పసిఫిక్ మహా సముద్రంలో 7.2, 6.9 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపాలు..!!
Vanuatu Earthquake: పసిఫిక్ మహాసముద్రం రీజియన్ లోని వనువాటులో జంట భూకంపాలు సంభవించాయి. చిన్న ద్వీపదేశం ఇది. ఇక్కడి తీరప్రాంతంలో 7.2, 6.9 తీవ్రతతో భూమి కంపించాయి. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు మొదట సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఆ ముప్పు లేకపోవడంతో తరువాత దాన్ని ఉపసంహరించుకున్నారు. భూకంప తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు. వనువాటు రాజధాని పోర్ట్ విలా బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశారు.
మొదటి భూకంపం ఈ ఉదయం 8:12 నిమిషాలకు సంభవించింది. పోర్ట్ సిటీ సోలాకు దక్షిణ దిశగా 200 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో భూమి ప్రకంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.2 గా రికార్డయింది. ఉపరితలం నుంచి ఆరు కిలోమీటర్ల లోతున టెక్టోనిక్ ప్లేట్లో సంభవించిన కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్జీఎస్ పేర్కొంది.

మరో అయిదు నిమిషాల తర్వాత మరోసారి భూమి ప్రకోపించింది. పోర్ట్ ఒర్లీకి నైరుతి దిశగా 197 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ సముద్రంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ రెండు కూడా షాలో ఎర్త్ క్వెక్స్. అంటే భూ ఉపరితలానికి అతి తక్కువ లోతులో ప్రకంపించినవి. లోతు తక్కువగా ఉండటం వల్ల ప్రకంపనలు తక్షణమే ఉపరితలానికి చేరుకుంటాయి. సాధారణ భూకంపం కంటే వీటి తీవ్రత అధికంగా ఉంటుంది.
ఈ జంట భూకంపాలు సంభవించిన వెంటనే హవాయ్‌లోని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అప్రమత్తం అయింది. సునామీ అలర్ట్ ను జారీ చేసింది. కొద్దిసేపటి తర్వాత దాన్ని ఉపసంహరించుకుంది. భూకంప తీవ్రత వల్ల వనువాటు తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. తీరంలో అలలు సాధారణ స్థాయి కంటే మీటర్ ఎత్తుకు ఎగిసిపడ్డాయి. పోర్ట్విలా, సోలా, ఒర్లీల్లో ఆస్తినష్టం సంభవించింది. సన్ షెడ్లు కూలిపోయాయి.
వనౌటుకు పొరుగునే ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల తీర ప్రాంతాలు కూడ అలజడికి గురయ్యాయి. వనౌటు.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంది. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్లు తరచూ ఢీకొంటుంటాయి. భూకంపాలు సంభవిస్తుంటాయి. క్రియాశీలక అగ్నిపర్వతాలు అధికంగా ఉన్నాయి ఇక్కడ. సునామీ ముప్పూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది.














Click it and Unblock the Notifications
