ఆ దేశంలో అమెరికా పాస్‌పోర్ట్ చూపిస్తే జైలులో పడ్డట్టే
ఇరాన్‌లోని తమ పౌరులు తక్షణమే దేశం విడిచివెళ్లాలని అమెరికా తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అక్కడ పెరుగుతున్న అశాంతి, ప్రయాణ అంతరాయాల నేపథ్యంలో ఈ సూచన ఇచ్చింది. సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తమ సహాయంపై ఆధారపడకూడదని, సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇరాన్‌లో భద్రతా ఆందోళనలు, కమ్యూనికేషన్‌లపై ఆంక్షలు, రవాణా మార్గాల్లో అనిశ్చితి వంటివి పౌరుల భద్రతకు ముప్పు తీసుకువస్తున్నాయని వర్చువల్ యూఎస్ ఎంబసీ పేర్కొంది.
అధికారిక తరలింపు, ఇతర సహాయ కార్యక్రమాలకు అందుబాటులో ఉన్న వనరులు చాలా పరిమితంగా ఉన్నాయని, ప్రజలు సొంతంగా ఇరాన్ నుంచి బయటపడే మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని, సురక్షిత దేశాలకు తరలి వెళ్లాలని అమెరికా ఎంబసీ తేల్చి చెప్పింది. ఇరాన్‌లో దేశవ్యాప్తంగా సాగుతున్న నిరసనల కారణంగా అధిక భద్రతా చర్యలు అమలులో ఉన్నాయి. రహదారుల మూసివేత, ప్రజా రవాణాకు అంతరాయాలు, అలాగే ఇంటర్నెట్, మొబైల్, ల్యాండ్‌లైన్, జాతీయ ఆన్‌లైన్ నెట్‌వర్క్ సేవలు అందుబాటులో ఉండట్లేదు.

భారత్ సహా పలు దేశాలకు చెందిన పౌర విమానయాన సంస్థలు ఇరాన్‌కు చాలా పరిమితంగా విమానాలను నడుపుతోన్నాయి. ఫలితంగా ప్రయాణికులలో మరింత అనిశ్చితి ఏర్పడింది. సురక్షితమైతే, పొరుగు దేశాలైన టర్కీ, అర్మేనియా వంటి దేశాలకు భూమార్గం ద్వారా వెళ్ళడాన్ని పరిశీలించాలని అమెరికన్ ఏంబసీ తమ దేశ పౌరులకు సూచించింది. వెంటనే బయలుదేరలేని వారు తమ నివాసం లేదా మరేదైనా సురక్షితమైన భవనంలో ఆశ్రయం పొందాలని పేర్కొంది.
ఆహారం, మంచినీరు, మందులు వంటి నిత్యావసర సామాగ్రిని నిల్వ చేసుకోవాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కమ్యూనికేషన్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని ఎంబసీ అధికారులు కోరారు. అమెరికా-ఇరాన్ ద్విజాతీయత పౌరులకు ప్రత్యేక ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. ఇరాన్ పాస్‌పోర్ట్‌లతో మాత్రమే దేశం విడిచి వెళ్ళాల్సి ఉంటుందనీ సూచించింది. అమెరికా పాస్‌పోర్ట్ చూపినా లేదా అమెరికాతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించినా ఇరాన్ అధికారులు తక్షణమే నిర్బంధించవచ్చని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications