వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువకుడి కాల్చివేత: అమెరికాలో చిచ్చు, ఆగ్రహావేశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: నల్లజాతి యువకుడిపై కాల్పులు జరిపి చంపిన శ్వేతజాతి పోలీసుపై అభియోగం మోపనక్కర్లేదని మిస్సోరీ గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయించడంతో నిరసనలు, ఆందోళనలతో అమెరికా అట్టుడికి పోయింది. ఈ ఏడాది ఆగస్టు9వ తేదీన డారెన్‌ విల్సన్‌ అనే పోలీసు అధికారి మైకేల్‌ బ్రౌన్‌ అనే నల్లజాతి యువకుడిని కాల్చి చంపాడు. లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అతనిపై కాల్పులు జరిపి, చంపేశారని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మీడియాలో కథనాలు వచ్చాయి.

కేసుకు సంబంధించి ఏర్పాటైన గ్రాండ్‌ జ్యూరీ అందరి వాదనలనూ విని డారెన్‌ విల్సన్‌ తప్పేమీ లేదని, అతడిపై అభియోగం మోపాల్సిన పని లేదని నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రాంతం భగ్గుమంది. సోమవారం రాత్రి వందల సంఖ్యలో నిరసనకారులు సెయింట్‌లూయీస్‌ శివార్లలోని ఫెర్గూసన్‌కు చేరుకుని హింసాత్మక ఆందోళనలకు దిగారు. మిస్సోరీ గవర్నర్‌ నుంచి అమెరికా అధ్యక్షుడు ఒబామా దాకా పలువురు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.

ఆందోళనకారులు కనీసం 12 భవనాలను తగలబెట్టారు. పాఠశాలలను మూసివేశారు. పోలీసులు వారిని చెల్లాచెదురు చేసేందుకు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌, ఫ్లాష్‌-బ్యాంగ్‌ కానిస్టర్లను ప్రయోగించారు. వారిలో ఒకరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని, నిరసనకారులు తమపై ఇటుకలు, రాళ్లు, సీసాలు, బ్యాటరీలు విసిరినప్పటికీ కాల్పులు జరపలేదని వారు స్పష్టం చేశారు. మైకేల్‌ బ్రౌన్‌పై విల్సన్‌ కాల్పులు జరిపిన మరుసటిరోజు కంటే సోమవారం జరిగిన ఆందోళనల తీవ్రత మరింత ఎక్కువగా ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు.

ఫెర్గూసన్‌లోనే కాదు, అమెరికా వ్యాప్తంగా న్యూయార్క్‌, చికాగో, సియాటెల్‌, లాస్‌ ఏంజెలిస్‌, ఓక్‌లాండ్‌, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌ డీసీ తదితర రాష్ట్రాల్లో సైతం ఈ అంశంపై నిరసనకారులు భగ్గుమన్నారు. వెయ్యిమందికి పైగా ఆందోళనకారులు అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ వద్ద గుమిగూడి గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘నో జస్టిస్‌.. నో పీస్‌', ‘బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌' అని నినదించారు. ఈ ప్రదర్శనను చూసిన టీనేజర్లలో చాలామంది అది కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

మైకేల్‌ బ్రౌన్‌ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మాత్రం కోర్టు నిర్ణయం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మైకేల్‌ బ్రౌన్‌ తల్లిదండ్రులు సర్వం కోల్పోయారని ప్రెసిడెంట్‌ ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికీ పోలీసులకు శ్వేతజాతేతరులకు నడుమ అపనమ్మకాలు నెలకొని ఉన్నాయనే నిజాన్ని గుర్తించాలన్నారు. శ్వేతజాతేతరుల సాధకబాధకాలను గుర్తించి, వాటిని తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. శ్వేతజాతేతరుల్లో విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు ఫెర్గూసన్‌ సహా దేశవ్యాప్తంగా నిర్మాణాత్మకం చర్యలు చేపడుతున్నట్టు అటార్నీ జనరల్‌ ఎరిక్‌ హోల్డర్‌ వివరించారు.

జరిగిన ఘటనపై డారెన్‌ విల్సన్‌ వాదనను అధికారులు విడుదల చేశారు. ఆగస్టు అతడికి ఒక దొంగతనంతో సంబంధం ఉన్నదనే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి తాను ప్రయత్నించగా, మైకేల్‌ బ్రౌన్‌ తనతో దుర్భాషలాడాడని, అతడు తన ముఖంపై ముష్టిఘాతాలు కురిపించేందుకు ముందుకు రావడంతో, ప్రాణ రక్షణ కోసం గత్యంతరం లేకనే తాను కాల్పులు జరిపినట్టు పోలీసు అధికారి గ్రాండ్‌ జ్యూరీకి చెప్పాడు.

 Troop force tripled in Ferguson as Obama condemns violence

మీడియా కథనాలు: ఆగస్టు 9న ఏం జరిగింది?

ఆరోజున ఏం జరిగిందనే దానిపై పోలీసులు, బ్రౌన్‌ తరఫువారి వాదన భిన్నంగా ఉన్నాయి. పోలీసులు చెబుతున్నదాని ప్రకారం...

మైకేల్‌ బ్రౌన్‌, డోరియన్‌ జాన్సన్‌.. ఇద్దరూ స్నేహితులు. ఆగస్టు 9న వీరు తమ బంధువుల ఇంటికి వెళ్తున్నారు. వారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా, పోలీసు అధికారి డారెల్‌ విల్సన్‌ ఆ దారిన తన వాహనంలో వచ్చారు. డ్రైవింగ్‌ సీటులోనే కూర్చుని వారిని ఉద్దేశించి ఫుట్‌పాత్‌ మీదకు వెళ్లాల్సిందిగా అరిచారు. అంతలోనే, బ్రౌన్‌ను గమనించి అంతకుముందే స్థానికంగా జరిగిన ఒక దొంగతనం కేసులో నిందితుడి పోలికలతో అతడి ముఖకవళికలు సరిపోలినట్టు భావించి కారును వారికి దగ్గరగా పోనిచ్చి స్నేహితులను ఇద్దరినీ అడ్డగించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొన్ని సెకన్లపాటు ఘర్షణ జరిగింది.

ఇంతలోనే డారెన్‌ చేతిలోని తుపాకీ పేలింది. ఒక బుల్లెట్‌ బ్రౌన్‌ బొటనవేలిలోకి దూసుకుపోయింది. రెండోది గురి తప్పింది. దీంతో బ్రౌన్‌ పరుగులు తీయడం ప్రారంభించాడు. అతడు పరిగెత్తడంతో డారెన్‌ మళ్లీ కాల్పులు ప్రారంభించాడు. బ్రౌన్‌ ఆగి వెనక్కి (డారెన్‌ పైకి) దూసుకురావడంతో శరీరంలోకి మొత్తం ఆరుగుళ్లు దూసుకుపోయాయి. తాము చెప్పిన కథనానికి నిదర్శనంగా పోలీసులు ఒక వీడియోను విడుదల చేశారు. అందులో బ్రౌన్‌ ఒక దుకాణంలో సిగార్లు తీసుకుని, డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోతుంటే దుకాణ దారు అడ్డుకున్నాడు. అతణ్ని తోసేసి బ్రౌన్‌ వెళ్లిపోయినట్టు ఉంది.

బ్రౌన్‌ స్నేహితుడు డోరియన్‌ ప్రకారం..

వారిద్దరూ కలిసి వెళ్తుండగా దారి మధ్యలో డారెన్‌ విల్సన్‌ (పోలీసు) ఎదురై వారిని పక్కకు తప్పుకోమని అదిలించారు. ఒక్క నిమిషంలో తాము తమ గమ్యానికి చేరుకుంటామని చెప్పినా డారెన్‌ వినలేదు. కారును దూసి వారి పక్కన ఆపాడు. తెరిచి ఉన్న విండోలోంచి బ్రౌన్‌ మెడ పట్టుకుని లగాడు. బ్రౌన్‌ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. విల్సన్‌ పట్టు నుంచి తప్పించుకునేందుకు బ్రౌన్‌ విశ్వప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో విల్సన్‌ తన తుపాకీ తీసి.‘నిన్ను కాల్చేస్తాను' అని బెదిరించాడు. అలా అంటూనే ఫైరింగ్‌ ఓపెన్‌ చేశాడు. ఈ గందరగోళంలో అతడి పట్టు నుంచి తప్పించుకున్న బ్రౌన్‌ అక్కణ్నుంచీ పరిగెత్తాడు. విల్సన్‌ కారులోంచి కిందకి దిగి బ్రౌన్‌పైకి కాల్పులు జరిపాడు. దీంతో పారిపోతున్న బ్రౌన్‌ సరెండర్‌ అయ్యేందుకు వెనక్కి తిరిగాడు. చేతులు పైకెత్తి.. ‘నా వద్ద తుపాకీ లేదు. కాల్పులు ఆపండి' అని వేడుకున్నాడు. కానీ, విల్సన్‌ వినిపించుకోలేదు. తన కాల్పులను కొనసాగించాడు.

గ్రాండ్‌ జ్యూరీ ఏం చెప్పింది?

ఈ కేసులో డారెన్‌ విల్సన్‌పై ఏయే కారణాలపై అభియోగం మోపడానికి అవకాశం ఉందో తేల్చాల్సిన పని గ్రాండ్‌ జ్యూరీది. ఇందులో 12 మంది సాధారణ పౌరులు సభ్యులుగా ఉన్నారు. వారిలో 9 మంది తెల్లవారు. ముగ్గురు నల్లజాతీయులు. ఈ పన్నెండు మందిలో కనీసం తొమ్మిది మంది అంగీకరిస్తేనే డారెన్‌పై నేరారోపణ చేయవచ్చు. గత మూడు నెలల్లో గ్రాండ్‌ జ్యూరీ 25 సార్లు సమావేశమై 60 మంది సాక్ష్యులను దాదాపు 70 గంటలపాటు విచారించింది. దీంతోపాటు ఫోరెన్సిక్‌ నివేదికలను కూడా పరీక్షించి, విశ్లేషించారు. చివరగా డారెన్‌ విల్సన్‌ తప్పేమీ లేదని, అతడిపై నేరారోపణ చేయనక్కర్లేదని నిర్ణయించారు.

English summary
More than 2,000 soldiers were ordered into the riot-torn US town of Ferguson on Tuesday, as President Barack Obama condemned violence which erupted after a grand jury chose not to charge a white police officer who shot dead an unarmed black teen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X