US Green Card: గ్రీన్ కార్డుల ఫ్రీజ్ తో భారతీయులపై పడే ప్రభావం- 8 సందర్భాలు..!
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు అక్కడి ట్రంప్ సర్కార్ తాజాగా భారీ షాకిచ్చింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, అడోబ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ సంస్థలు గ్రీన్ కార్డ్ (US Green Card) ప్రక్రియలో భాగమైన పెర్మ్ (PERM) కార్యక్రమంలో పాల్గొనకుండా ఆంక్షలు విధించింది. దీంతో ఆయా సంస్థలు కొత్త పెర్మ్ దరఖాస్తులను సమర్పించలేవు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌పైనా ఆంక్షలు వర్తించబోతున్నాయి.
భారతీయులపై వేర్వేరుగా గ్రీన్ కార్డు ఆంక్షల ప్రభావం (US Green Card)
ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ప్రభావం భారతీయులపై వేర్వేరుగా ఉండబోతోందని నిపుణులు చెప్తున్నారు. ఈ పరిణామాన్ని అన్ని హెచ్-1బీ వీసాల రద్దుగా భావించకూడదని అంటున్నారు. ఇప్పటికే ఉన్న హెచ్-1బీ వీసాలు ఆటోమేటిక్‌గా రద్దు కావని తెలుస్తోంది. ఇప్పటికే గ్రీన్ కార్డ్ పొందినవారి శాశ్వత నివాస హోదా కూడా ఈ నిర్ణయంతో ఆటోమేటిక్‌గా రద్దు కాదని చెప్తున్నారు. అమెరికా పెర్మ్ ఆంక్షలు విధించిన కంపెనీల్లో పనిచేస్తూ, యజమాని ద్వారా గ్రీన్ కార్డ్ పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ ఉద్యోగులు ఈ పరిణామంతో ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈ ఎనిమిది సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ వెంటనే అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు. వారి ప్రస్తుత వీసా స్థితి, పని అనుమతి, వ్యక్తిగత ఇమిగ్రేషన్ పరిస్థితులపై పరిణామాలు ఆధారపడి ఉంటాయి.

ఎవరిపై ఎక్కువ ప్రభావం ?
గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న H-1B ఉద్యోగులు, భారతీయులు కొత్త దరఖాస్తులపై ఆంక్షలు, పెండింగ్ కేసుల నిలిచిపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాగే హెచ్-1బీ 6 సంవత్సరాల గడువు ముగింపు దశలో ఉన్నవారు తమ అర్హతలు ముందుగానే పరిశీలించుకోవాలి. అలాగే ఇప్పటికే PERM దరఖాస్తు సమర్పించినవారు కూడా ఇమ్మిగ్రేషన్ లో తమ స్టేటస్ చెక్ చేసుకోవాలి. వీరితో పాటు గ్రీన్ కార్డ్ ప్రక్రియ ఇంకా ప్రారంభించని ఉద్యోగులకు సైతం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ జాబితాలో లేని సంస్థల్లో పనిచేస్తున్నవారు వలస నిబంధనలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇప్పటికే గ్రీన్ కార్డ్ పొందినవారికి మాత్రం అవి ఆటోమేటిగ్గా రద్దు కావు. అలాగే ఓపీటీ లేదా స్టెమ్ ఓపీటీ పనిచేస్తున్న భారతీయ విద్యార్థులు సంబంధిత కంపెనీల ద్వారా భవిష్యత్తులో గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ పొందాలని భావిస్తే ఆలస్యం కావచ్చు. H-4పై ఆధారపడిన కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక నివాసం, ఉద్యోగ అవకాశాలు, పిల్లల చదువుల ప్రణాళికల విషయంలో అనిశ్చితిని ఎదుర్కోవచ్చు.

భారతీయ ఉద్యోగులు ఇప్పుడు ఏం చేయాలి?
తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయ ఉద్యోగులు తమ పెర్మ్ దరఖాస్తు సమర్పించారా, పెండింగ్‌లో ఉందా అనే విషయాన్ని యజమాని ఇమిగ్రేషన్ బృందంతో నిర్ధారించుకోవాలి. హెచ్ -1బీ ఆమోద పత్రం, అమెరికాలో ఉండేందుకు అనుమతించిన గడువు వంటి వివరాలను పరిశీలించుకోవాలి. వీసా గడువు ముగింపు దగ్గరలో ఉంటే, పొడిగింపులకు అర్హత ఉందో లేదో అర్హత కలిగిన అమెరికా ఇమిగ్రేషన్ న్యాయవాదిని సంప్రదించాలి. కంపెనీ మారితే పాత పెర్మ్ దరఖాస్తు ఆటోమేటిక్‌గా కొత్త యజమానికి బదిలీ అవుతుందని భావించకూడదు. తమ వలస దరఖాస్తులకు సంబంధించిన పత్రాలు, రసీదులు, ఆమోద పత్రాలను భద్రపరచుకోవాలి.













Click it and Unblock the Notifications
