Donald Trump: పుతిన్ ప్రజలను చంపుతూనే ఉంటారు.. ట్రంప్ అసహనం
Donald Trump: ఉక్రెయిన్‌పై రష్యాతో యుద్ధ విరమణ చేయించడానికి అమెరికా అధ్యక్షుడు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పుతిన్ కేవలం ప్రజలను చంపాలనుకుంటున్నారని అన్నారు. రష్యాపై కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందని ట్రంప్ సంకేతం ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన టెలిఫోన్ సంభాషణ పట్ల తాను చాలా అసంతృప్తిగా ఉన్నానని అన్నారు. పుతిన్ కేవలం ప్రజలను చంపడం కొనసాగించాలనుకుంటున్నారని.. యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా లేరని ట్రంప్ ఆరోపించారు. మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. "ఈ పరిస్థితి చాలా కష్టం. నేను పుతిన్‌తో మాట్లాడాను, కానీ అతను ఇంకా యుద్ధం నుండి వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదు. కేవలం ప్రజలను చంపాలనుకుంటున్నాడు, ఇది సరికాదు" అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం
తాను రష్యాపై కఠినమైన ఆంక్షలను పరిశీలిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ సంకేతం ఇచ్చారు. వ్లాదిమిర్ పుతిన్‌ను ఒప్పించేందుకు గత 6 నెలలుగా ఈ ఆంక్షలను వాయిదా విసినట్లు వెల్లడించారు. "మేము ఆంక్షల గురించి మాట్లాడుతున్నాం. అవి ఇప్పుడు అమలు చేయబడవచ్చని పుతిన్ అర్థం చేసుకున్నాడు."అని ట్రంప్ అన్నారు.
ట్రంప్, జెలెన్‌స్కీల మధ్య కూడా సంభాషణ
డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వ్యూహాత్మక చర్చలు జరిపారు. అమెరికా నుంచి అందే సైనిక సహాయంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఉక్రెయిన్ వైమానిక రక్షణను బలోపేతం చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. రష్యా ఇప్పటివరకు చేసిన అతిపెద్ద డ్రోన్, క్షిపణి దాడి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు.
జర్మన్ ఛాన్సలర్‌తో కూడా మాట్లాడిన ట్రంప్
జర్మన్ ఛాన్సలర్ ఫ్రిడ్రిచ్ మెర్జ్‌తో కూడా తాను విడిగా మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. ఈ చర్చల్లో ఉక్రెయిన్‌కు పాట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులను పంపడం గురించి చర్చించారని, అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ రక్షణ అవసరమని మెర్జ్ భావిస్తున్నారని ట్రంప్ అన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ దాడి
యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశ వ్యక్తం చేసిన తర్వాత, రష్యా ఉక్రెయిన్‌పై అతిపెద్ద వైమానిక దాడిని చేసింది. ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థ ప్రకారం, రష్యా రాత్రిపూట చేసిన దాడిలో మొత్తం 550 డ్రోన్‌లు, క్షిపణులను ప్రయోగించింది, వీటిలో ఎక్కువ భాగం కీవ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. 478 వైమానిక లక్ష్యాలను విజయవంతంగా కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది.












Click it and Unblock the Notifications