వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Truman Doctrine: 75 ఏళ్ల కిందట ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది పలికిన 33 సెకన్లు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అమెరికా 33వ అధ్యక్షుడు హారీ ట్రూమన్

అమెరికా పార్లమెంటు భవనం కాపిటల్ హిల్. ప్రతినిధుల సభ (దిగువ సభ) కిక్కిరిసి ఉంది. అమెరికా 33వ అధ్యక్షుడు హారీ ట్రూమన్ పోడియం ముందుకు వచ్చారు.

అప్పుడు ఆయన వయసు 62 ఏళ్లు. ఆయన ముదురు రంగు సూట్, చారల టై ధరించి ఉన్నారు. చేతిలో చిన్న ఫైల్, అందులో కొన్ని కాగితాలు ఉన్నాయి. పోడియం మీదున్న గ్లాసు తీసుకుని ఒక గుక్క నీళ్లు తాగారు. గుండ్రని కళ్లద్దాల్లోంచి ఒకసారి హాలులో ఉన్న శ్రోతలందరినీ కలియజూశారు. పోడియం మీద చేతులు ఆన్చారు.

''ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అందువల్ల నేను కాంగ్రెస్ (పార్లమెంటు) సంయుక్త సమావేశం ముందుకు రావలసిన అవసరమొచ్చింది. ఈ దేశపు విదేశాంగ విధానం, జాతీయ భద్రత అంశాలు ముడిపడి ఉన్నాయి'' అన్నారు.

ఆ రోజు 1947 మార్చి 12వ తేదీ.

దానికి కేవలం రెండేళ్ల ముందే రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. హిట్లరీ పాలనలోని జర్మనీ మీద గెలుపుతో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు లేదన్న భావన నెలకొంది.

కానీ రెండేళ్లు తిరక్కముందే దానికన్నా చాలా తీవ్రమైన ముప్పు పొంచివుందని దేశాధ్యక్షుడు ట్రూమన్ ఆనాటి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో చెప్పారు.

రెండో ప్రపంచంలో అమెరికా మిత్రపక్షమైన సోవియట్ యూనియన్‌ను, కమ్యూనిజాన్ని నిలువరించటానికి అమెరికా నిబద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రసంగం 'ట్రూమన్ డాక్ట్రిన్' (ట్రూమన్ సిద్ధాంతం లేదా సూత్రం)గా పేరుగాంచింది.

ప్రచ్ఛన్న యుద్ధానికి మూలాలు చాలా సంక్లిష్టమైనవే. వాటి మీద చాలా చాలా చర్చ జరిగింది. కోల్డ్ వార్‌కు కారణం ట్రూమన్ డాక్ట్రిన్ కాకపోయినప్పటికీ.. ఆ యుద్ధాన్ని ప్రకటించిన క్షణం అదేనని కొందరు చరిత్రకారులు పరిగణిస్తుంటారు.

ఆశావహ వాతావరణాన్ని అంత వేగంగా భయం ఎందుకు కప్పేసింది?

ట్రూమన్ సిద్ధాంతం

ఏం మారింది?

అసలు సోవియట్ యూనియన్ ఏర్పడినప్పటి నుంచే యూఎస్ఎస్ఆర్‌కు పశ్చిమ దేశాలకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రముఖ చరిత్రకారుడు, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ప్రొఫెసర్ మెల్విన్ లెఫ్లర్ చెప్తున్నారు.

''అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌‌లు 1917లో, 1918లో, 1919లో రష్యాలో జోక్యం చేసుకున్నాయి'' అని ఆయన తెలిపారు.

''యుద్ధ కాలమంతా పశ్చిమ యూరప్‌లో రెండో రణరంగం తెరుచుకుంటుందనే ఉద్రిక్తత ఉండేది. 1942లోనే ఆ రణరంగానికి తెరతీయాలని స్టాలిన్ భావించారు. కానీ 1944 వరకూ అది జరగలేదు'' అని చెప్పారు.

అంతేకాదు, అమెరికా, బ్రిటన్‌లు ఒక అణు బాంబును అభివృద్ధి చేసి ఆ విషయం స్టాలిన్‌కు తెలియకుండా రహస్యంగా దాచిపెట్టాయి. కానీ స్టాలిన్ తన గూఢచారుల ద్వారా ఆ రహస్యాన్ని తెలుసుకున్నారు. తమ మీద గూఢచర్యం జరుగుతోందని అమెరికాకూ తెలుసు.

కానీ నాజీ జర్మనీ, ఇటలీ, జపాన్‌లతో కూడిన అక్ష కూటమిని ఓడించాల్సిన ఆవశ్యకత.. మిగతా అన్ని అంశాలనూ పక్కనపెట్టేలా చేసిందంటారు ప్రొఫెసర్ మెల్విన్.

యుద్ధం ముగిసిన వెంటనే అమెరికా ప్రభుత్వాధినేతలు ప్రాధాన్యంగా తీసుకున్న అంశం.. ఇకపై ఏ శత్రువుకు కూడా యూరప్, ఆసియాల్లోని వనరులపై పట్టు సాధించే అవకాశం లేకుండా చూడటం.

స్టాలిన్

''1946, 1947ల్లో అతి పెద్ద భయం.. స్టాలిన్ పాలనలోని యూఎస్ఎస్ఆర్ సైనిక దాడికి కాలుదువ్వుతుందనేది కాదు. యుద్ధానంతర యూరప్‌లో నెలకొని ఉన్న సామాజిక ఆగ్రహం, రాజకీయ కల్లోలాలను స్టాలిన్ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటారేమోననేది అప్పుడు చాలా పెద్ద భయంగా ఉంది. అప్పటికే ఇటలీ, ఫ్రాన్స్‌లలో కమ్యూనిస్టు పార్టీలు విజయవంతంగా అధికారం సాధించాయి'' అని చరిత్రకారుడు లెఫ్లర్ 'బీబీసీ ద ఫోరమ్‌’కు వివరించారు.

దీనికి తోడు చైనాలో కమ్యూనిస్టులు అంతర్యుద్ధం చేస్తున్నారు. వారు గెలిచేట్లయితే తూర్పు ఆసియా అంతటా స్టాలిన్ తన ప్రభావం చూపగలరు.

ఒక దేశంలోని కామ్యూనిస్టేతర ప్రభుత్వం కూలిపోతే.. ఆ చుట్టుపక్కల దేశాల్లోని కమ్యూనిస్టేతర ప్రభుత్వాలు కూడా కూలిపోతాయనే 'డొమినో థియరీ' మరింత భయపెట్టింది. ఈ భయం అమెరికా విదేశాంగ విధానాన్ని దశాబ్దాల పాటు వెంటాడింది.

ఆపైన పరస్పరం ఆగ్రహం కలిగించే ప్రవర్తనలకు తోడు మాటల యుద్ధాలు కలిసి ట్రూమన్ సిద్ధాంతానికి బాటలు పరిచాయి.

యుద్ధం ముగిసిన తర్వాత స్టాలిన్ 1946 ఫిబ్రవరి 9న మాస్కోలో ప్రసంగిస్తూ.. 'ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ' మీద మరో మహా యుద్ధం ముసురుకుంటోందని వ్యాఖ్యానించారు.

మాస్కోలో అమెరికా రాయబారిగా ఉన్న జార్జ్ కెన్నన్

''ట్రూమన్ సహా చాలా మంది అమెరికా నేతలు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మిగతవాళ్లు ఇది దాదాపు మూడో ప్రపంచ యుద్ధపు ప్రకటనగా చూశారు'' అని ఒహాయోలోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో కమ్యూనికేషన్ స్టడీస్ ప్రొఫెసర్ డెనిస్ బోస్టడార్ఫ్ పేర్కొన్నారు.

సోవియట్ రష్యా విస్తరణవాదం గురించి, ఆ దేశపు అంతర్జాతీయ ఉద్దేశాల గురించి విశ్లేషణ పంపించాల్సిందిగా అమెరికా విదేశాంగ విభాగం మాస్కోలోని తన రాయబార కార్యాలయాన్ని కోరింది.

అప్పుడు మాస్కోలో అమెరికా రాయబారిగా ఉన్న జార్జ్ కెన్నన్ పంపిన సమాధానం విస్ఫోటనాత్మకంగా మారింది.

''కెన్నన్ 8,000 పదాల టెలిగ్రామ్ డిక్టేట్ చేశారు. అందులో ఆయన ఉపమానాలను ఉపయోగించారు: కమ్యూనిజం ఒక వ్యాధి లాగా శరీరపు సమగ్రతను ఉల్లంఘిస్తూ దానిని అంతర్గతంగా ధ్వంసం చేస్తోంది'' అని చెప్పారు.

కార్మిక సంఘాల్లో, పౌర హక్కుల సంస్థల్లో, సాంస్కృతిక బృందాల్లో కమ్యూనిస్టులు చొరబడే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అలా జరిగితే శత్రువు లోపలికి వచ్చేసినట్లేనని భావించారు.

సోవియట్ విధానాలు.. పశ్చిమ దేశాలను శత్రుపూరితంగా పరిగణించాయని, సోవియట్ విస్తరణవాదం అనివార్యమని ఆయన హెచ్చరించారు. సోవియట్‌ను ఎదుర్కోవటానికి సహనవంతమై. దృఢమైన, నిరంతర నిఘాతో కూడిన దీర్ఘకాలిక నియంత్రణ విధానం అవసరమని సిఫారసు చేశారు.

దీనినే ''పొడవాటి టెలిగ్రామ్''(The Long Telegram) అని పిలుస్తారు.

చర్చిల్, ట్రూమన్

'శాంతి పునాదులు

కొన్ని వారాల తర్వాత యుద్ధ కాలంలో బ్రిటన్ నాయకుడు విన్‌స్టన్ చర్చిల్ 1946 మార్చి ఆరంభంలో మిస్సోరిలో మాట్లాడుతూ.. ''బాల్టిక్‌లోని స్టెటిన్ మొదలుకుని ఆడ్రియాటిక్‌లోని ట్రీస్టే వరకూ యూరప్ ఖండం మీద ఒక ఉక్కు తెర పడింది'' అని వ్యాఖ్యానించారు.

''దీని వెనుక మధ్య, తూర్పు యూరప్‌కు చెందిన ప్రాచీన రాజధానులు వార్సా, బెర్లిన్ర, ప్రేగ్, వియన్నా, బుడాపెస్ట్, బెల్‌గ్రేడ్, బుఖారెస్ట్, సోఫియా ఉన్నాయి. ఈ నగరాలు, అందులోని జనాలు, వాటి చుట్టూ ఉన్న దేశాలు అన్నీ.. సోవియట్ వలయంలో ఉన్నాయి'' అని పేర్కొన్నారు.

చర్చిల్ చేసిన ఈ 'శాంతి పునాదుల' ప్రసంగం మీద స్టాలిన్ మండిపడ్డారు. చర్చిల్ యుద్ధం కోరుకుంటున్నారని విమర్శించారు.

''స్టాలిన్ కోపంతో రగిలిపోయారు. అప్పటికి కొన్ని నెలల ముందు వరకూ మృదువుగా ఉన్న చర్చిల్.. అమెరికా, బ్రిటన్ సైనిక కూటమిని ప్రతిపాదించారు'' అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో ఇంటర్నేషనల్ హిస్టరీ ప్రొఫెసర్ వ్లాదిస్లావ్ జుబోక్ చెప్పారు.

''దీంతో స్టాలిన్‌లో చాలా తీవ్ర అనుమానం రేగింది. సోవియట్ ప్రజలు మరింత ఉక్కు తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రహస్యంగా అణుబాంబులు చేయాలని సోవియట్ శాస్త్రవేత్తలకు నిర్దేశించారు. మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించాలని కోరకున్నందుకు కాదు.. చాలా లోతుగా అభద్రతా భావంతో ఉండవటం వల్ల'' అని విశ్లేషించారు.

రష్యా (ఎడమ నుంచి కుడికి) రాయబారి నొవికోవ్, దౌత్యవేత్త ఆండ్రే విషిన్స్కీ, విదేశాంగ మంత్రి వియాచెస్లావ్ లొలొటోవ్

రాబోయే కాలంలో సోవియట్ రష్యా ఉద్దేశాలు ఏమిటనేది తెలుసుకోవటానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నట్లుగానే.. సోవియట్ నేతలు కూడా తమ మాజీ మిత్రులు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవటానికి ప్రయత్నించారు.

అమెరికాలోని సోవియట్ రాయబారి నికొలాయ్ నొవికోవ్ 1946 డిసెంబర్‌లో మాస్కోకు ఒక టెలిగ్రామ్ పంపించారు.

రెండో ప్రపంచం యుద్ధం నుంచి బయటపడిన అమెరికా ఆర్థికంగా బలపడిందని, ప్రపంచం మీద ఆధిపత్యం చేపట్టాలని గట్టిగా భావిస్తోందని ఆయన హెచ్చరించారు.

''అమెరికా విదేశాంగ విధానం అమెరికా గుత్త పెట్టుడి సామ్రాజ్యవాద పోకడలను ప్రతిఫలిస్తోంది. యుద్ధానంతర కాలంలో ప్రపంచ ఆధిపత్యం కోసం తలపడుతోంది. ప్రపంచానికి నాయకత్వం వహించే హక్కు అమెరికాకు ఉంది అనేది అధ్యక్షుడు ట్రూమన్, అమెరికా పాలకవర్గంలోని ఇతర ప్రతినిధుల మాటల నిజమైన అర్థం. అమెరికా దౌత్యవిధానంలోని సైన్యం, వైమానిక దళం, నౌకాదళం, పరిశ్రమలు, సైన్స్ రంగం అన్నీ ఈ విదేశాంగ విధానానికి సేవ చేస్తున్నాయి'' అని ఆ టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు.

ఇరు దేశాల రాయబారులు పంపిన ఈ రెండు టెలిగ్రామ్‌లు.. ప్రచ్ఛన్న యుద్ధపై వైరి పక్షాల మధ్య అప్పటికే నెలొకన్న భయం, అనుమానం, అపనమ్మకాలను బలంగా చాటుతాయి.

ఇక 1947 ఫిబ్రవరి 21న బ్రిటన్ విదేశాంగ కార్యాలయం నుంచి అమెరికా విదేశాంగ శాఖకు ఒక లేఖ వచ్చింది. యుద్ధపు అప్పులతో ఆర్థికంగా చితికిపోవటం, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో కూరుకుపోవటం, క్రూరమైన చలికాలం పెను దెబ్బతీయటం వంటి పరిస్థితుల్లో.. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఉన్న గ్రీస్, టర్కీలకు హామీ ఇచ్చినట్లుగా సైనిక సాయం, ఆర్థిక భద్రతను అందించే పరిస్థితి ఇక ఏమాత్రం లేదన్నది ఆ లేఖ సారాంశం.

ట్రూమన్ సిద్ధాంతం

ఆ తర్వాత 90 రోజులకు.. ఆ రెండు దేశాలకు సాయం చేయటానికి 40 కోట్ల డాలర్లు ఇవ్వాలని అమెరికా పార్లమెంటు కాంగ్రెస్‌ను ట్రూమన్ తన చరిత్రాత్మక ప్రసంగంలో కోరారు. కమ్యూనిజం మీద అన్ని రంగాల్లోనూ పోరాడటానికి ప్రతి అమెరికా పౌరులూ కట్టుబడాలని కోరారు.

ఇతర దేశాలకు ఆర్థిక సాయం అందించే సంప్రదాయం అప్పటివరకూ అమెరికాకు లేదు. దీనికి కాంగ్రెస్ నేతల మద్దతు సంపాదించటం కోసం ట్రూమన్ వారితో ప్రైవేటుగా సమావేశమయ్యారు.

కమ్యూనిస్టు తిరుగుబాటుదారులతో అంతర్యుద్ధం చేస్తున్న గ్రీస్‌కు, డార్డానెల్స్ జలసంధి మీద నియంత్రణను తమతో పంచుకోవాలని సోవియట్ రష్యా నుంచి ఒత్తిడి ఎదుర్కొటున్న టర్కీకి సాయం అందించటానికి ఒప్పించటం ఈ సమావేశాల లక్ష్యం.

అయితే దీనికి ''అమెరికా ప్రజల మద్దతు కావాలనుకుంటే.. వారికి చావు భయం కల్పించాల్సి ఉంటుంది'' అని సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ అయన సెనేటర్ ఆర్థర్ వాండెన్‌బర్గ్.. ట్రూమన్‌కు సూచించారు.

ఆ సెనెటర్ సలహాను ట్రూమన్ పాటించారు. మొత్తం 19 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో 33 సెకన్ల నిడివి మాటలు ఆ మొత్తం వాదనకు మూలంగా నిలిచాయి.

విదేశాలకు సాయం చట్టం మీద సంతకం చేస్తున్న ట్రూమన్

''సాయుధ మైనారిటీలు కానీ, విదేశీ ఒత్తిళ్లు కానీ లొంగదీసుకునే ప్రయత్నాలను ప్రతఘటించే స్వతంత్ర ప్రజలకు మద్దతు ఇచ్చే విధంగా అమెరికా విధానం ఉండాలని నేను నమ్ముతున్నా. స్వేచ్ఛా ప్రజానీకాం తమ సొంత భవిష్యత్తును తమ సొంత పద్ధతుల్లో రచించుకునేందుకు మనం సాయపడాలని నేను నమ్ముతున్నా. మన సాయం ప్రధానంగా ఆర్థికంగా, నగదు రూపంలో ఉండాలని.. అది ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి చాలా కీలకమని నేను నమ్ముతున్నా'' అనేవి ఆయన మాటలు.

ట్రూమన్ గొప్ప వక్త కాదనే వాస్తవం ఈ సందర్భంలో ఆయనకు అనుకూలంగా పనిచేసింది. ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్తున్నట్లుగా కనిపించింది. దీంతో ఆయన మాటలు మరింతగా పనిచేశాయి.

ఆయనకు చాలామంది సభికులు నిలుచుని చప్పట్లు కొట్టినా కానీ.. పూర్తి మద్దతేమీ లభించలేదు. నిజానికి ఆ తర్వాత కొన్ని వారాల పాటు వాడివేడిగా చర్చలు సాగాయి.

ఏదేమైనా కాంగ్రెస్ ఉభయ సభలూ ఆ ప్రతిపాదనను ఆమోదించాయి. 1947 మే 22వ తేదీన ట్రూమన్ ఆ బిల్లుపై సంతకం చేయటంతో అది చట్టమైంది. ''కమ్యూనిస్టుల పురోగమనం యథాలాపంగా విజయవంత కావటానికి అనుమతించబోమనే నోటీసు'' అది అని ట్రూమన్ అభివర్ణించారు.

దీనికి విరుద్ధంగా.. సోవియట్ చరిత్రకారుడు ఆండ్రీ షెస్టకోవ్ లిఖించిన పాఠ్యపుస్తకాల్లో ఆ చట్టం గురించి.. ''ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి అమెరికాకు హక్కు ఉందని 1947లో అధ్యక్షుడు ట్రూమన్ ప్రకటించారు'' అని రాశారు.

ఈ ట్రూమన్ సిద్ధాంతం మార్షల్ ప్లాన్‌కు ఆజ్యం పోసింది. నాటో ఏర్పాటుకు దారితీసింది. ఆ తర్వాత 40 ఏళ్లకు పైగా అమెరికా విదేశాంగ విధానానికి రూపాన్నిచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Truman Doctrine: 33 seconds from the start of the Cold War 75 years ago
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X