Viral Video: పాకిస్తాన్ గడ్డపై రథయాత్ర.. వేలాదిగా హాజరైన భక్తులు(వీడియో)
హిందువుల జగన్నాథ రథయాత్రలో వేలాది మంది భక్తులు సందడి చేశారు. ఇందులో వింతేముంది? రథయాత్ర అంటే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవ్వడం మామూలేకదా! అనుకోవచ్చు. ఇక్కడే అసలు విషం ఉంది. ముస్లిం మెజారిటీ దేశంగా ఉన్న పాకిస్తాన్‌లో ఈ జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలో భక్తులు తండోపతండాలుగా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
ఈ వీడియోలో వేలాదిగా హిందువులు రథయాత్రలో దేవుని స్మరిస్తూ.. వీధుల్లో నృత్యాలు చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది. ముస్లిం ఆధిపత్యం ఉన్న దేశంలో, హిందూ సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పేలా కార్యక్రమం నిర్వహించడం అంటే మాటలు కాదు. ఏటా ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా జరుగుతుందన్న విషయం మనకు తెలిసిందే. ఆ సంప్రదాయాన్నే పాకిస్తాన్ లాంటి ముస్లిం దేశంలోనూ జరపడంపై పెద్ద చర్చే సాగుతోంది.

హిందువుల సంఖ్య పరిమితంగా..
పాకిస్తాన్‌లో నిర్వహించిన ఈ రథయాత్రలో మతపరమైన జెండాలతో పాటు పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించడం మరింత ఆసక్తిని కలిగిస్తుంది. సాధారణంగానే పాకిస్తాన్‌లో ముస్లిం జనాభా ఎక్కువని మనకు తెలుసు. కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో హిందువుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. 2023 పాకిస్తాన్ జనాభా లెక్కల ప్రకారం ఆ దేశంలో హిందువుల జనాభా శాతం 2.17గా ఉంది. ఎక్కువగా హిందువులు సింధ్ ప్రావిన్సులో నివాసముంటున్నారు.
Jagannath Rath Yatra, Pakistan 🙌 pic.twitter.com/DWiKx8zcGa
— Hindutva Knight (@HPhobiaWatch) July 7, 2024
తాజాగా వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూసిన యూజర్లు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఇతర మతాలను గౌరవించడం ద్వారా పాకిస్తాన్ ఎందుకో కొత్తగా కనిపిస్తోంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ముస్లిం మెజారిటీ దేశంలో హిందువుల భక్తి కార్యక్రమం స్వేచ్ఛగా నిర్వహించడం మంచి పరిణామంగానే చూడొచ్చు.












Click it and Unblock the Notifications