భారత్‌లోని తమ దేశ పౌరులను హెచ్చరించిన అమెరికా
Pahalgam Terror Attack: పహల్గామ్‌లో ఉగ్రదాడి చోటు చేసుకున్న అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా రెడ్ అలర్ట్ జారీ అయింది. భద్రత సిబ్బంది, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు.
జమ్మూ కాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటోన్నాయి. బుధవారం నాడు బారాముల్లా, కుల్గామ్‌లల్లో, నేడు ఉధంపూర్ జిల్లాలో భద్రత బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. యూరీ సెక్టార్ వద్ద భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు చొరబాటుదారులు హతం అయ్యారు. వారిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. పెద్ద ఎత్తున మారణాయులను స్వాధీనం చేసుకున్నారు.

నేడు ఉధంపూర్ జిల్లాలో తాజాగా ఆర్మీ జవాన్లు- ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. జిల్లాలోని దుదు-బసంత్‌గఢ్ ఏరియాలో కార్ప్స్ 9, కార్ప్స్ 16, వైట్ నైట్ కార్ప్స్ విభాగాలకు చెందిన జవాన్లు ఈ కార్డెన్ అండ్ సెర్చ్ చేపట్టారు. ఈ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టారు. ఆ సమయంలో హఠాత్తుగా ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు.
దీనికి ప్రతిగా జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. రెండు గంటలుగా వీరి మధ్య భీకరంగా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఓ జవాన్ వీరమరణం పొందారు. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది. అమరుడైన జవాన్‌ను ఝంటు అలీ షేక్‌గా గుర్తించారు. పారా మిలటరీ స్పెషల్ ఫోర్స్ 6కు చెందిన జవాన్ ఆయన.
ఈ వరుస ఉదంతాలతో.. జమ్మూ కాశ్మీర్ మొత్తం దాదాపుగా నిర్మానుష్యంగా మారింది. మొన్నటివరకు వేల మంది సందర్శకులతో కళకళలాడిన పర్యాటక ప్రాంతాలన్నీ కూడా బోసిపోయాయి. దాల్ లేక్‌లో బోట్ హౌస్‌లు స్తబ్దుగా ఉంటోన్నాయి. పహల్గామ్‌లో బయటి వ్యక్తులెవరూ ఉండట్లేదు. అనేక ప్రాంతాలను భద్రత బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి.
అక్కడ నెలకొన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో ట్రావెల్ అడ్వైజరీ చేసింది. అమెరికన్లు ఎవరూ కూడా జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లకూడదని సూచించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్‌తో పాటు భారత్‌లో పలు నగరాల్లో హైఅలర్ట్ జారీ అయిందని గుర్తు చేసింది.
పహల్గామ్‌తో పాటు శ్రీనగర్, గుల్మార్గ్ వంటి ప్రాంతాలకు తరచూ వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వెళ్తుంటారని, ఇప్పుడు అక్కడ నెలకొన్న అనిశ్చిత, ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ దేశ పౌరులెవరూ అటు వెళ్లొద్దని సూచించింది. ఇందులో లఢక్, లేహ్‌ను మినహాయించింది.












Click it and Unblock the Notifications