Trump Tariffs: చైనాకు మరో షాక్, మిగితా దేశాలకు భారీ ఊరట
డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజులపాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. అయితే, ఈ మినహాయింపు చైనాకు మాత్రం వర్తించదని అమెరికా స్పష్టం చేసింది. చైనాపై పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.
మరోవైపు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఒక్కరోజు తేడాలోనే చైనాపై ట్రంప్ సర్కారు మరోసారి సుంకాలు పెంచింది. చైనాపై విధిస్తున్న సుంకాలను 104 నుంచి ఏకంగా 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా వస్తువులపై ఈ ఉదయమే 104 శాతం అమెరికా సుంకాలు విధించడం గమనార్హం.

అయితే, ఇందుకు ప్రతీకారంగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్.. చైనా నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. అమెరికాపై విధించిన సుంకాలను తగ్గించుకోకుంటే అదనంగా మరో 50 శాతం సుంకాలు పెంచతామని హెచ్చరించారు. ఇందుకు ఏప్రిల్ 9 అంటే నేటి వరకు గడువు ఇచ్చారు.
అయినప్పటికీ చైనా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మరోసారి చైనాపై అమెరికా సుంకాలు పెంచింది. చైనాపై 104 శాతం సుంకాలను విధించింది. బుధవారం ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. దీంతో చైనా కూడా తీవ్రంగా స్పందించింది. ట్రంప్ నిర్ణయానికి బుధులుగా అమెరికా దిగుమతులపై సుంకాలను 84 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో చైనా దిగుమతులపై సుంకాలను 104 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. మరోవైపు, భారత్ సహా ఐరోపా దేశాలపైనా ట్రంప్ సుంకాలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఈ వాణజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, తాజాగా, ట్రంప్ 90 రోజులపాటు సుంకాల పెంపుపై వెనక్కి తగ్గడంతో ప్రపంచ దేశాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి.
ట్రంప్ తాజా నిర్ణయంతో మార్కెట్లలో జోష్
చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజులపాటు సుంకాల నుంచి ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లలో కొత్త జోష్ కనిపించింది. సుంకాలపు పెంపుపై వెనక్కి తగ్గడంతో స్టాక్ మార్కెట్లు ఏకంగా 3.5 ట్రిలియన్ డాలర్ల మేర లాభపడ్డాయి. అత్యధికంగా టెస్లా షేర్ 15 శాతం, ఎన్ విడియా 13 శాతం, యాపిల్ 11 శాతం లాభపడ్డాయి. గురువారం (ఏప్రిల్ 10న) హాలీడే కాని పక్షంలో తాము కూడా భారీగా కోలుకునేవారమని భారత మదుపరులు కొంత నిరుత్సాహంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications