సిగ్నల్ యాప్ స్కాం: ట్రంప్ ఎన్ఎస్ఏ మైక్ వాల్ట్జ్ ఔట్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, ఆయన డిప్యూటీ అలెక్స్ వాంగ్ తమ పదవులను వీడుతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియా వర్గాలు పేర్కొన్నాయి. సిగ్నల్ యాప్ కమ్యూనికేషన్ ద్వారా యెమెన్‌లో అమెరికా వైమానిక దాడుల గురించి ప్రమాదవశాత్తు లీక్ అయినట్లు వచ్చిన కుంభకోణం నేపథ్యంలో వీరు తమ పదవులను వీడుతుండటం గమనార్హం.
గురువారం సీబీఎస్ న్యూస్ నివేదిక ప్రకారం.. వాల్ట్జ్, వాంగ్ ఇద్దరూ తమ ఉద్యోగాలను వదిలివేస్తున్నారు. ఈ సమాచారాన్ని ఫాక్స్ న్యూస్ కూడా నివేదించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే ఈ విషయంపై మాట్లాడతారని కూడా పేర్కొంది. అయితే, ఇప్పటివరకు, వైట్ హౌస్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

కాగా, ఫ్లోరిడాకు చెందిన మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్ట్జ్.. ట్రంప్ రెండవ పదవీకాలంలో అడ్మినిస్ట్రేషన్ నుంచి నిష్క్రమించిన మొదటి ఉన్నత స్థాయి అధికారి కావడం గమనార్హం. ఈ పదవీకాలం మొదటి పదవీకాలంతో పోలిస్తే సిబ్బంది మార్పుల పరంగా స్థిరంగా ఉంది.
మార్చిలో జరిగిన ఒక సంఘటన తర్వాత వాల్ట్జ్ ది అట్లాంటిక్ ఎడిటర్-ఇన్-చీఫ్ అనే జర్నలిస్టును పొరపాటున ట్రంప్ అత్యున్నత జాతీయ భద్రతా బృందం పాల్గొన్న ప్రైవేట్ సిగ్నల్ చాట్‌కు జోడించారు. దీంతో అంతర్గత విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ చాట్‌లో సున్నితమైన వివరాలు ఉండటంతోపాటు వాటిలో యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానాలు వైమానిక దాడులు ప్రారంభించే ఖచ్చితమైన సమయం కూడా ఉంది.
షెడ్యూల్ చేసిన దాడికి దాదాపు 30 నిమిషాల ముందు ఈ లీక్ జరిగింది. ఈ పరిణామం ట్రంప్ జాతీయ భద్రతా యంత్రాంగంలో కార్యాచరణ భద్రత, విచక్షణ గురించి విస్తృతమైన ఆందోళనను రేకెత్తించింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లీక్ ప్రాముఖ్యతను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. వాల్ట్జ్ , అతని అసిస్టెంట్ వాంగ్ ఇద్దరూ నిష్క్రమించినట్లు సమాచారం. దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలను బహిర్గతం చేసేందుకు ఎవరూ ప్రయత్నించినా కఠిన చర్యలు ఉంటాయని ఈ చర్యతో ట్రంప్ సర్కారు స్పష్టం చేసినట్లయింది.












Click it and Unblock the Notifications