భారత్‌కు ట్రంప్ చివరి హెచ్చరిక: 3 దేశాలపై టారిఫ్ కొరడా
Trump Tariff: మాటల్లో చెప్పింది.. చేతల్లో చేసి చూపిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసల నేపథ్యంలో మూడు దేశాలపై కొరడా ఝుళిపించారు. అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన వాళ్లను వెనక్కి పిలిపించుకోవడంపై ఎలాంటి హామీలను ఇవ్వనందున డొనాల్డ్ ట్రంప్ ఈ పెనాల్టీ విధించినట్టయింది.
ట్రంప్ టారిఫ్‌ను ఎదుర్కొంటోన్న దేశాల్లో కెనడా, మెక్సికో, చైనా ఉన్నాయి. ఈ మూడు దేశాలపైనా విధించిన సరికొత్త టారిఫ్ నేటి నుంచి అమలులోకి వస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లెవిట్ తెలిపారు. వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఈ మూడింట్లో మెక్సికోపై అత్యధికంగా టారిఫ్ భారం పడింది. 25 శాతం టారిఫ్‌ను అదనంగా చెల్లించాల్సి ఉంటుందా దేశానికి. కెనడా, చైనాలపై 10 శాతం మేర టారిఫ్‌ను విధించింది అమెరికా. తమ దేశానికి అదనపు భారంగా మారిన అక్రమ వలసదారులను వెనక్కి పిలిపించుకోవడంలో విఫలమైనందు వల్ల ఈ టారిఫ్ విధించాల్సి వచ్చిందని కరోలినా చెప్పారు.
మార్చి 1 నుంచి ఈ కొత్త ట్రంప్ టారిఫ్ అమలులోకి వస్తుందంటూ తొలుత వార్తలొచ్చాయి. వీటిని కరోలినా కొట్టి పారేశారు. ఆ వార్తలు నిరాధారమైనవని తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 1 అంటే శనివారం నుంచే కొత్త టారిఫ్‌ను అమలు చేస్తామనీ ప్రకటించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ కట్టుబడి ఉన్నారని వ్యాఖ్యానించారు.
కొత్త టారిఫ్ విదానం వల్ల స్వేచ్ఛా వాణిజ్యానికి ఇక తెరపడినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అమెరికా వాణిజ్య రంగం కొంతమేర మందగించే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు 1.6 ట్రిలియన్ డాలర్ల మేర మార్కెట్ లావాదేవీలపై దీని ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తోన్నారు.
భారత్ సైతం అక్రమ వలసదారుల జాబితాలో ఉన్న విషయం తెలిసిందే. 18,000 మందికి పైగా భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్నట్లు గతంలోనే అమెరికా గుర్తించింది. వారిని వెనక్కి పిలిపించుకోవాలంటూ డొనాల్డ్ ట్రంప్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించారు కూడా. తొలి విడతలో మాత్రం టారిఫ్ బారి నుంచి భారత్‌ను తప్పించారు.












Click it and Unblock the Notifications