ఆ మూడు డిమాండ్లపై చర్చలకు ఉక్రెయిన్ ఓకే: మలుపు తిప్పిన ఆ దేశాధ్యక్షుడి ఒక్క ఫోన్ కాల్
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్నభీకర యుద్ధానికి అంతు అనేది లేకుండా పోతోంది. ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలానూ కనిపించట్లేదు. రష్యాతో వెనకడుగు వేయించడానికి పాశ్చాత్య దేశాలు చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. పైగా ఆయా చర్యలు రష్యాను మరింత రెచ్చగొట్టినట్టవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజా యూరప్, నాటో దేశాల పర్యటన కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వట్లేదనేది రష్యా కొనసాగిస్తోన్న దూకుడు స్పష్టం చేస్తోంది.

శాంతి చర్చల ప్రతిపాదనలు..
ఇది కాస్తా ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనలోకి నెట్టేసింది. మూడో ప్రపంచ యుద్ధం తప్పబోదనే సంకేతాలను పంపించింది. కిందటి నెల 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధంలో అంచనాలకు మించిన ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తోన్నాయి. అయినప్పటికీ- రెండు దేశాలు వెనకడుగు వేయట్లేదు. ఒకవంక శాంతి చర్చలు కొనసాగిస్తూనే.. దానికి సమాంతరంగా దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి. రష్యా సంధిస్తోన్న రాకెట్లు, మిస్సైళ్ల ధాటికి ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు ధ్వంసం అయ్యాయి.

ఎర్డొగాన్ ఎంట్రీ..
యుద్ధాన్ని నివారించడానికి తాజాగా టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, వొలిదిమిర్ జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. సుదీర్ఘకాలం పాటు వారి మధ్య సంభాషణ కొనసాగింది. కాల్పులను విరమించాల్సిందిగా ఆయన పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. మానవతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాలని సూచించారు.

ఇస్తాంబుల్‌లో చర్చలకు ఆఫర్..
రెండు దేశాలు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని, ఈ రీజియన్‌లో ఉద్రిక్తతలను నివారించడానికి, శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికి సహకరించాలని కోరారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఇస్తాంబుల్‌లో ఇరు దేశాలు చర్చలకు రావాలని కూడా టర్కీ అధ్యక్షుడు ఆహ్వానించారు. ఇస్తాంబుల్‌లో శాంతిచర్చలు చేపట్టడానికి అనుమతి ఇస్తాననీ స్పష్టం చేశారు.

ఈ మూడు డిమాండ్లతో..
దీని తరువాత- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యాతో శాంతి చర్చలకు అంగీకారం తెలిపారు. ఇస్తాంబుల్‌లో భేటీకి తాను సిద్ధమని ప్రకటించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా న్యూట్రల్ స్టేటస్ అజెండాగా చర్చలను జరపాల్సి ఉంటుందని చెప్పారు. శాంతిచర్చల ద్వారా వెల్లడయ్యే ఫలితాలకు థర్డ్‌పార్టీ ద్వారా లీగల్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. సెక్యూరిటీ గ్యారంటీలు, తటస్థత, అణ్వాయుధేతర దేశంగా గుర్తింపు.. ఈ అజెండాతో చర్చలకు తాము సిద్ధమని పేర్కొన్నారు.

చెచెన్యా కంటే ఎక్కువ డ్యామేజ్..
రష్యన్ జర్నలిస్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ మాట్లాడారు. 90 నిమిషాల పాటు ఈ ఇంటర్వ్యూ కొనసాగింది. ఈ ఇంటర్వ్యూ సారాంశాన్ని స్థానిక పత్రిక మెడూజా ప్రచురించింది. దీన్ని ప్రచురించవద్దంటూ రష్యా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. పట్టించుకోలేదు. చెచెన్యా యుద్ధం కంటే కూడా తమదేశం తీవ్రంగా ధ్వంసమైందని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రతిపాదించిన అన్ని డిమాండ్లకూ రష్యా ఏకపక్షంగా తోసిపుచ్చుతోందని ఆరోపించారు.

రాజీధోరణితో..
కాల్పుల విరమణ, సైనిక బలగాల ఉపసంహరణ జరగకుండా శాంతిచర్చలు ఎప్పటికీ సఫలం కాబోవని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. రష్యా ఆధీనంలో ఉన్న నగరాలు, ఇతర పట్టణాలను తాము సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తాము అలాంటి ప్రయత్నాలేవీ చేయట్లేదని స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని చెప్పారు. తూర్పు డాన్‌బాస్ రీజియన్ విషయంలో తాము రాజీధోరణితో ఉంటున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications