ఆమె రెండేళ్ల క్రితం అదృశ్యం: సముద్రంలో తేలుతూ మత్స్యకారులకు చిక్కింది(వీడియో)
వాషింగ్టన్: కొలంబియాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం భర్త వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోయిన ఓ 46ఏళ్ల మహిళ సముద్రంలో ప్రాణాలతో తేలియాడుతూ కనిపించింది. దీంతో పలువురు మత్స్యకారులు ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఆమెకు భర్త వేధింపులు..
వివరాల్లోకి వెళితే.. ఏంజెలికా గ్రెతన్ అనే ఆ మహిళ తన మాజీ భర్త వేధింపులు తట్టుకోలేక 2018లో ఇంట్లో నుంచి పారిపోయింది. 20 ఏళ్లపాటు భర్త వేధింపులను భరించినట్లు బాధితురాలు తెలిపింది. మొదటి కాన్పు నుంచే భర్త వేధింపులు మొదలయ్యాయని, మానసికంగా, శారీరకంగా వేధించేవాడని వెల్లడించింది.

భర్త హత్యాయత్నం.. ఇంట్లో నుంచి పారిపోయి..
ఇక పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని.. అరెస్టు చేసిన 24 గంటల్లోనే అతడిని వదిలేశారని గ్రెతన్ వాపోయింది. దీంతో తిరిగొచ్చిన తర్వాత కూడా అతడు తనను వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక, 2018 లో తనపై దాడి చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించాడని.. దీంతో తాను ఇంట్లో నుంచి పోరిపోయానని గ్రెతన్ తెలిపింది.

ఏం చేయాలో తెలీక సముద్రంలో దూకేసింది..
దాదాపు ఆరు నెలలపాటు ఓ సహాయక కేంద్రంలో ఆశ్రయం పొందినట్లు, ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోమన్నారని ఏంజెలికా గ్రెతన్ చెప్పింది. దీంతో ఏం చేయాలో తెలియక సముద్రంలో దూకినట్లు తెలిపింది. ఆ తర్వాత స్పృహ కోల్పోవడంతో తనకు ఏమైందో తెలియలేదని చెప్పింది. అయితే, ఆమె ఎన్ని రోజుల క్రితం సముద్రంలో దూకేసిందో ఖచ్చితంగా తెలియలేదు.
Recommended Video
తాను చనిపోవడం దేవుడికి నచ్చలేదంటూ..
తనను కాపాడిన వ్యక్తులు తాను అపస్మారక స్థితిలో కొట్టుకొస్తుంటే రక్షించామని తెలిపారని ఆమె తెలిపింది. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 26న మత్స్యకారులు కాపాడిన కాసేపటికి ఆమె అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చింది. స్పృహలోకి రాగానే తాను మళ్లీ జన్మించాను.. తాను చనిపోయేందుకు దేవుడు ఒప్పుకోలేదంటూ చెప్పడం గమనార్హం. కాగా, సదరు మహిళ కుమార్తె క్యాస్టిబ్లాంకో ఆచూకీ తెలుసుకుని తల్లి గురించి తెలియజేసిన పోలీసులు.. ఆమెను తల్లి వద్దకు చేర్చే ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications