ఊహించని ప్రకటన చేసిన వ్లాదిమిర్ పుతిన్..!!
Vladimir Putin: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొద్దిరోజుల కిందటే ఉక్రెయిన్‌లో పర్యటించారు. రాజధాని కీవ్‌లో ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక- రక్షణ ఒప్పందాలపై చర్చించారు. సుదీర్ఘకాలంగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో శాంతి చర్చలను ప్రతిపాదించారు. చర్చల వల్ల అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చనీ సూచించారు.
ఈ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేలా, కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరేలా చర్చలు సాగించారాయన. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో, భద్రతమండలి భేటీలో నిర్వహించిన ఓటింగ్‌లో భారత్ అనుసరించిన విధానాల గురించీ గుర్తుచేశారు ప్రధాని మోదీ.

అదే సమయంలో మోదీ.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కూ ఫోన్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు మూడు నెలల వ్యవధిలో మోదీ ఆయనను రెండు సార్లు స్వయంగా కలుసుకున్నారు. భారత పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు కూడా.
రెండు శతృదేశాలతో మితృత్వాన్ని కొనసాగించడం మోదీ రాజనీతిజ్ఞతకు అద్దం పట్టినట్టయింది. ఈ రెండు దేశాలతోనూ సమానంగా చర్చలు సాగించడం, ఆయా దేశాల అధ్యక్షులతో ముఖాముఖి భేటీ కావడం, దేశ ప్రయోజనాల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి చర్చించడం అంటే సాధారణ విషయం కాదు.
ఈ పరిస్థితుల మధ్య ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత పర్యటనకు రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన త్వరలోనే భారత్‌లో పర్యటిస్తారని ఆయన అధికారిక నివాసం క్రెమ్లిన్ ప్రకటించింది. పుతిన్ షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో ఉన్నామని తెలిపింది. తేదీలపై కసరత్తు సాగిస్తోన్నట్లు వివరించింది.
ఈ మేరకు క్రెమ్లిన్ ప్రెస్ సెక్రెటరి దిమిత్రి పెస్కోవ్ ఓ ప్రకటన చేశారు. త్వరలోనే పుతిన్ భారత పర్యటన షెడ్యూల్ ఖరారు అవుతుందని, తేదీలను అధికారికంగా వెల్లడిస్తామని అన్నారు. దీనిపై రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు సంప్రదింపులు జరుపుతున్నాయని దిమిత్రి పెస్కోవ్ చెప్పారు.












Click it and Unblock the Notifications