడిచింది. చైనా మీద నాడు ట్రంప్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. హువావే వంటి చైనా కంపెనీల పరికరాలను, టెక్నాలజీని వాడకుండా బ్యాన్ చేసింది.

చైనా విషయంలో కాస్త అటుఇటుగా ట్రంప్ విధానాలనే బైడెన్ కొనసాగిస్తూ వచ్చారు. చైనా, అమెరికా మధ్య ఒకవైపు చర్చలు, సమావేశాలు జరుగుతూనే ఉన్నా మరోవైపు రెండు దేశాల మధ్య వాణిజ్యయుద్ధం కూడా నడుస్తూనే ఉంది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని చెబుతూ చైనా కంపెనీలను నిషేధించడం బైడెన్ పాలనలోనూ కొనసాగుతోంది.

రాజకీయంగా చూస్తే గతంలో మాదిరే వీగర్ ముస్లింల విషయంలో చైనా అణచివేతను ఆపాలంటూ బైడెన్ కూడా పిలుపునిచ్చారు. వీగర్లు ఎక్కువగా ఉండే షిన్‌జియాంగ్ ప్రావిన్స్ నుంచి అన్ని రకాల వస్తువులను కొనడాన్ని కూడా నిషేధించారు.

తైవాన్ విషయంలోనూ చైనాను హెచ్చరిస్తోంది అమెరికా. ఇక అమెరికా దౌత్యవేత్తలను చైనా, చైనా దౌత్యవేత్తలను అమెరికా నిషేధించుకుంటూనే ఉన్నాయి. రష్యాకు వ్యతిరేకంగా ఏర్పడిన అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి గత ఏడాది జూన్‌లో చైనాను ప్రపంచ భదత్రకు ముప్పుగా ప్రకటించింది. మొత్తానికి అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా చైనా విషయంలో దాని వైఖరి అయితే ఒకేలా ఉంటుందనేది నిపుణులు చెబుతున్న మాట.

కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియా విషయంలో తగ్గిన దూకుడు

ట్రంప్ పాలనలో అమెరికా, ఉత్తర కొరియా మధ్య సాగిన మాటల యుద్ధాలు అన్నీ ఇన్నీ కావు. కిమ్‌ను 'లిటిల్ రాకెట్ మ్యాన్' అని ట్రంప్ అంటే... ట్రంప్‌ను 'బుద్ధిలేని ముసలోడు' అంటూ కిమ్ తిట్టారు. రెండుసార్లు చర్చలకు కూడా ట్రంప్, కిమ్ కూర్చున్నారు.

కానీ బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తరువాత ఆ దూకుడు తగ్గింది. నార్త్ కొరియా చేసే మిసైల్ టెస్టులను ఖండించడం తప్ప బైడెన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఏమీ లేవు. నార్త్ కొరియా అణ్వాయుధాలను నాశనం చేసేలా చేయడమే తమ లక్ష్యమని బైడెన్ ప్రభుత్వం చెబుతోంది. కానీ తొలి ఏడాదిలో ఈ దిశగా అడుగులు పడలేదు.

ఇరాన్‌తో చేసుకున్న 2015 అణు ఒప్పందం నుంచి ట్రంప్ హయాంలో అమెరికా బయటకు వచ్చింది. మళ్లీ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడం బైడెన్ ముందున్న సవాలు. యుక్రెయిన్ వేదికగా తూర్పు యూరప్‌లో విస్తరించాలని ప్రయత్నిస్తున్న నాటో కూటమికి, వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలోని రష్యా సవాల్ విసురుతోంది.

ఇక ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు కూడా జో బైడెన్‌కు కీలకం. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లోని 435 సీట్లకు సెనేట్‌లో గల 100 సీట్లలో 34 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సెనేట్, ప్రతినిధుల సభల్లో రిపబ్లికన్లు మెజారిటీ సాధిస్తే ఆ తరువాత బైడెన్ మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బైడెన్ ముందున్న ప్రధాన సవాళ్లు

బైడెన్ కోవిడ్ మహమ్మారిని అదుపు చేయగలిగారా?

ప్రతిరోజూ కోవిడ్ మృతుల సంఖ్య రాసి ఉన్న కార్డును తన జేబులో పెట్టుకుని తిరిగేవారు బైడెన్. దీనిబట్టి ఆయన ముఖ్య ప్రాధాన్యత కోవిడ్ అనేది స్పష్టం చేశారు.

ఇప్పటికే మూడు ప్రధాన కోవిడ్ వేవ్‌లను ఎదుర్కొన్న అమెరికాలో ఇప్పటి వరకు 8,50,000 వేల మందికి పైగా ప్రజలు కోవిడ్ బారిన పడి మృతి చెందారు.

బైడెన్ మొదటి పాలనా సంవత్సరంలో - కోవిడ్ టీకాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దాంతో 75శాతం అమెరికా ప్రజలు తమ మొదటి డోసు వ్యాక్సీన్ తీసుకోగా, 63శాతం పూర్తిగా రెండు డోసుల టీకా తీసుకున్నారు. గడిచిన నవంబరు నుంచి ఐదేళ్ల నిండిన పిల్లలకు వ్యాక్సీన్ ఇస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను అదుపు చేయడం కోసం 8 కోట్ల బూస్టర్ డోసులను ప్రవేశపెట్టారు.

అయితే అమెరికా ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటోన్న మరో పెద్ద సవాలు ఆర్థిక వ్యవస్థ మందగమనం. బైడెన్ అధ్యక్షుడయ్యాక, కోవిడ్ మహమ్మారి కారణంగా ఉద్యోగాభివృద్ది, ఉద్యోగాల కల్పన నెమ్మదించింది. దాంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1990 నుంచి ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
This is how Joe Biden's year as President of the United States came to be
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X