వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్ యుద్ధం: రష్యా నుంచి విముక్తి పొందిన గ్రామాల్లో ఒక వైపు భయం, మరోవైపు ఆనందం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నటాలియా

నటాలియా తనకు విముక్తి కలిగిన క్షణాలను గుర్తుచేసుకున్నపుడు ఆమె ముఖం వెలిగిపోయింది. ఆమె ఊరు నోవోవోజ్నెసెన్కే. యుక్రెయిన్‌లో దక్షిణాన ఖేర్సన్‌ ప్రాంతంలో ఉంటుందీ గ్రామం.

ఈ గ్రామాన్ని ఆక్రమించుకుని ఉన్న రష్యా బలగాలను యుక్రెయిన్ సైన్యం తరిమివేసి.. అక్కడి ప్రజలకు విముక్తి కలిగించింది.

ఈ ఏడాది మార్చి 29వ తేదీన రష్యా బలగాలు ఈ గ్రామానికి వచ్చాయి. అప్పటి వరకూ ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునే నటాలియా జీవితం తలకిందులైంది. స్పూన్లు, ఫోర్కులు సహా.. వాళ్లు ధ్వంసం చేయనిది, దొంగిలించనది ఏదీ లేదని ఆమె చెప్పారు. ఓ ఖైదీ కాళ్లకు ఉన్న బూట్లు కూడా వాళ్లు ఎత్తుకు వెళ్లారని తెలిపారు.

''వాళ్లు అల్లరి మూక'' అని ఆమె బాధ నుంచి ఉపశమనంగా చేతులు పిండుతూ అన్నారు.

చివరికి సెప్టెంబరు 2వ తేదీన స్వాతంత్ర్యం వచ్చింది.

''మా సైనిక బలగాలు వచ్చినపుడు మేం బేస్‌మెంట్‌లో ఉన్నాం'' అని 50 ఏళ్ల నటాలియా తెలిపారు.

యుక్రెయిన్ బలగాలు

''ఎవరైనా బతికున్నారా?'' అని వారు యుక్రేనియన్ భాషలో అడిగారు. వాళ్లు మా వాళ్లని నాకు అర్థమైంది. వాళ్లు చాలా అందంగా ఉన్నారు. ఆ ఫాసిస్టులతో (రష్యా సైనికులను ఉద్దేశించి) వీళ్లు ఇంకా అందంగా ఉన్నారు'' అని ఆమె చెప్పారు.

''నాకు ఏం చేయాలో తెలియలేదు. వాళ్లను ఆలింగనం చేసుకోవాలా? వాళ్ల చేతులు పట్టుకోవాలా? నేను వారిని తాకాను. చాలా సంతోషం అనిపించింది'' అని వివరించారు.

ఘర్షణలో ఇరుపక్షాల మధ్య నెలల తరబడి సాగిన ప్రతిష్టంభన అనంతరం యుక్రేనియన్లు, రష్యన్లు ఓ సరికొత్త వాస్తవికతను ఎదుర్కొంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఖండంలో అతి పెద్దదైన ఈ సంఘర్షణలో.. అకస్మాత్తుగా కదలిక మొదలైంది.

యుక్రెయిన్ బలగాలు పురోగమించాయి. రష్యా బలగాలు హడావుడిగా వెనుదిరిగాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతమైన ఖార్కియేవ్‌లోని వ్యూహాత్మక ప్రాంతాల నుంచి వెనుకంజవేశాయి. సైనికంగా కీలకమైన కుపియాన్స్క్, ఇజియుమ్ నగరాలను వారు కోల్పోయారు.

''రష్యా సైన్యం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సైన్యంగా పేరు గడించడానికి పరుగులు తీస్తోంది. పరుగు తీస్తూ ఉండండి'' అని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రియేవ్ యెర్మాక్ ట్వీట్ చేశారు.

రష్యా బలగాలు వదిలివెళ్లిన శిబిరాలు, ధ్వంసమైన వారి స్థావరాలు, కొత్తగా విముక్తం చేసిన ప్రాంతాల్లో యుక్రెయిన్ సైన్యం తమ జెండాలను ఎగురవేస్తున్న దృశ్యాలతో కూడిన ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

యుక్రెయిన్ బలగాల ఎదురుదాడి జరిగిన వేగం, విస్తృతి.. అటు ఆక్రమణదారులను, ఇటు యుక్రెయిన్ వాసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

''నేను షాకయ్యాను.. సంతోషంగానే'' అని ఓ యుక్రెయిన్ సైనికుడు చెప్పారు.

''మమ్మల్ని ఉత్సాహపరచటానికి మంచి విజయం మాకు అవసరమైంది. ఖార్కియేవ్‌లో డొమినో ఎఫెక్ట్ (పేకల వరుస కూలిపోయినట్లు కూలిపోవటం) ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ వారి దగ్గర ఇంకా ఆయుధాలు, సైనికులు ఉన్నారు. మా భూభాగం చాలా వారి ఆధీనంలో ఉంది. మా పొరుగున ఉన్నదెవరో జనానికి ఇప్పటికీ తెలుసు. కానీ ఇప్పుడు జనంలో భయం తగ్గింది. భరోసా పెరిగింది'' అని ఆయన వివరించారు.

యుద్ధంతో ఛిద్రమైన యుక్రెయిన్‌కు.. డోన్బాస్ ప్రాంతంలో వేసవిలో చవిచూసిన నష్టాల అనంతరం ఈ పురోగమనం ఊపునిచ్చింది.

జూన్‌లో అక్కడి నుంచి మేం కథనాలు ఇచ్చినపుడు.. యుక్రెయిన్ బలగాలు ఇంతటి బలమైన ఎదురు దాడి చేయగలవన్న సంకేతమేదీ కనిపించలేదు.

యుక్రెయిన్ సైనికుడు

''ఇది సైనిక అద్భుతం'' అంటారు 38 ఏళ్ల ఐటీ ఇంజనీర్ మిఖాయిలో.

దీర్ఘశ్రేణి బహుళ రాకెట్ లాంచ్ సిస్టమ్స్‌ సహా ఎన్నో విదేశీ ఆయుధాలు, విదేశీ నిఘా సమాచారం సాయంతో ఈ 'అద్భుతా'న్ని సాధించారు.

దక్షిణ ఖేర్సన్ ప్రాంతంలో ప్రతి దాడులకు ప్రణాళికా రచన గురించి మాట్లాడటం ద్వారా రష్యన్ల మీద యుక్రేనియన్లు తెలివిగా పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది.

ఆ గాలినికి చిక్కుకున్న రష్యా.. కొన్ని బలగాలను ఆ ప్రాంతాలకు పంపించటంతో ఖార్కియెవ్‌లోని వారి స్థానాలు ప్రమాదకర స్థాయిలో బలహీనపడినట్లు కనిపిస్తోంది.

అయితే.. యుద్ధ రంగంలోనూ రష్యన్లను యుక్రేనియన్లు ఓడించగలరని కూడా ఈ ప్రతిదాడి చాటుతోందని పశ్చిమ సైనిక నిపుణులు చెప్తున్నారు.

''ఇప్పుడు రష్యన్ల మీద తెలివిగా పైచేయి సాధించటమే కాదు, వారిని ఓడించటం కూడా మనం చూస్తున్నాం'' అని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ మైఖేల్ క్లార్క్ చెప్పారు. ఇది ''కీలక మలుపు'' అని ఆయన అభివర్ణిస్తున్నారు.

యుక్రెయిన్ పురోగమనం

సెప్టెంబర్ ఆరంభం నుంచి తమ బలగాలు సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ శనివారం నాడు చెప్పారు. ఆదివారం నాడు సైన్యం ఒక ప్రకటన చేస్తూ.. తాము 3,000 కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నామని చెప్పింది.

ప్రస్తుతం బీబీసీ ప్రతినిధులు సహా జర్నలిస్టులను యుద్ధ రంగానికి దూరంగా ఉంచుతున్నారు. యుక్రెయిన్ చెప్తున్న వాదనలన్నిటినీ మేం తనిఖీ చేయలేం. అయితే ఖార్కియేవ్ నుంచి తమ సైనిక బలగాలు వెనుదిరిగాయని రష్యా అంగీకరించింది. ఆ బలగాలను తిరిగి 'ఏకీకరణ' చేశామని చెప్పింది.

యుక్రెయిన్ తాజాగా పురోగమించినప్పటికీ.. యుక్రెయిన్ భూభాగంలో దాదాపు ఐదో వంతు భూభాగం ఇంకా రష్యా ఆధీనంలోనే ఉంది. అందులో ఖేర్సన్ నగరం కూడా ఉంది.

రష్యా సైనిక దాడి మొదలుపెట్టిన తర్వాత ఆ దేశం వశమైన తొలి పెద్ద నగరం ఖేర్సన్. 2014 నుంచి రష్యా ఆధీనంలో ఉన్న క్రైమియా ద్వీపకల్పానికి ఉత్తరాన ఉంటుందీ నగరం.

అక్కడ ఇప్పటికీ నివసిస్తున్న ఒక మహిళను మేం సంప్రదించగలిగాం. రష్యా బలగాలు తగ్గుముఖం పట్టినట్లు ఆమె చెప్తున్నారు. ఆమె భద్రత రీత్యా ఆమె పేరును మేం వెల్లడించటం లేదు.

''గత రెండు, మూడు రోజులుగా సైన్యం కదలికలు కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది'' అని ఆమె మాతో చెప్పారు.

రష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు

''కెఫేలు, రెస్టారెంట్లలో వారు ఇంతకుముందులా కనిపించటం లేదు. ఒకవేళ వీధి పోరాటం మొదలైతే అది చాలా ప్రమాదకరం. కానీ అవసరమైతే నేను రోజులు, వారాల పాటు బేస్‌మెంట్‌లో కూర్చుంటాను. మా సైన్యాన్ని ఇక్కడ చూడాలని, వారికి కృతజ్ఞతలు చెప్పాలని నేను కోరుకుంటున్నా. గెలుపు చూడాలని అనుకుంటున్నా'' అని చెప్పారామె.

నగరంలో రష్యన్లను ప్రతిఘటిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తల వ్యవస్థ కూడా విజయం కోసం నిరీక్షిస్తోంది. వారు రష్యా సైనిక స్థావరాలు, శిబిరాలకు సంబంధించిన సమాచారాన్ని వారు సేకరించి, యుక్రెయిన్ బలగాలకు చేరవేస్తున్నారు.

రష్యన్లు తమను వేటాడుతున్నారని ఆ ప్రతిఘటన బృందం సభ్యుడొకరు మాతో చెప్పారు. ఆయన వివరాలను మేం వెల్లడించలేం.

''వ్యూహాత్మక ప్రాంతాలకు సమీపంలోని ఫ్లాట్ల మీద సామూహిక సోదాలు నిర్వహిస్తున్నారు. గత వారంలో జనాన్ని రోడ్ల మీద పట్టుకుని తీసుకెళ్లిన ఘటనలు రెండు జరిగాయి'' అని తెలిపారు.

అయితే యుద్ధ రంగం నుంచి వస్తున్న వార్తలు ఆశలు తీసుకొస్తున్నాయని అన్నారు. ''ఖార్కియేవ్ చుట్టుపక్కల పురోగమనం ప్రజలకు ఉత్సాహాన్నిస్తోంది. తర్వాత మాకు విముక్తి లభిస్తుందని చాలా మంది ఆశిస్తున్నారు'' అని ఆయన చెప్పారు.

కీలకమైన ఖేర్సన్ నగరంలో పోరాటం ఇంకా మొదలుకాలేదు. అయితే యుక్రెయిన్ బలగాలు ఇప్పటివరకూ సాధించిన పురోగమనం.. యుక్రెయిన్‌కు, దానికి మద్దతిస్తున్న పశ్చిమ దేశాలకు భరోసానిస్తున్నాయి. ఈ విజయాలను నిలుపుకున్నట్లయితే.. ఇది ఈ యుద్ధాన్ని మలుపుతిప్పవచ్చు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ చేతులు ఎత్తేస్తారని ఎవరూ భావించటం లేదు. యుక్రెయిన్ విషయానికి వస్తే ఆయన సుదీర్ఘమైన దృష్టితో చూస్తారు.

కానీ కొన్ని ప్రాంతాల్లో రష్యా సైనికగోడలు పూర్తిగా కుప్పకూలాయి. ఆ దేశ సైనికులు పారిపోయారు. అది కేవలం ఓటమి కాదు. అది అవమానం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ukraine war: Fear on one side, joy on the other in villages freed from Russia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X