Bangladesh:ట్రంప్ ఎఫెక్ట్.. యూనస్ తో జార్జ్ సోరస్ కుమారుడు భేటీ
Bangladesh: వివాదాస్పద అమెరికన్ బిలియనీర్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ఛైర్ పర్సన్ జార్జ్ సోరస్ కుమారుడు అలెక్స్ సోరస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ ను కలిశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆసియా దేశానికి విదేశీ సహాయాన్ని నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ సమావేశం జరగడం గమనార్హం. గతేడాది అక్టోబర్లో న్యూయార్క్ లో వీరిద్దరు కలిశారు. మూడు నెలల సమయంలోనే వీరి మధ్య సమావేశం జరగడం ఇది రెండోసారి. షేక్ హసీనా పాలన పతనం తర్వాతల నోబెల్ గ్రహీత యూనస్ తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల తర్వాత న్యూయార్క్ లో మొదటి సమావేశం జరిగింది.
అలెక్స్ సోరస్, ఓఎస్ఎఫ్ అధ్యక్షుడు బినైఫర్ నౌరోజీ నేతృత్వంలోని ప్రతినిధి బృంధం తాత్కాలిక ప్రభుత్వ సంస్కరణల ఎజెండాకు తమ మద్ధతును వ్యక్తం చేసిందని ఢాకాలో జరిగిన సమావేశం వివరాలను యూనస్ తెలిపారు. "బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలని, అసత్య ప్రచారాలతో ఎలా పోరాడాలో, కీలక ఆర్థిక సంస్కరణలు వంటి అంశాలపై చర్చ జరిగింది." అని యూనస్ కార్యాలయం పేర్కొంది. ఈ కీలక అంశాలతో పాటు రోహింగ్యా సంక్షోభం, ఆర్థిక సంస్కరణలు, మీడియా స్వేచ్ఛ, ఆస్తుల రికవరీ, కొత్త సైబర్ భద్రతా చట్టాలు వంటి వాటిపైనా చర్చ జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది.

జార్జ్ సోరస్ కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ కొన్ని దేశాల్లో ప్రభుత్వాల మార్పిడిని ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో కూడా కీలక పాత్ర పోషించినట్లు ప్రచారంలో ఉంది. బంగ్లాదేశ్ అశాంతిలో అమెరికా ప్రమేయం ఉందని హసీనా గతంలో ఆరోపించింది. అయినప్పటికీ ఆమె మరిన్ని వివరాలను అందించలేదు. వివిధ దేశాలకు అందుతున్న సాయాన్ని ట్రంప్ సర్కారు 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ కూడా ఉంది. దీంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చిక్కులు ఎదురుకానున్నాయి.












Click it and Unblock the Notifications