అధ్యక్ష ఎన్నికల వేళ అనూహ్య పరిణామానికి తెరలేపనున్న ట్రంప్... ఏం జరగబోతోంది...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మునుపెన్నడూ చోటు చేసుకుని అనూహ్య పరిణామాలు ఈసారి చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకముందే... నవంబర్ 3 అర్ధరాత్రి డొనాల్డ్ ట్రంప్ 'విక్టరీ' ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తన సన్నిహితులకు ట్రంప్ ఈ విషయం చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అటు ట్రంప్ ప్రత్యర్థి వర్గం కూడా గత కొద్ది నెలలుగా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోస్టల్ బ్యాలెట్‌తో ఆలస్యం...
డొనాల్డ్ ట్రంప్ మాత్రం 'విక్టరీ' ప్రకటనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అయితే ఎన్నికలు ముగిశాక బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగడం సరికాదన్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఎక్కువమంది ఓటర్లు ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అలాగే డెమోక్రాటిక్ పార్టీకి చెందిన చాలామంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు. పోస్టల్ ద్వారా చేరే ఈ ఓట్ల లెక్కింపుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో తుది ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

అవకతవకలు జరిగే ఛాన్స్.. ట్రంప్ ఆరోపణలు..
పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చే ఓట్లకు సంబంధించి... వాటి చెల్లుబాటును మొదట అధికారులు ధ్రువీకరిస్తారు. ఆ తర్వాతే వాటిని లెక్కింపుకు అనుమతిస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్స్ వచ్చే అవకాశం ఉండటంతో... ఈసారి లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకతవకలు జరిగే అవకాశం ఉందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు,ఒకవేళ తాను ఓటమిపాలైతే కోర్టులను ఆశ్రయించడానికి సిద్దమవుతున్నారు.

ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నిలిపివేయాలి : ట్రంప్
2000 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది ఫలితం రావడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యంతో విజేతను ప్రకటించారు. ఇప్పుడు ట్రంప్ కూడా న్యాయస్థానాలను ఆశ్రయించి అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని త్వరగా తేల్చాలని కోరే అవకాశం ఉంది. అంతేకాదు,ఎన్నికల రోజు రాత్రి తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేయాలని ట్రంప్ వాదిస్తుండటం గమనార్హం. పెన్సిల్వేనియా లాంటి రాష్ట్రాల్లో నవంబర్ 3 రాత్రి తర్వాత వచ్చే ఓట్లను కూడా లెక్కించడం సరికాదన్నారు. అక్కడ డెమోక్రాట్లకు అనుకూల గవర్నర్ ఉన్నారని... కాబట్టి అవకతవకలు జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు.
Recommended Video

ఖండించిన పెన్సిల్వేనియా అటార్నీ
ట్రంప్ ఆరోపణలను పెన్సిల్వేనియా అటార్నీ జనరల్ జోష్ షెపిరో ఖండించారు. ట్రంప్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. మంగళవారం రాత్రి 8గంటలకు ముందు పోస్టుమార్క్ చేయబడి...
శుక్రవారం ఉదయం 5గంటల వరకు వచ్చే పోస్టల్ బ్యాలెట్స్ అన్నింటినీ లెక్కించడం జరుగుతుందన్నారు. ఈ విధానాన్ని పెన్సిల్వేనియా సుప్రీం కోర్టు సైతం సమర్థించిందన్నారు. ఒకవేళ ట్రంప్ న్యాయపరంగా సవాల్ చేసినా... చట్టపరమైన సవాళ్లను ఇది తట్టుకుని నిలబడగలదన్నారు.












Click it and Unblock the Notifications