వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టోక్యో ఒలింపిక్స్: భారత్ గెలిచిన, తృటిలో చేజారిన పతకాలు ఇవే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పీవీ సింధు

భారతీయ స్టార్ షట్లర్ పీవీ సింధు గత ఆదివారం చరిత్ర సృష్టించారు. చైనాకు చెందిన హే బింగ్ జియావోపై గెలిచి ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న తొలి భారత మహిళగా సింధు చరిత్ర సృష్టించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకాన్ని గెలిచిన సంగతి తెలిసిందే.

ఒలింపిక్స్‌లో 13 రోజులు పూర్తయ్యాయి. భారత్ ఇప్పటివరకు అయిదు పతకాలు గెలుచుకుంది. వీటిలో మొదటిది వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ మీరాబాయి చానూ 49 కేజీల కేటగిరీలో గెలుచుకున్న రజత పతకం. రియో ఒలింపిక్స్‌లో గాయం కావడంతో తొలి రౌండ్లోనే ఆమె వెనక్కి వచ్చేశారు. అయితే, ఆనాడు నేర్చుకున్న పాఠాలతో టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె రజతం గెలుచుకున్నారు.

మరోవైపు ఇటు పురుషులు అటు మహిళలు.. రెండు హాకీ జట్లూ మంచి ఫామ్‌లో ఉన్నాయి. పురుషుల జట్టు ఇప్పటికే కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మరోవైపు మహిళల జట్టు కూడా కాంస్యం కోసం బ్రిటన్‌తో ఆగస్టు 6న తలపడనుంది.

కొన్ని పతకాలను భారత్ తృటిలో చేజార్చుకుంది. మరికొంత మంది క్రీడాకారులు పతకాలు తెస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

భారత మహిళల హాకీ జట్టు

మహిళల హాకీ జట్టు..

గత సోమవారం ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో విజయం సాధించి భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌తో ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టిన తొలి భారత జట్టుగా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది.

1980ల్లో చివరిసారిగా భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన ఇచ్చింది. ఆనాడు భారత్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

అయితే, బుధవారం సెమీస్‌లో అర్జెంటీనాపై జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. భారత్‌పై 2-1 తేడాతో అర్జెంటీనా గెలిచింది.

దీంతో కాంస్య పతకం కోసం శుక్రవారం, ఆగస్టు 6న బ్రిటన్‌తో భారత మహిళల జట్టు తలపడనుంది.

భారత పురుషుల హాకీ జట్టు

పురుషుల జట్టు..

గత సోమవారం బ్రిటన్‌ను 3-1 తేడాతో ఓడించి భారత పురుషుల జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

అయితే, సెమీస్‌లో మంగళవారం, ఆగస్టు 3న బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది.

దీంతో కాంస్య పతకం కోసం గురువారం జర్మనీతో భారత పురుషుల జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో 5-4 తేడాతో భారత జట్టు విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలిచింది.

గత 41 ఏళ్లలో భారత హాకీ జట్టు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోవడం ఇదే తొలిసారి. 1980ల్లో భారత పురుషుల హాకీ జట్టు మంచి ఫామ్‌లో ఉండేది. అప్పట్లో భారత్ మొత్తంగా ఎనిమిది స్వర్ణ పతకాలు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత క్రమంగా ఆ స్థానాన్ని భారత్ కోల్పోతూ వచ్చింది.

లవ్లీనా బోర్గోహైన్

బాక్సింగ్‌లో...

సెమీ ఫైనల్స్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చెన్ నియెన్ చిన్‌పై గెలిచి లవ్లీనా బోర్గోహైన్ సెమీస్‌లోకి అడుగుపెట్టారు.

సెమీస్‌లో టర్కీకి చెందిన ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి సుర్మేనేలితో లవ్లీనా తలపడ్డారు. అయితే 5-0 తేడాతో లవ్లీనా ఓడిపోయారు. దీంతో ఆమెకు కాంస్య పతకం దక్కింది.

బ్యాక్సింగ్‌లో మూడో స్థానం కోసం మ్యాచ్ ఉండదు. సెమీస్‌లో చివరన నిలిచిన ఇద్దరికీ కాంస్య పతకాలు అందజేస్తారు.

నీరజ్ చోప్రా

జావెలిన్ త్రో

నీరజ్ చోప్రా నేతృత్వంలోని పోటీ పడుతున్న భారత జావెలిన్ బృందం పతకం సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

గత మార్చిలో జరిగిన భారత గ్రాండ్ ప్రిక్స్‌లో 88.07 మీటర్లకు జావెలిన్‌ను విసిరి నీరజ్ చరిత్ర సృష్టించారు. 2019 ఆసియా గేమ్స్‌లోనూ రికార్డు స్థాయిలో 88.06 మీటర్లకు ఆయన జావెలిన్‌ను విసిరారు.

అంతా ఊహించినట్లుగానే బుధవారం, ఆగస్టు 4న జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో 86.65 మీటర్లకు జావెలిన్ విసిరి, నీరజ్ ఫైనల్స్‌లో చోటు సంపాదించారు. ఈ ఫైనల్స్ శనివారం ఆగస్టు 7న జరగబోతున్నాయి.

రవి కుమార్ దహియా

రెజ్లింగ్

భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్‌లు పతకాలు తెస్తారని అందరూ భావించారు.

ఆగస్టు 5న జరిగిన ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో స్వీడన్ క్రీడాకారిణి సోఫియా మగ్దలేనాను వినేశ్ ఓడించారు. అయితే, క్వార్టర్ ఫైనల్స్‌లో బెలరూస్‌కు చెందిన వెనీసా కలజిస్కాయా చేతిలో వినేశ్ ఓడిపోయారు.

పూనియా ఇప్పటికే మూడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలిచారు. 65కేజీల పురుషుల విభాగంలో ఆగస్టు 6న పూనియా తలపడబోతున్నారు.

మరోవైపు రెజ్లర్ రవి కుమార్ దహియా పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో సెమీ ఫైనల్స్‌లో కజఖ్‌స్తాన్ రెజ్లర్ నూరిస్తామ్‌పై గెలిచారు. రష్యాకు చెందిన జవూర్ ఉగుయెవ్‌తో స్వర్ణం కోసం జరిగిన కుస్తీ పోరులో రవి కుమార్ 4-7 తేడాతో ఓడిపోయారు. దాంతో, ఆయనకు సిల్వర్ మెడల్ లభించింది.

ఒలింపిక్ గేమ్స్‌లో సుశీల్ కుమార్ తరువాత రజతం గెల్చుకున్న రెండవ కుస్తీ యోధుడిగా రవి దహియా గుర్తింపు పొందారు.

మరోవైపు భారత్‌కు చెందిన మరో రెజ్లర్ దీపక్ పూనియా 86 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో కార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన జుషెన్ లీపై గెలిచారు. అయితే, సెమీస్‌లో ఆయన ఓడిపోయారు.

కాంస్య పతకం కోసం శాన్ మరీనోకు చెందిన మైల్స్ అమీన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌‌లో ఓడిపోవడంతో పూనియా పతకం ఆశలు ఆవిరైపోయాయి.

కమల్‌ప్రీత్

డిస్కస్ త్రో..

మహిళల డిస్కస్ త్రోలో కమల్‌ప్రీత్ పతకం సాధిస్తారని అంతా ఆశించారు. 64 మీటర్లకు డిస్కస్ త్రో విసిరి ఆమె ఫైనల్స్‌లో చోటు సంపాదించారు.

అయితే, ఆగస్టు 2న జరిగిన ఫైనల్స్‌లో కమల్‌ప్రీత్ ఆరో స్థానంలో నిలిచారు.

మను భాకర్

షూటింగ్..

15 మంది షూటర్లతో వెళ్లిన భారత బృందం కచ్చితంగా పతకాలు సాధిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఫలితాలు ఊహించిన స్థాయిలో రాలేదు.

మను భాకర్‌, సౌరభ్ చౌధరిల జంట మిక్సిడ్ 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో తొలి దశలో మంచి ప్రదర్శన ఇచ్చింది. అయితే, రెండో దశ క్వాలిఫైంగ్ రౌండ్‌లో వీరు వెనుదిరగాల్సి వచ్చింది.

మను భాకర్‌కు పతకం వస్తుందని గట్టి అంచనాలు ఉన్నాయి. అయితే, ఆమె పాల్గొన్న మూడు ఈవెంట్లలో ఒక్క దానిలో కూడా ఆమె ఫైనల్‌కు చేరుకోలేదు. పది మీ. విమెన్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఆమె గన్‌లో సాంకేతికత లోపం తలెత్తింది. దీంతో ఆమెపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. విలువైన సమయాన్ని కూడా ఆమె కోల్పోయారు.

పురుషుల పది మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ప్రపంచ నంబర్ 2 సౌరభ్ చౌధరి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. అయితే, అక్కడ తొలి మూడు స్థానాల్లో నిలవడంలో ఆయన విఫలమయ్యారు.

గత ఒలింపిక్స్‌లో భారత పతకాలు ఇవీ...

  • 2016 రియో ఒలింపిక్స్: ఒక రజతం, ఒక కాంస్యం
  • 2012 లండన్ ఒలింపిక్స్: రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు
  • 2008 బీజింగ్ ఒలింపిక్స్: ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు
మేరీ కోమ్

బాక్సింగ్

రెండో ఒలింపిక్స్‌లో ఓటమిని చవిచూసినప్పటికీ, మేరీ కోమ్‌ను అందరూ విజేతగానే చూస్తారు.

51 కేజీల విభాగంలో కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ విక్టోరియా చేతిలో మేరీ ఓడిపోయారు. దీంతో పోటీ నుంచి ఆమె వైదొలగాల్సి వచ్చింది.

మొదట్లో ఆమె గెలిచారని అంతా అనుకున్నారు. అయితే, ఆమె ఓడిపోయారని తెలియడంతో షాక్‌కు గురయ్యారు. 3-2 తేడాతో న్యాయ నిర్ణేతలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించడంతో ఆమె గందరగోళానికి గురయ్యారు. చివరగా ఆమె ఓటమిని అంగీకరించారు.

లండన్ ఒలింపిక్స్‌లో మేరీ కాంస్య పతకాన్ని గెలిచారు.

దీపికా కుమారి

ఆర్చరీ

ఆర్చరీ రీకర్వ్ కేటగిరీలో ప్రపంచ నంబర్ 1గా కొనసాగుతున్న దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్‌లో కొరియా క్రీడాకారిణి ఆన్ శాన్ చేతిలో వరుస రౌండ్లలో ఓడిపోయారు.

ఒలింపిక్స్ నుంచి ఇలా ఖాళీ చేతులతో వెనుదిరగడం ఆమెకిది మూడోసారి. 2016 రియో ఒలింపిక్స్‌, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఓడిపోయారు.

మరోవైపు ఆమె భర్త అతాను దాస్ కూడా జపాన్‌కు చెందిన టకహారు ఫురుకావా చేతిలో ఓటమికి గురయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Tokyo Olympics: These are the medals that India has won and narrowly missed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X