వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైటానిక్: ‘దేవుడు కూడా ముంచేయలేడు’ అనుకున్న నౌక మునిగిపోవడం వెనుక అసలు కారణం ఏంటంటే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టైటానిక్

ఇది 110 ఏళ్ల క్రితం నాటి ఘటన. రాత్రి కావడంతో నౌకలోని ప్రయాణికుల్లో చాలామంది నిద్రపోతున్నారు. అప్పటివరకు నిర్మించిన నౌకలలో అద్భుతంగా అభివర్ణించే టైటానిక్ ఒక్కసారిగా మంచు శకలాన్ని ఢీకొట్టింది.

ఆ సమయంలో గంటకు 41 కి.మీ. వేగంతో టైటానిక్ ప్రయాణిస్తోంది. కేవలం మూడు గంటల్లోనే ఈ నౌక ముక్కలై అట్లాంటిక్ మహాసముద్రంలోని అట్టడుగుకు చేరుకుంది.

1912 ఏప్రిల్ 14 రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇప్పటికీ ఎన్నో సందేహాలు, ప్రశ్నలు వీడని చిక్కుముడుల్లా మిగిలిపోయాయి.

1985 సెప్టెంబరులో ఈ నౌక శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. కెనడాకు 650 కి.మీ. దూరంలో 3,843 మీటర్ల లోతులో.. రెండు ముక్కలై ఇది కనిపించింది. ఆ రెండు ముక్కల మధ్య 800 మీటర్ల దూరం ఉంది.

ఈ నౌక ప్రత్యేకతలు, దీని చుట్టూ అల్లుకున్న కథలు, రహస్యాలపై నిపుణులతో బీబీసీ న్యూస్ మాట్లాడింది.

టైటానిక్

1. ''ఎప్పటికీ మునగదు’’

''దేవుడు కూడా టైటానిక్‌ను ముంచేయలేడు’’అని టైటానిక్‌ ప్రత్యేకతను చెబుతూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

''అది ఒక ఇంజినీరింగ్ అద్భుతం. అంతకుముందు వరకూ అలాంటి డిజైన్ లేదు. ఈ షిప్‌ను కంపార్ట్‌మెంట్లుగా విడగొట్టారు. ఒకవేళ నీరు లోపలకు వచ్చి ఒక కంపార్ట్‌మెంట్ నిండిపోతే, రెండో కంపార్ట్‌మెంట్‌లోకి నీళ్లు రాకుండా డిజైన్ చేశారు’’అని నౌకా నిపుణుడు, ఇంజినీర్ ఫినో అల్హో చెప్పారు. రియో డీజెనీరోలోని ఫెడరల్ యూనివర్సిటీలో నావల్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా ఫినో పనిచేస్తున్నారు.

''అంత పెద్ద నౌకలో ఎలక్ట్రికల్ కేబుళ్లు, పైపు లైన్లు ఏర్పాటు చేయడం ఇంజినీర్లకు పెద్ద సవాల్‌గా మారింది’’అని ఆయన వివరించారు.

''దీనికి వారు మంచి పరిష్కారం కనుక్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే, ఏ స్థాయిలో నీరు లోపలకు వస్తుందో వారు ముందే అంచనా వేశారు. నీరు పైవరకు రాకుండా ఉండేలా చూస్తూ, నౌక కింది భాగాన్ని వారు కంపార్ట్‌మెంట్లుగా విడగొట్టారు. పడవ పైభాగం వరకు నీరు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు’’అని ఫినో వివరించారు.

అయితే, ఆ ప్రమాదం చాలా పెద్దదని, దాన్ని తట్టుకొని ఆ భద్రతా ఏర్పాట్లు నిలవలేకపోయాయని ఆయన చెప్పారు.

''ప్రమాదం దాటికి నౌక మధ్య భాగంలో భారీ చీలిక ఏర్పడింది. దీంతో నీరు పైవరకు వచ్చేసింది’’అని ఆయన చెప్పారు.

''క్రమంగా నౌకలోకి వచ్చే నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత దాన్ని కాపాడటం అసాధ్యమైంది. అక్కడున్న పంపులన్నీ తెరచి నీటిని కొంతవరకు బయటకు పంపొచ్చు. కానీ, బయటకు పంపే నీటి కంటే లోపలకు వచ్చే నీరు చాలా ఎక్కువగా ఉండేది’’అని నాటి పరిస్థితిని ఆయన వివరించారు.

టైటానిక్

ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ నౌక మునిగిపోదని పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారని సివిల్ ఇంజినీర్ థియెర్రీ స్టంప్ చెప్పారు.

''ఎందుకంటే పడవలో నీటి ప్రవహాన్ని అడ్డుకునే చాలా కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటి మధ్య పటిష్ఠమైన గోడలను ఏర్పాటుచేశారు. వరుసగా రెండు కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయినా ఆ నౌక మునగడం సాధ్యంకాదు’’అని ఆయన అన్నారు.

''అయితే, ఆ మంచు శకలాన్ని నౌక మధ్య భాగం ఢీకొంది. దీంతో చాలా కంపార్ట్‌మెంట్ల గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి’’అని ఆయన వివరించారు.

ఈ కంపార్ట్‌మెంట్ల వ్యవస్థ ముందుగా నిర్దేశించినట్లు పనిచేయలేదని ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీర్ ఆరెలియో సోర్స్ ముర్తా వివరించారు.

''ఎందుకంటే ఆ నౌక నిర్మాణానికి ఉపయోగించిన ఇనుము సామర్థ్యంతో పోల్చినప్పుడు, ప్రమాద సమయంలో వచ్చిన ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది’’అని ఆయన అన్నారు.

టైటానిక్

''ఒత్తిడి విపరీతంగా వచ్చింది. దీంతో నౌకలో పదార్థాల నిర్మాణం తట్టుకోలేకపోయింది. తలుపులను మూయడం దాదాపుగా అసాధ్యమైంది’’అని ఆయన వివరించారు.

''నేటితో పోలిస్తే ఆ కాలంలో లోహాలు కాస్త భిన్నంగా ఉండేవి. అప్పటికి అందుబాటులో ఉన్న వాటిలో అత్యుత్తమమైన ఉక్కును టైటానిక్ కోసం ఎంచుకున్నారు. కానీ, నేటి ఉక్కుతో పోలిస్తే, దాని బలం చాలా తక్కువ’’అని ఆయన చెప్పారు.

''అప్పట్లో నౌకల తయారీలో లోహపు రేకులను ఉపయోగించేవారు. 1940ల వరకు అవే వాడుకలో ఉండేవి. కానీ, ఆ తర్వాత కాలంలో ఈ టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. వెల్డింగ్ కూడా చాలా మెరుగుపడింది. షీట్లను జాయింట్ చేసేటప్పుడు కరిగించిన లోహాలను వాడటం మొదలుపెట్టారు’’అని మెకెంజీ ప్రెస్బీటెరియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మెటలర్జికల్ ఇంజినీర్ జాన్ వాటావుక్ అన్నారు.

''రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ఉక్కు తయారీలో కార్బన్ వాడకం తగ్గించారు. దాని స్థానంలో మాంగనీస్‌ను పెంచారు. స్వచ్ఛమైన లోహాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. నేడు మనం చూస్తున్న ఉక్కు అప్పటితో పోలిస్తే చాలా గట్టిది’’అని ఆయన వివరించారు.

''నేటి నౌకలను మనం ఎలస్టిక్ బీమ్‌లుగా చెప్పుకోవచ్చు. సముద్రంలో అలల వల్ల నిరంతరాయంగా వచ్చే ఒత్తిడిని తట్టుకునేలా వీటిని తీర్చిదిద్దారు’’అని ఆయన చెప్పారు.

పెద్దపెద్ద తుపానులు వచ్చినా ఇవి తట్టుకోగలవని ఆయన వివరించారు.

టైటానిక్

2. బ్లూ బ్యాండ్

అతిపెద్ద ప్రమాదాలు చాలావరకు మానవ తప్పిదాల వల్లే జరుగుతుంటాయి. టైటానిక్ విషయంలోనూ ఇది కొంతవరకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

మంచు శకలాలు ఎక్కువగానున్న ప్రాంతంలో వేగంగా వెళ్లేందుకు చేసిన ప్రయత్నమే ప్రమాదానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు.

అట్లాంటిక్ సముద్రాన్ని వేగంగా దాటే నౌకలకు ప్రత్యేక గుర్తింపు నిచ్చేందుకు 1839ల్దో బ్లూ బ్యాండ్ అనే సంస్థను ఏర్పాటుచేశారు. టైటానిక్‌కు ఈ గుర్తింపు తెచ్చిపెట్టాలని ఇంజినీర్లు చాలా ప్రయత్నించారని విశ్లేషణలు వచ్చాయి.

''ఆ రోజుల్లో అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యాలుండే నౌకలకు మాత్రమే ఆ గుర్తింపు వచ్చేది. దీని కోసం పెద్దపెద్ద కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ఇంగ్లండ్, జర్మనీ లాంటి దేశాలు పోటాపోటీగా నౌకలు తయారుచేసేవి’’అని ఫినో చెప్పారు.

''తొలి ప్రయత్నంలోనే టైటానిక్‌కు ఈ గుర్తింపు తెచ్చిపెట్టాలని భావించారు. ఎందుకంటే పాత నౌకలతో పోల్చినప్పుడు కొత్తగా నౌకలు కాస్త వేగంగా వెళ్లగలవు’’అని ఆయన వివరించారు.

''వీలైనంత వేగంగా వెళ్లేందుకు తొలి ప్రయాణం ద్వారా వారికి మంచి అవకాశం దొరికింది. ఇంజిన్లు కూడా అప్పుడు మంచి కండీషన్‌లో ఉండేవి’’అని ఆయన పేర్కొన్నారు.

ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు కూడా ఇదే విషయాన్ని వివరించారు. దగ్గర్లో మంచు శకలాలు ఉన్నాయనే వార్త వచ్చినప్పటికీ, వేగాన్ని తగ్గించేందుకు కెప్టెన్ అసలు ఇష్టపడలేదని వారు వివరించారు.

టైటానిక్

3. టైటానిక్ బ్రదర్స్

20వ శతాబ్దం చివర్లో టైటానిక్‌తోపాటు మరికొన్ని నౌకలు కూడా అద్భుత నైపుణ్యాలతో అట్లాంటిక్ సముద్రాన్ని దాటేందుకు వచ్చాయి. ద వైట్ స్టార్ లైన్ కంపెనీ.. ఇలాంటి మూడు నౌకలను ఆర్డర్ చేసింది.

అత్యంత సురక్షితమైనవిగా, విలాసవంతమైనవిగా, అతిపెద్దవిగా ఇవి వార్తల్లో నిలిచాయి.

''ఇవి అప్పట్లో ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి’’అని స్టంప్ చెప్పారు.

ఈ ఒలింపిక్ క్లాస్ నౌకలను 1908 నుంచి 1915 మధ్య తయారుచేశారు. వీటిలో మొదటిదైన ఒలింపిక్ 1908లో, రెండోది టైటానిక్ 1909లో, మూడోది జైగాంటిక్ 1911లో తయారుచేశారు.

దురదృష్టవశాత్తు ఈ మూడింటికీ ప్రమాదాలు జరిగాయి.

1911లో ఒలింపిక్ విధుల్లో చేరింది. అదే ఏడాది ఆ నౌక ప్రమాదానికి గురైంది. అయితే, దానికి మళ్లీ మరమ్మతులు నిర్వహించి, ప్రయాణానికి అనుమతించారు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దీన్ని బ్రిటన్ నౌకా దళం ఉపయోగించింది. అయితే, 1918లో జర్మనీ జలాంతర్గామిని ఇది ఢీకొట్టింది. మళ్లీ 1920లో దీనికి మరమ్మతులు నిర్వహించి ఉపయోగించారు. అయితే 1935లో దీన్ని విధుల నుంచి తొలగించారు.

టైటానిక్ తొలి ప్రయాణం 1912 ఏప్రిల్ 10న మొదలైంది. సౌథాంప్టన్ నౌకాశ్రయం తీరంలోనే మరో నౌకను ఇది ఢీకొట్టబోయింది. అయితే, తృటిలో ఆ ప్రమాదం తప్పిపోయింది. కానీ, ఏప్రిల్ 14నాటి ప్రమాదం విధ్వంసకరమైనది.

జైగాంటిక్ కూడా ఎక్కువ కాలం సేవలు అందించలేదు. దీనికి బ్రిటానిక్‌గా నామకరణం చేశారు. బ్రిటిష్ నౌకా దళం కోసం పనిచేసిన ఈ నౌక 1916లో మునిగిపోయింది.

తయారయ్యేనాటికి ప్రపంచంలో ఇవే అతిపెద్ద నౌకలుగా ఒలింపిక్, టైటానిక్ రికార్డులు సృష్టించాయి.

''అప్పట్లో ఇవి చాలా పెద్దవి. కానీ, నేడు అవి మనకు చిన్న నౌకల్లానే కనిపిస్తాయి’’అని ముర్తా అన్నారు.

టైటానిక్ పొడవు 269 మీటర్లు. సిబ్బంది, ప్రయాణికులు మొత్తంగా 3,300 మంది దీనిలో ప్రయాణించొచ్చు.

ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద నౌక పేరిట రికార్డు ''వండర్ ఆఫ్ ది సీస్’’ పేరిట ఉంది. ఇది 362 మీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో 7,000 మంది ప్రయాణించొచ్చు.

4. భద్రతా ప్రమాణాలు

టైటానిక్‌లో చాలా భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ, 1500 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మరణించారు.

ఆ తర్వాత భద్రతా ప్రమాణాల టెక్నాలజీ చాలా మెరుగుపడింది. ఇప్పుడు మంచు శకలాలను ముందుగానే గుర్తించేందుకు రాడార్లను ఉపయోగిస్తున్నారు.

రాడార్ల వినియోగం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైంది. ''టైటానిక్ సమయంలో ముందు ఏముందో చూసుకుంటూ నడిపేవారు’’అని ఫినో చెప్పారు.

''ఎదురుగా ఏదైనా మంచు శకలం ఉందేమోనని మొదట కెప్టెన్ చూడాల్సి ఉంటుంది. అలా చూస్తూ నడపం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా నౌక వేగంగా వెళ్లేటప్పుడు అది మరింత ప్రమాదకరం’’అని ఆయన వివరించారు.

ఈ నౌక ఎలాంటి పరిస్థితుల్లోనూ మునిగిపోదనే నమ్మకం వల్ల ప్రమాద సమయంలో అవసరమయ్యే చిన్నచిన్న పడవల సంఖ్యను తగ్గించారని ఫినో పేర్కొన్నారు.

''టైటానిక్ ప్రమాదం తర్వాత నౌకల్లో భద్రతా ప్రమాణాలు చాలా మెరుగుపడ్డాయి. నౌకా నిర్మాణంలోనూ చాలా మార్పులు వచ్చాయి’’అని ఆయన చెప్పారు.

''నేడు మనం కళ్లతో చూడకముందే, రాడార్, సోనార్ సాంకేతికతలు ఆ మంచు శకలాలను గుర్తించగలవు’’అని ఆయన అన్నారు.

''అంతేకాదు, నాటికల్ చార్ట్స్, సముద్రం మ్యాప్‌లు.. ఇలా చాలా కొత్త సాంకేతికలు మనకు అందుబాటులోకి వచ్చాయి’’అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Titanic: The real reason behind the sinking of the ship
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X