కమలా హ్యారిస్ లీడ్ రోల్: ఆప్ఘన్ సంక్షోభం వేళ..సడన్‌గా ఆసియా టూర్: సింగపూర్‌లో ల్యాండ్
సింగపూర్: అరాచకానికి మారుపేరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్లు.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తరువాత నెలకొన్న పరిణామాలు భారత్ సహా అనేక దేశాలను ఉలికిపాటుకు గురి చేస్తోన్నాయి. మత ఛాందసవాదానికి నిలువెత్తు నిదర్శనంగా భావించే తాలిబన్లు.. తాము అనుకున్న దాన్ని సాధించడానికి ఎంత వరకైనా వెళ్తారనే విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది. ఎదుటివాడి ప్రాణాలను అలవోకగా తీసి పారేయగల కరడుగట్టిన మనస్తత్వం తాలిబన్ల సొంతం.
ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంపై తమదైన ముద్ర వేస్తోన్నారు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉపక్రమిస్తోన్న తాలిబన్లను మొగ్గలోనే తుంచేయాలనే ఉద్దేశాన్ని కనపరుస్తోన్నాయి ప్రపంచ దేశాలన్నీ. దీనికోసం జీ7 దేశాలన్నీ గ్రూపు కట్టనున్నాయి. ఇప్పటివీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యాయి. ఉగ్రవాదానికి, ఆప్గనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని తీర్మానాలు చేశాయి.

అదలా కొనసాగుతుండగానే- తాలిబన్ల దూకుడు వేసే ప్రయత్నాలను అగ్రరాజ్యం అమెరికా మరింత ముమ్మరం చేసింది. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటుకావడానికి ముందే కఠిన ఆంక్షలను విధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. ఆసియా దేశాల పర్యటనను ప్రారంభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అగ్నేయాసియా దేశాల్లో కమలా హ్యారిస్ ప్రస్తుతం పర్యటిస్తోన్నారు. ఇందులో భాగంగా ఆమె కొద్దిసేపటి కిందటే సింగపూర్‌కు చేరుకున్నారు.
సింగపూర్‌తో పాటు వియత్నాం దేశాల్లో ఆమె పర్యటించాల్సి ఉంది. కాగా- అమెరికా నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో బయలుదేరిన కమలా హ్యారిస్ కొద్దిసేపటి కిందటే సింగపూర్‌కు చేరుకున్నారు. ఆసియా ఉపఖండంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని, వాటిని పర్యవేక్షించడానికే కమలా హ్యారిస్ పర్యటనకు పూనుకున్నారని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆసియా విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తోన్నారు.
సింగపూర్ సంగతి ఎలా ఉన్నప్పటికీ- వియత్నాంను కమలా హ్యారిస్ పర్యటనలో చేర్చడం విమర్శలకు దారి తీస్తోంది. ఒకవంక చైనా ఆసియా ఉపఖండంలో అశాంతియుత వాతావరణానికి కారణమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టు ప్రభుత్వమే అధికారంలో వియత్నాంలో ఆమె పర్యటించబోతోండటం రాజకీయ దుమారానికి దారి తీస్తోంది. తన సింగపూర్ పర్యటనలో భాగంగా కమలా హ్యారిస్ సింగపూర్ అధ్యక్షుడు, ప్రధానమంత్రితో సమావేశమౌతారు.
అనంతరం ఆమె యూఎస్ఎస్ తుల్లాను వేదికగా చేసుకుని యూఎస్ సెయిలర్లను ఉద్దేశించి కమలా హ్యారిస్ ప్రసంగిస్తారు. ఆ తరువాత కమలా హ్యారిస్ మంగళవారం ఆమె హనోయ్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ పలువురు దేశాధినేతలు, ప్రధాన మంత్రులు కేంద్ర మంత్రులను కలుసుకుంటారు. ఆసియా ఉపఖండంలో శాంతియుత పరిస్థితులను నెలకొల్పడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తారు. అమెరికాకు చెందిన ఓ ఉపాధ్యక్షురాలు వియత్నాంలో పర్యటించబోతోండటం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications