రష్యాకు ఉక్రెయిన్ షాక్ : 10 వేల మంది సైనికులు హతం.. 250 యుద్ధ ట్యాంకుల ద్వంసం !!
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఖర్కిన్ పట్టణంతో పాటు యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుంది. అటు కీలక నగరాలను కూడా హస్తగతం చేసుకునేందుకు బాంబులతో విరుచుకుపడుతోంది. రష్యా సేనలు యుద్ధట్యాంకర్లతో దూసుకోస్తున్నా.. ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నాయి. రష్యా దళాలకు దీటుగా బదులిస్తున్నాయి. గత వారం రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరు దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

10వేల మంది సైనికుల హతం
ఈ యుద్ధంలో రష్యాకు భారీగానే నష్టం వాటిల్లింది. ఇప్పటివరకూ రష్యాకు చెందిన సుమారు 10వేల మంది సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ తెలిపింది. అటు 251 యుద్ధ ట్యాంకులను ద్వంసం చేసినట్లు వెల్లడించింది. అలాగే 404 కార్లు, 50 ఎంఎల్ఆర్ఎస్, వాహనాలు, 37 హెలికాప్టర్లు, 33 వార్ ప్లేన్లు, 60 ఇంధన వాహనాలు, 2 బోట్లు, 105 ఆర్టీలరీ పీసెస్, 939 ఆర్మ్ డ్ పర్సనల్ వాహనాలు, 18 ఆంటీ ఎయిర్ క్రాప్ట్ వార్ ఫేర్ లు ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది.

రష్యా సైన్యానికి ఆహారం, ఇంధనం కొరత
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించి వారం రోజులు దాటినా రష్యా సేనలు పూర్తి స్థాయిలో పట్టుసాధించలేకపోయాయి. రాజధాని కీవ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలోనే రష్యా దళాలు ఉండిపోయాయి. అక్కడే బసచేస్తున్నారు. కానీ అక్కడ నుంచి ముందుకు సాగలేకపోతున్నాయి. కారణం వందలాది యుద్ధ ట్యాంకర్లలో ఇంధనం అయిపోయింది. అటు ఆహారం కొరత ఏర్పడి వేలాది మంది సైనికులు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో యుద్ధట్యాంకులు, సైనికులు ఒకే చోట నిలిచిపోయాయి.

చెర్నోబిల్‌ను పునరావృతం చేయాలనుకున్నారా?
మరోవైపు రష్యా సైనికుల దాడిలో జపోరిషియా న్యూక్లియర్ ప్లాంట్ ప్రమాదానికి గురైంది. దీంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించడంలో వాటిని ఫైర్ ఫైటర్స్ ఆదుపులోకి తీసుకువచ్చారు. పవర్ ప్లాంట్ పై రష్యా దాడులను ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా మండిపడ్డారు. రష్యాపై ప్రపంచ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. జాపోరిషియా పవర్ ప్లాంట్‌పై దాడిని న్యూక్లియర్ టెర్రర్‌గా పేర్కొన్నారు. చెర్నోబిల్ విపత్తును రష్యా అధ్యక్షుడు పుతిన్ పునరావృతం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. సంక్షోభం వేళ ఉక్రెయిన్‌కు సాయం అందించాలని ఐరోపా దేశాలను జెలెన్‌స్కీ కోరారు.












Click it and Unblock the Notifications