H1B Visa: హెచ్ 1బీ వీసాల అప్లికేషన్లపై ట్రంప్ గుడ్ న్యూస్..! కీలక అప్డేట్..!
అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసాలపై గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మధ్యే షట్ డౌన్ కారణంగా నిధుల కొరత తలెత్తడంతో తాత్కాలికంగా హెచ్1బీ వీసాల దరఖాస్తుల ప్రాసెసింగ్ ను ట్రంప్ సర్కార్ నిలిపేసింది. దీనిపై ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం తాత్కాలిక, శాశ్వత ఉపాధి కార్యక్రమాల కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేయడం తిరిగి ప్రారంభించినట్లు అమెరికా కార్మికశాఖ ప్రకటించింది.
వాస్తవానికి అమెరికన్ కాంగ్రెస్ లో ట్రంప్ సర్కార్ పెట్టిన ప్రతిపాదనలకు ఆమోదం లభించకపోవడంతో షట్ డౌన్ తప్పలేదు. దీంతో సెప్టెంబర్ 30 నుంచి హెచ్1బీ వీసాల దరఖాస్తుల ప్రాసెసింగ్ కూడా నిలిచిపోయింది. దీని ప్రభావంతో టెక్, హెల్త్ కేర్ తో పాటు ఇతర రంగాలలో విదేశీ నిపుణులపై ఆధారపడిన యజమానులకు కీలకమైన సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పరిస్ధితులు అదుపులోకి రావడంతో హెచ్1బీ వీసాదారులు వీసాల కోసం కొత్త లేబర్ కండిషన్ అప్లికేషన్‌లను సమర్పించేందుకు అవకాశం లభిస్తోంది.

మరోవైపు ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్ లేబర్ సర్టిఫికేషన్‌లు కూడా పునరుద్ధరించారు. ఇది విదేశీ కార్మికులను గ్రీన్ కార్డ్‌ల కోసం స్పాన్సర్ చేసే అమెరికన్ కంపెనీల యజమానులకు ప్రారంభ దశగా భావిస్తున్నారు. ఈ ప్రాసెస్ లు అమెరికా కార్మికుల వేతనాలు, పరిస్థితులపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలు చూపవని అంచనా వేస్తున్నారు. అలాగే భారతీయ పౌరులకు సైతం భారీ ఊరటగా భావిస్తున్నారు.

అమెరికా కార్మికశాఖ తాజా ప్రకటనలో ఓఎఫ్ఎల్సీ ఫ్లాగ్ వ్యవస్ధ ఇప్పుడు అందుబాటులో ఉందని, సిస్టమ్ వినియోగదారులు కొత్త దరఖాస్తులను సిద్ధం చేయడానికి, సమర్పించడానికి అలాగే తుది నిర్ణయం పెండింగ్‌లో ఉన్న వారి దరఖాస్తులకు సంబంధించిన సమాచారాన్ని సమర్పించడానికి, స్వీకరించడానికి అనుమతిస్తుందని తెలిపింది. ఈ మేరకు SeasonalJobs.dol.gov వెబ్‌సైట్‌తో పాటు, ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్‌వే పోర్టల్ తిరిగి తెరుస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే వేలాది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రాసెసింగ్ లు ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications