భార్య అందం వల్లే భర్తకి పదవి అంటున్న ట్రంప్.. అమెరికా రాజకీయాల్లో కొత్త రచ్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదానికి కేంద్రబిందువయ్యారు. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమించిన నేపథ్యంలో.. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. బర్గమ్ నియామకానికి ఆయన అర్హతలు కాకుండా, ఆయన భార్య క్యాథరిన్ అందం కూడా ఒక కారణమని ట్రంప్ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు తెరలేపింది.
ఓవల్ ఆఫీసులో చేసిన వ్యాఖ్యలు..
ఈ మేరకు ఓవల్ ఆఫీసులో మాదకద్రవ్యాల కట్టడి లక్ష్యంగా జారీ చేసిన ఓ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై.. సంతకం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో డగ్ బర్గమ్‌తో పాటు ఆయన సతీమణి క్యాథరిన్ కూడా హాజరయ్యారు.

''ఆ వీడియోనే కారణం'' - ట్రంప్ వివరణ
బర్గమ్ నియామకానికి కారణం చెబుతూ ట్రంప్ మాట్లాడుతూ.. బర్గమ్, అతని భార్య క్యాథరిన్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో ఒకటి చూశాను. అందులో ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించారు. ఆమె ఎవరని నా సిబ్బందిని అడిగాను. ఆ తర్వాత ఈ జంట గురించి వివరాలు తెలుసుకున్నాను. ప్రధానంగా ఆ కారణంతోనే డగ్ బర్గమ్‌కు ఈ పదవి ఇచ్చాను" అని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా డగ్ బర్గమ్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. నార్త్ డకోటాకు రెండుసార్లు గవర్నర్‌గా పనిచేశారు. అయితే ఆయన విజయంలో ఆయన భార్య పాత్ర కూడా కీలకంగా ఉండి ఉంటుంది. ఇది నిజంగా అద్భుతమైన జంట అని ట్రంప్ అన్నారు.
అర్హతల కంటే వ్యక్తిగత వ్యాఖ్యలే హైలైట్..
అయితే డగ్ బర్గమ్‌కు ఉన్న పరిపాలనా అనుభవం, వ్యాపార నేపథ్యం, గవర్నర్‌గా చేసిన సేవలపై మాట్లాడాల్సిన సందర్భంలో, ఆయన భార్య రూపురేఖలను ప్రస్తావించడం సరికాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఒక కీలక మంత్రి పదవిని ఇలా వ్యక్తిగత వ్యాఖ్యలతో అనుసంధానం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.
సోషల్ మీడియాలో దుమారం..
ట్రంప్ వ్యాఖ్యలు వెలుగులోకి రాగానే సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వచ్చింది. ఇవి మహిళలను కించపరిచే వ్యాఖ్యలుగా పలువురు అభివర్ణించారు. రాజకీయ నియామకాలను తేలికగా చూపించారన్న ఆరోపణలు వచ్చాయి. అలానే మహిళా హక్కుల సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొంతమంది మాత్రం ట్రంప్ శైలిలో ఇది సాధారణ వ్యాఖ్యేనని సమర్థించడానికి ప్రయత్నించారు.
ట్రంప్ గత వ్యాఖ్యలు..
మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ట్రంప్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన పలుమార్లు మహిళల రూపం, వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ తాజా ఘటన ఆయన గత వ్యాఖ్యల సరళినే మరోసారి గుర్తుకు తెచ్చిందని విమర్శకులు చెబుతున్నారు.
దాంతో మొత్తంగా ఈ వ్యాఖ్యల వల్ల డగ్ బర్గమ్ నియామకంపై ప్రత్యక్షంగా ప్రభావం పడకపోయినా, ట్రంప్ రాజకీయ ఇమేజ్‌కు మాత్రం ఇది మరో దెబ్బగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు ట్రంప్‌కు ఇబ్బందికరంగా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications