
రష్యా నుంచి ఆయుధాలు కొనొద్దు: భారత్‌కు అమెరికా కీలక సూచన: ఆ కేంద్రమంత్రులను పిలిచి మరీ
వాషింగ్టన్: రష్యా ఉక్రెయిన్ ఆరంభమైన యుద్ధం రోజుల తరబడి భీకరంగా కొనసాగుతోంది. 45 రోజులుగా సాగుతున్న యుద్ధం వల్ల రెండు వైపులా భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు ధ్వంసం అయ్యాయి. శిథిలాలుగా మారాయి. వేలాదిమంది రష్యన్ సైనికులు మరణించారు. ఒకవంక శాంతి చర్చలను నిర్వహిస్తూనే మరోవంక- యుద్ధాన్ని కొనసాగిస్తోంది రష్యా. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, క్రిమియా, ఖార్కీవ్ వంటి పలు నగరాలు రష్యా సైనిక బలగాల ఆధీనంలో ఉన్నాయి.

భారత్-యూఎస్ భేటీ..
ఈ పరిణామాల మధ్య రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుబ్రహ్మణ్యం జైశంకర్.. అమెరికాలో పర్యటిస్తోన్నారు. ఆ దేశ రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. 2+2 భేటీ ఇది. భారత్ నుంచి రాజ్‌నాథ్ సింగ్, సుబ్రహ్మణ్యం జైశంకర్, అమెరికా తరఫున ఆంటోని బ్లింకెన్, లాయిడ్ అస్టిన్ పాల్గొన్నారు. పలు కీలక అంశాలు ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చకు వచ్చాయి.

కీలక అంశాల ప్రస్తావన..
ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, దానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇండో-పసిఫిక్ రీజియన్, చైనా అనుసరిస్తోన్న విధానాలు, ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాపై పాశ్చాత్య దేశాలు అనుసరిస్తోన్న వైఖరి.. వంటి అంశాలపై ఇందులో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తూ అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

రష్యాపై ఆంక్షల వేళ..
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను పాశ్చాత్య దేశాలు ఏకాకిని చేసిన విషయం తెలిసిందే. అన్ని రకాల ఆంక్షలు, నిషేధాజ్ఞలను విధించాయి. రష్యాతో సంబంధాలను తెంచుకున్నాయి. యూరోపియన్ యూనియన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సభ్య దేశాలు తమ పరిధిలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సహా పలువురు ప్రముఖుల ఆస్తిపాస్తులను స్తంభింపజేశాయి.

భారత్ వైఖరి పట్ల అభ్యంతరం..
ఇలాంటి వాతావరణం మధ్య రష్యాతో భారత్ సహా కొన్ని దేశాలు సత్సంబంధాలను కొనసాగించడం పట్ల అమెరికా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- భారత్. రష్యా నుంచి ఇంధనం, రక్షణ పరికరాలు, యుద్ధ సామాగ్రి, ఆయుధాలను పెద్ద ఎత్తున భారత్ కొనుగోలు చేస్తోంది. త్రివిధ దళాలు వినియోగిస్తోన్న యుద్ధ సామాగ్రి, ఆయుధాలు 80 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే. దశాబ్దాల కాలంగా ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ వస్తోన్నాయి.

రష్యా నుంచి ఆయుధాలు కొనొద్దు..
ఆ ఆయుధాలను కొనుగోలు చేయొద్దంటూ తాజాగా- అమెరికా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుబ్రహ్మణ్యం జైశంకర్‌లకు సూచించింది. భారత్ మాత్రమే కాకుండా.. రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసుకుంటోన్న దేశాలన్నీ తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పేర్కొంది. రష్యాతో ఆయుధ కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ఆంటోని బ్లింకెన్ సూచించారు. ఇందులో ఏ ఒక్క దేశానికి కూడా మినహాయింపు లేదని స్పష్టం చేశారు. కొత్తగా ఎలాంటి ఒప్పందాలను కూడా కుదుర్చుకోవద్దని చెప్పారు.

మేము సరఫరా చేస్తాం..
భారత్ కొత్తగా రష్యా నుంచి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంటోని బ్లింకెన్ ఈ సూచన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా- పెద్ద ఎత్తున ఆయుధాలను సరఫరా చేయలేని అప్పటి రోజుల్లో భారత్.. రష్యా వైపు మొగ్గు చూపిందని, ఇప్పడు అలాంటి పరిస్థితులు లేవని బ్లింకెన్ తేల్చి చెప్పారు. భారత్‌కు అవసరమైన ఆయుధ సామాగ్రిని తాము అందించగలమని అన్నారు.

ఆయుధాల సరఫరాకు సై..
సమావేశం ముగిసిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్, సుబ్రహ్మణ్యం జైశంకర్-ఆంటోని బ్లింకెన్, లాయిడ్ అస్టిన్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత్- తన దేశ రక్షణ వ్యవస్థను ఆధునికంగా తీర్చిదిద్దుకుంటోందని, దీనికి అవసరమైన సహాయ, సహకారాన్ని తాము అందించగలమని లాయిడ్ అస్టిన్ అన్నారు. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించామని, భారత్ తన వైఖరిని ఇంకా తెలియజేయాల్సి ఉందని వివరించారు.