అగ్రరాజ్యం ప్లాన్ అట్టర్ ప్లాప్: అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ చెక్!
ఇరాన్‌లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న రాజకీయ, సామాజిక అశాంతి ముగిసిందని ఆ దేశ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌ను అంతర్గతంగా బలహీనపరిచేందుకు పన్నిన భారీ కుట్రను తమ దేశం తిప్పికొట్టిందని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆరోపణలు
ఖమేనీ తన ప్రసంగంలో అమెరికా, ఇజ్రాయెల్‌లను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్‌లో అస్థిరతను సృష్టించడానికి ఈ రెండు దేశాలు నిరసనకారులను రెచ్చగొట్టాయని ఆయన ఆరోపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఖమేనీ 'క్రిమినల్' అని పేర్కొన్నారు. ఇరాన్‌లో జరిగిన హింసకు, ప్రాణనష్టానికి ట్రంప్ మద్దతు ఇచ్చిన అల్లరిమూకలే కారణమని ఆయన మండిపడ్డారు. ఇరాన్‌ను కబళించాలని చూసిన శత్రువుల ప్లాన్‌ను ఇరాన్ ప్రజలు, భద్రతా దళాలు కలిసి అడ్డుకున్నాయని ఆయన తెలిపారు.

ఆర్థిక అసంతృప్తి నుంచి హింసాత్మక నిరసనల వరకు..
డిసెంబర్ చివరిలో ఇరాన్‌లో పెరిగిన ధరలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రారంభమైన శాంతియుత నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సుమారు 3000 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించే వారికి కఠిన శిక్షలు, అవసరమైతే మరణశిక్షలు విధిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
సాధారణ స్థితికి చేరుకుంటున్న ఇరాన్
ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. నిరసనల కారణంగా వారం రోజులుగా మూతపడిన పాఠశాలలను మళ్లీ తెరిచారు. నిలిపివేసిన మొబైల్ మెసేజింగ్ సేవలను తిరిగి ప్రారంభించారు. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా సంస్థ ఇరాన్‌కు మద్దతు ప్రకటించింది. మరోవైపు, తమ అంతర్గత విషయాల్లో జీ7 (G7) దేశాల జోక్యాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.












Click it and Unblock the Notifications