• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టుటంకామన్: 3 వేల ఏళ్ల కిందటి ఈ యువరాజు సమాధి తవ్విన పరిశోధకుడు ఎందుకు చనిపోయారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
Tutankhamun

"అన్నిచోట్లా బంగారపు మెరుపు."

మిరుమిట్లుగొలిపే నిధి నిక్షేపాలతో నిండి ఉన్న టుటంకామన్ సమాధిని మొదటిసారి చూసిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్ చెప్పిన మాటలవి.

1922 నవంబర్ 26న హోవార్డ్ కార్టర్ 3000 సంవత్సరాలుగా మూతబడి ఉన్న సమాధి తలుపు సందుల్లోంచి కొవ్వొత్తి ఎత్తి పట్టుకుని కళ్లు చిట్లించి చూశారు. పక్కనే ఆయన సహ పరిశోధకుడు లార్డ్ కార్నార్వాన్‌ ఆతృతగా నిలబడి ఉన్నారు.

సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్‌ను పాలించిన రాజు టుటంకామన్ సమాధి బయటపడి నేటికి 100 సంవత్సరాలు కావొస్తోంది.

హోవార్డ్ కార్టర్, లార్డ్ కార్నార్వాన్‌తో కలిసి టుటంకామన్ సమాధిని వెలికితీశారు. ఈ జంట సాధించిన అద్భుతమైన పురావస్తు ఆవిష్కరణ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. నేటికీ ఆ కథను పదే పదే చెప్పుకుంటున్నారు.

ఈజిప్ట్ దేశంలోని లక్సర్ నగరంలో కొన్నేళ్ల పాటు తవ్వకాలు జరిపిన తరువాత ఆ సమాధి బయటపడింది.

నిధి నిక్షేపాలతో నిండి ఉన్న టుటంకామన్ సమాధిని ఇప్పుడు గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంకు తరలిస్తున్నారు. దీన్ని త్వరలో సందర్శకుల వీక్షణకు అవకాశం కల్పించనున్నారు.

అక్కడకు చేరిన తరువాత, ఈ యువరాజు సమాధి మరిన్ని కొత్త పరిశోధనలకు ఆస్కారం కల్పిస్తుందని ఆశిస్తున్నారు.

టుటంకామన్ సమాధి బయటపడిన వందేళ్ల తరువాత ఈ అంశంపై కొత్త ప్రశ్నలు, సందేహాలు వినిపిస్తున్నాయి.

టుటంకామన్ ఒక రాజకీయ చిహ్నంగా ఎలా మారాడు, కార్టర్ అతడి సమాధిని దోచుకున్నారా, ఈ సమాధిని కనుగొనడానికి సహాయ సహకారాలు అందించిన ఈజిప్షియన్లకు రావలసిన కీర్తి ఎందుకు రాలేదు మొదలైన ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

Tutankhamun సమాధి

మొదటి నుంచీ వివాదాలు

లక్సర్‌లో ఈ తవ్వకాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.

చెక్కు చెదరకుండా లభ్యమైన టుటంకామన్ సమాధి ఈజిప్ట్‌లోనే ఉండాలని ఆ కాలపు నియమాలు నిర్దేశించినప్పటికీ, దీన్ని విదేశాలకు తీసుకెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయని అప్పట్లో భావించారు.

మరోపక్క, కార్టర్, కార్నర్వాన్ కలిసి ఒక బ్రిటిష్ వార్తాపత్రికతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పత్రిక ఈజిప్షియన్లు సహా మిగతా జర్నలిస్టులను సమాధి తవ్వకాల దగ్గరకు రానివ్వకుండా అడ్డుకుంది. అది శతృత్వాలకు దారితీసింది.

దాంతో, ఈజిప్ట్‌లో వీరిద్దరిపై దురభిప్రాయాలు నెలకొన్నాయని, వారిని జాత్యహంకారులుగా పరిగణించారని చరిత్రకారిణి క్రిస్టీనా రిగ్స్ చెప్పారు.

1882లో బ్రిటిష్ సామ్రాజ్యం ఈజిప్ట్‌ను ఆక్రమించుకుంది. 1922 నాటికి ఆ దేశానికి పాక్షిక స్వతంత్రం లభించింది.

దాంతో టుటంకామన్, వలస రాజ్య పాలన నుంచి ఈజిప్ట్ విముక్తి పోరాటంలో చిహ్నంగా మారాడు.

"ఇది చాలా శక్తిమంతమైన చిహ్నం.. ఈజిప్టు పునర్జన్మ పొందినట్లే ఈ యువరాజు కూడా పునర్జన్మ పొందినట్టు భావించారు" అని డాక్టర్ రిగ్స్ వ్యాఖ్యానించారు.

డాక్టర్ రిగ్స్ 'ట్రెజర్డ్: హౌ టుటంకామన్ షేప్డ్ ఏ సెంచరీ' అనే పుస్తకం రాశారు.

టుటంకామన్ సమాధిని తమ దేశ వారసత్వంగా ఈజిప్షియన్లు భావించారు. దానిపై గళమెత్తారు.

"ఈజిప్ట్ నాగరికతకు తల్లి, టుటంకామన్ మా తండ్రి" అంటూ ప్రముఖ ఈజిప్షియన్ సింగర్ మౌనిరా అల్-మహ్దియా 1920లలో పాడారు.

"మా పిత్రార్జితాన్ని దుర్వినియోగం చేయడానికి లేదా దొంగలించడానికి మేం అంగీకరించం" అని ప్రసిద్ధ కవి అహ్మద్ షావ్కీ ధిక్కరించారు.

వ్యాలీ ఆఫ్ ద కింగ్స్‌లో భూమి లోతుల్లో పాతిపెట్టిన టుటంకామన్ సమాధి చాలాకాలం వరకు దొంగలు, పురావస్తు శాస్త్రవేత్తలు మొదలైనవారి కంటపడకుండా తప్పించుకుంది. శిథిలాలు సమాధి ప్రవేశ ద్వారాన్ని కప్పి ఉంచాయి.

కార్నర్వాన్ 1923లో చనిపోయారు. దోమ కాటు వలన ఇన్‌ఫెక్షన్ సోకి మరణించినట్లు సమాచారం వచ్చినప్పటికీ, సమాధి తవ్వడం వలన శాపం తగిలి మరణించారని మీడియాలో కథనాలు ప్రచారమయ్యాయి.

అనంతరం, ఒక దశాబ్దం పాటు కార్టర్ తన బృందంతో కలిసి తవ్వకాలు కొనసాగించి, సమాధిలో ఉన్న విలువైన నిధిని వెలికితీశారు.

కార్టర్ ఆ నిధిని దొంగలించడానికి ప్రయత్నించారన్న వదంతులు మొదటి నుంచి ఉన్నాయి.

కాగా, ఇప్పుడు ఈజిప్టోలజిస్ట్ బాబ్ బ్రియర్ దొంగతనం జరిగిందని చెప్పే బలమైన సాక్ష్యాలను బయటపెట్టారు. ఆయన రాసిన పుస్తకం 'టుటంకామన్ అండ్ ది టోంబ్ దట్ చేంజ్డ్ ది వరల్డ్ ' పుస్తకంలో దీనికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు.

"కార్టర్ వాటిని (సమాధిలో దొరికిన విలువైన వస్తువులు) స్మారక చిహ్నాలుగా చాలామందికి పంచిపెట్టారు. అవి తనకు సొంతమని ఆయన భావించారు" అని బ్రియర్ చెప్పారు.

ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌కు చెందిన కార్నర్వాన్ ఒక అన్వేషకుడు. ప్రపంచం మొత్తం చుట్టి రావాలని కలలుగన్న సాహసికుడు.

కార్నర్వాన్‌కు ఈజిప్ట్‌లో "తన జీవితకాల వాంఛను నెరవేర్చుకునే అవకాశం దొరికింది" అని ఆయన వారసుల్లో ఒకరైన లేడీ కార్నర్వాన్‌ అంటారు. ఆమె, తన వంశ చరిత్రను తవ్వి 'ది ఎర్ల్ అండ్ ది ఫారో' అనే పుస్తకం రాశారు.

ఈజిప్ట్‌లో తవ్వాకాలకు అవసరమయ్యే వ్యయాల గురించి కార్నర్వాన్ చింతపడ్డారు కానీ, టుటన్‌ఖామున్ సమాధి ఈజిప్ట్‌లోనే ఉండాలని ఆయన భావించినట్టు సాక్ష్యాలు దొరికియాని లేడీ కర్నర్వాన్ తెలిపారు.

"ఆయన గురించి మీడియాలో తప్పుడు ప్రచారాలు సాగాయి. ఆయనకు నిధులు, బంగారంపై అంత ఆసక్తిలేదు. అన్వేషణ, ఆవిష్కరణల పైనే మక్కువ" అని ఆమె వెల్లడించారు.

tutankhamun

అంతిమగా ఈజిప్ట్‌కే సొంతమైన టుటంకామన్ సమాధి

చివరకు, టుటంకామన్ సమాధిలో దొరికిన నిక్షిప్తాలను ఈజిప్ట్ సొంతం చేసుకోగలిగింది. కొన్ని దశాబ్దాల పాటు వాటిని కైరోలోని తహ్రీర్ స్క్వేర్‌లో ఉన్న నియో-క్లాసికల్ ఈజిప్షియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

టుటంకామన్ మమ్మీ ముఖానికి ఉన్న బంగారు తొడుగు ఒక కళాఖండంగా, పురాతన కళకు ఆనవాలుగా ప్రసిద్ధి చెందింది. ఆధునిక ఈజిప్ట్ చిహ్నంగా మారింది.

అయితే, 1922 నాటి ఆవిష్కరణలో ఈజిప్షియన్ల ప్రస్తావన లేకపోవడం పట్ల ఇప్పటికీ ఆగ్రహం నెలకొని ఉంది.

"పురావస్తు రికార్డుల నుంచి చాలా పేర్లు మాయమైపోయాయి. వాళ్లేం చేశారో మనకు తెలియకుండా పోయింది. వాళ్ల స్పందన ఏమిటన్నది కూడా తెలీదు" అని ఈజిప్టాలజిస్ట్ మోనికా హన్నా అన్నారు.

సమాధి తవ్వకాల దగ్గర శిథిలాలను శుభ్రం చేయడానికి కార్టర్ ఈజిప్షియన్ కార్మికులను నియమించారు. అలాగే, అహ్మద్ గెరిగర్, గాడ్ హసన్, హుస్సేన్ అబు అవద్, హుస్సేన్ అహ్మద్ సైద్ వంటి సమర్థులైన ఈజిప్షియన్ సూపర్‌వైజర్లను కూడా నియమించారు.

కార్టర్ పెద్దగా చదువుకోలేదు. 17 ఏళ్లకు ఈజిప్ట్‌లో పురావస్తు పరిశోధన తవ్వకాలలో పనికి చేరారు. అలా ఆ పని నేర్చుకున్నారు. అలాగే పైన ప్రస్తావించిన వారికి కూడా ఫీల్డులోనే శిక్షణ ఇచ్చారు.

ఈ ఏడాది ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక ప్రదర్శనలో ఈజిప్టు కార్మికుల పాత్రను వెలుగులోకి తెచ్చారు. వారి ఛాయాచిత్రాలు లభ్యమైనప్పటికీ, అందులో ఎవరు ఎవరో తెలుసుకోవడానికి రికార్డులు లేవు.

తొలిసారిగా టుటంకామన్ సమాధిలోని 5,400 వస్తువుల ప్రదర్శన

టుటంకామన్ సమాధి బయటపడిన తరువాత, అందులోని నిధులకు సంబంధించిన గొడవలు కొంతకాలానికి సద్దుమణిగాయి.

అనంతరం 1960, 70 లలో మళ్లీ టుటంకామన్ పేరు బయటికొచ్చింది. ఒక ఈజిప్షియన్ తన విలువైన ఆస్తులను విదేశాలలో ప్రదర్శనకు పెట్టేందుకు అనుమతించడంతో రాజు టుటన్‌ఖామున్ సమాధి అంశం తెరపైకి వచ్చింది.

పశ్చిమ దేశాల్లో దీన్ని "టుట్-మానియా"గా అభివర్ణించారు.

ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియంలలో ఒకటైన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం 2023లో తలుపులు తెరుచుకోనుంది. ఇక్కడ టుటంకామన్ సమాధికి సంబంధించిన విలువైన వస్తువులను ప్రదర్శనకు ఉంచుతారు. ఇది ఈజిప్ట్‌లో పర్యటకాన్ని ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నారు.

ఈ మ్యూజియంలో తొలిసారిగా టుటంకామన్ సమాధికి చెందిన 5,400 వస్తువులను ప్రదర్శనకు ఉంచబోతున్నారు.

దీనితో పాటు ఈ మ్యూజియంలో పురాతన ఖుఫు బార్జ్, 83 టన్నుల రామ్సెస్ II విగ్రహాన్ని ప్రదర్శనకు పెడతారు.

వాలీ ఆఫ్ కింగ్స్‌లో ప్రదర్శనకు ఉంచిన టుటంకామన్ మమ్మీ

100 ఏళ్ల తరువాత కూడా కుతూహలం రేకెత్తిస్తున్న సమాధి

వందేళ్ల తరువాత కూడా టుటంకామన్ సమాధి ఆవిష్కరణ సైన్స్ పరిశోధకులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది.

సమాధిలో ఉన్న కొన్ని విరిగిపోయిన, పాడైపోయిన వస్తువులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు టుటంకామన్ చెప్పులు.

టుటంకామన్ వాడిన చురకత్తికి ఉల్క నుంచి వచ్చిన లోహంతో తయారుచేసిన ఇనుప బ్లేడ్ ఉందని ఇటీవలే కనుగొన్నారు.

ఈ యువరాజు జీవితచరిత్రకు సంబంధించిన కథనాలు ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటూనే ఉన్నాయి.

టుటంకామన్ మమ్మీని స్కాన్ చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ నిర్వహించారు. డీఎన్ఏ విశ్లేషణ జరిపారు.

టుటంకామన్ అనేక రకాల జన్యుపరమైన రుగ్మతలు ఉన్న బలహీనమైన, బక్కచిక్కిన యుక్తవయస్కుడని ఈ పరీక్షలలో తేలింది.

మమ్మీలపై పరిశోధనలో నిపుణులైన డాక్టర్ బ్రియర్, టుటంకామన్‌కు క్లబ్‌ఫుట్ ఉండి ఉండవచ్చని సందేహిస్తున్నారు. క్లబ్‌ఫుట్ అనేది చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి. పాదాలు వంకర తిరిగి ఉంటాయి.

టుటంకామన్ సమాధిలో అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి. వాటిని బట్టి అతడు ఒక యోధుడు కావచ్చని డాక్టర్ బ్రియర్ అంచనా వేస్తున్నారు.

"టుటంకామన్ బలహీనంగా కనిపించినా, యుద్ధంలో పాల్గొన్నాడని చెప్పడానికి ఇవి ఆధారాలు" అని డాక్టర్ బ్రియర్ అన్నారు.

వందేళ్ల క్రితం వార్తలను ఆక్రమించుకున్న టుటంకామన్, తన మరణానంతర జీవితం కూడా ఇంత ఆసక్తి రేకెత్తిస్తుందని ఊహించి ఉండకపోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Tutankhamun: Why did the researcher who excavated the tomb of this 3,000-year-old prince die?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X