నేనొప్పుకోను.. హర్మూజ్ తెరిచినా కానీ.. అమెరికా బ్లాకేడ్‌ను ఎత్తివేయం ??
అమెరికా అధ్యక్షుడు Donald Trump మరోసారి సంచలన వ్యాఖ్యలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. Iran హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినప్పటికీ, అమెరికా తన బ్లాకేడ్‌ను ఎత్తివేయబోదని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందిస్తూ, "హర్మూజ్ తెరిచి ఉంది.. కానీ ఇరాన్‌తో మా లావాదేవీ పూర్తయ్యే వరకు బ్లాకేడ్ కొనసాగుతుంది" అని ప్రకటించారు.
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన Strait of Hormuz తెరవడం వల్ల మొదట అంతర్జాతీయ మార్కెట్లలో ఊరట కనిపించింది. ఇరాన్ నిర్ణయంతో ముడి చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి వస్తుందనే అంచనాతో ధరలు ఒక్కసారిగా 10 శాతం వరకు పడిపోయాయి. అయితే, అమెరికా బ్లాకేడ్ కొనసాగుతుందనే ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లలో మళ్లీ అనిశ్చితిని పెంచాయి.

ఈ పరిణామం వాణిజ్య వర్గాల్లో కలకలం రేపింది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలు ఒకవైపు ధరలు తగ్గడంతో సంతోషపడుతుండగా, మరోవైపు భవిష్యత్తు సరఫరాపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. షిప్పింగ్ కంపెనీలు కూడా పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి.
ఇదే సమయంలో, అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని, త్వరలో ఒక ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఒప్పందం పూర్తయ్యే వరకు ఒత్తిడి కొనసాగించేందుకు బ్లాకేడ్‌ను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు అణు అంశంపై కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అధిక యురేనియంను అప్పగించాల్సి ఉంటుందని, భూగర్భంలో ఉన్న యురేనియంను సంయుక్తంగా తొలగించే ప్రణాళికపై పనిచేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రకటనతో అణు ఒప్పందంపై మరోసారి చర్చలు వేడెక్కాయి.
ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి Abbas Araghchi ఇప్పటికే హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ప్రకటించారు. లెబనాన్ ప్రాంతంలో కాల్పుల విరమణ నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం సముద్ర వాణిజ్యానికి కొంత ఊరటనిచ్చింది.












Click it and Unblock the Notifications