ఈ నెల 27వ తేదీ అర్థరాత్రి 12:01 నిమిషాలకు: భారత్ కు ట్రంప్ పెట్టిన ముహూర్తం
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు.
ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది.

ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.
భారత్ పై విధించిన టారిఫ్ మొత్తాన్ని 25 నుంచి 50 శాతానికి పెంచడానికి గల కారణానలు వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లివిట్ వెల్లడించారు. వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా కొనసాగించకుండా నిరోధించడంలో భాగంగా భారత్ పై అదనపు టారిఫ్ ను విధించాల్సి వచ్చిందని అన్నారు.
అదనంగా విధించిన 25 శాతం టారిఫ్ ను అమలు పర్చడానికి ఉద్దేశించిన అధికారిక ఉత్తర్వులను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా జారీ చేసింది. ఈ అదనపు టారిఫ్ ను వసూలు చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 27వ తేదీ అర్థరాత్రి 12:01 నిమిషాల నుంచి టారిఫ్ అమలులోకి వస్తుంది.
ఈ మేరకు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం నోటీసు జారీ చేసింది. ఈ 25 శాతం అదనపు టారిఫ్ విధించడానికి గల కారణాలను ఇందులో స్పష్టంగా పొందుపరిచింది కూడా. రష్యా నుండి అమెరికాకు ముప్పు పొంచివున్న కారణంగా ఈ కొత్త టారిఫ్ విధించాల్సి వచ్చిందని వివరించింది. రష్యాను నియంత్రించడంలో భాగంగా భారత్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
భారత్ నుండి దిగుమతి చేసుకునే అన్నిరకాల ఉత్పత్తులు, వస్తువులపై విధించిన అదనపు 25 శాతం టారిఫ్.. 2025 ఆగస్టు 27వ తేదీన తెల్లవారుజామున 12:01 ఈస్ట్ డే-లైట్ సమయం నుండి అమలులోకి వస్తాయని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తేల్చి చెప్పింది. ఈ నెల 6వ తేదీన డొనాల్డ్ ట్రంప్ సంతకంతో జారీ అయిన నంబర్ 14329 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
ఇప్పటివరకు కూడా చైనా సహా రష్యా నుంచి క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తోన్న ఇతర దేశాలపై అమెరికా ఈ అదనపు టారిఫ్ ను విధించకపోవడం, భారత్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై భారత్ ఇదివరకే స్పందించింది. అత్యంత దురదృష్టకరంగా అభివర్ణించింది.












Click it and Unblock the Notifications