కాబూల్ పై డ్రోన్ దాడి తప్పిదమే- అమెరికా పశ్చాతాపం-తప్పుడు నిఘా సమాచారం వల్లే...
గత నెలలో ఆప్ఘనిస్తాన్ లోని కాబూల్ ఎయిర్ పోర్టు సమీపంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో 10 మంది పౌరులు చనిపోయారు. ఇందులో పిల్లలు కూడా ఉన్నారు. ఈ డ్రోన్ దాడిని అప్పట్లో సమర్ధించుకున్న యూఎస్ దళాలు.. కాబూల్ ఎయిర్ పోర్టులో ఐసిస్ కె జరిపిన దాడికి ప్రతీకారంగా వారిని టార్గెట్ చేసినట్లు చెప్పుకున్నాయి. అయితే అదంతా అబద్ధమని తేలిపోయింది.
కాబూల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఐసిస్-కె తీవ్రవాద స్ధావరంపై తాము డ్రోన్ దాడి జరిపినట్లు తొలుత ప్రకటించుకున్న అమెరికా.. ఇప్పుడు మాత్రం అదో తప్పిదంగా పేర్కొంది. ఇది పొరబాటున జరిపిన దాడి మాత్రమేనని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ తాజాగా పేర్కొన్నారు. అమెరికా బలగాలు ఆప్ఘనిస్తాన్ ను వీడి వెళ్లే సమయంలో ఈ డ్రోన్ దాడి జరిపారు. ఇంటిలిజెన్స్ తప్పుడు సమాచారం వల్లే ఈ దాడి జరిగినట్లు అమెరికా దళాల టాప్ కమాండర్ పశ్చాతాపం ప్రకటించారు.

కాబూల్ ఎయిర్ పోర్టులో దాక్కున్న ఐసిస్ కె తీవ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేయాలని అమెరికా భావించిందని, కానీ దురదృష్టవశాత్తూ అక్కడ పౌరులు చనిపోయినట్లు తాజా ప్రకటనలో కమాండర్ వెల్లడించారు. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో విచారణ జరిపించిన అమెరికా సైన్యం.. ఇవాళ తాజా ప్రకటన విడుదల చేసింది. ఆ డ్రోన్ దాడిలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం ప్రకటిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ దారుణ తప్పిదం నుంచి కచ్చితంగా పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది. ఈ దాడికి క్షమాపణలు చెప్తున్నట్లు అమెరికా సైన్యం నుంచి ప్రకటన వెలువడింది.

కాబూల్ ఎయిర్ పోర్టుపై దాడికి ఓ టయోటా వాహనంలో ఐసిస్ తీవ్రవాదులు పథక రచన చేస్తున్నారన్న సమాచారంతోనే తాము ఈ డ్రోన్ దాడి జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటన తెలిపింది. కానీ తమ ఇంటిలిజెన్స్ వర్గాలు ఈ విషయంలో పూర్తి అవగాహనా రాహిత్యం ప్రదర్శించినట్లు అగ్రరాజ్యం అంగీకరించింది. మరోసారి నిఘా పరంగా కూడా ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటామని అమెరికా ప్రకటన తెలిపింది.












Click it and Unblock the Notifications