కేబినెట్‌లో ఏఐ మినిస్టర్.. బీహార్ నుంచి బ్రిటన్ వరకు హిస్టరీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రేసులో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న బ్రిటన్ రాజకీయంలో ఒక అరుదైన సాంకేతిక విప్లవం ఆవిష్కృతమైంది. బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆండీ బర్న్ హామ్, తన పాలనలో టెక్నాలజీ రంగానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొదటిసారిగా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) విభాగానికి ఏకంగా దేశ కేబినెట్ స్థాయిలో చోటు కల్పిస్తూ, ఆ బాధ్యతలను కనిష్క నారాయణ్‌కు అప్పగించారు. ఇంతటి అరుదైన గౌరవం దక్కించుకున్న తొలి భారతీయుడుగా కనిష్క నారాయణ్ నిలిచారు. సాంకేతిక రంగానికి దౌత్యపరమైన, ఆర్థికపరమైన బలాన్ని చేకూర్చే ఉద్దేశంతోనే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ నిర్ణయంతో పాటు బ్రిటన్ పాలనా వ్యవస్థలో ప్రధాని బర్న్ హామ్ కీలక ప్రక్షాళన చేపట్టారు. పాత విధానాలకు స్వస్తి పలుకుతూ శాస్త్ర సాంకేతిక విభాగాన్ని (DSIT) వాణిజ్య శాఖతో విలీనం చేశారు. దీనికి జోనాథన్ రేనాల్డ్స్‌ను అధిపతిగా నియమించారు. అలాగే డిజిటల్ భద్రత, సైబర్ భద్రతకు సంబంధించిన బాధ్యతలను సాంస్కృతిక శాఖకు అప్పగించారు. ఈ మార్పుల ద్వారా నిర్ణయాల వేగాన్ని పెంచి, డిజిటల్ వ్యాపారాలకు దేశంలో మరింత అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

లండన్ ప్రధాన కేంద్రంగా..
గతంలోనే సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కనిష్క నారాయణ్‌ను, ఇప్పుడు నేరుగా ప్రధాన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ హోదాలో కూర్చోబెట్టడం గమనార్హం. ప్రస్తుతం గూగుల్ డిప్ మైండ్ లాంటి దిగ్గజ సంస్థలతో పాటు ఎన్నో ఏఐ స్టార్టప్‌లకు, ఇంజినీరింగ్ ప్రతిభకు లండన్ ప్రధాన కేంద్రంగా ఉంది. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తర్వాత, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు సులువైన నిబంధనలను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉంది.
ప్రస్తుతం యూరప్‌లో సొంత సాంకేతిక పరిజ్ఞానంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా సంస్థలపై ఆధారపడకుండా సొంత ఏఐ మోడళ్లను తయారు చేసుకోవాలని ఫ్రాన్స్, జర్మనీ దేశాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో బ్రిటన్‌ను ఏఐ దిగ్గజంగా నిలబెట్టే బాధ్యత ఇప్పుడు కనిష్క నారాయణ్ భుజస్కంధాలపై ఉంది. డేటా సెంటర్ల ఏర్పాటు, అధిక విద్యుత్ ధరల సవాళ్లు, సాంకేతిక నిధుల సమీకరణ వంటి అంశాలపై కొత్త మంత్రివర్గం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందోనని ప్రపంచ టెక్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.
ముజఫ్ఫర్‌పూర్ లో జన్మించి..
బీహార్ రాష్ట్రంలోని ముజఫ్ఫర్‌పూర్ లో 1989 నవంబర్‌లో కనిష్క నారాయణ్ జన్మించారు. తన 12 ఏళ్ల వయస్సులో అతని కుటుంబం యూకేలోని వేల్స్‌లో ఉన్న కార్డిఫ్ నగరానికి తరలివెళ్లింది. కార్డిఫ్‌లోని కథేస్ హైస్కూల్లో ప్రాథమిక పాఠశాల చదువు పూర్తి చేశాక, స్కాలర్‌షిప్ సాధించి బ్రిటన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈటన్ కాలేజ్లో చేరారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ బాలియోల్ కాలేజీలో ఫిలాసఫీ, పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ అభ్యసించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ (MBA) పూర్తి చేశారు.
బ్రిటన్ రాజకీయాల్లో ప్రవేశం
కనిష్క నారాయణ్ తన 18 ఏళ్ల వయస్సులోనే లేబర్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. రాజకీయాల్లోకి నేరుగా రాకముందు, ప్రధాని డేవిడ్ కెమెరూన్ హయాంలో 'కేబినెట్ ఆఫీస్' లోనూ, లిజ్ ట్రస్ హయాంలో పర్యావరణ శాఖలోనూ ఆర్థికవేత్తగా, సివిల్ సర్వెంట్‌గా పనిచేశారు. 2024 జులైలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 'వేల్ ఆఫ్ గ్లామోర్గన్' నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వేల్స్ ప్రాంతం నుంచి ఎన్నికైన మొదటి భారతీయ/మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీగా ఆయన రికార్డు సృష్టించారు. సెప్టెంబర్ 2025లో సైన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీ శాఖలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆన్‌లైన్ సేఫ్టీ' జూనియర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.












Click it and Unblock the Notifications