పాక్ పాఠశాల ఘటన అమెరికాలో పునరావృతమయ్యేదా?
న్యూయార్క్: పాకిస్థాన్‌లో చోటుచేసుకున్న దారుణం అమెరికాలో పునరావృతం అయ్యేదా? అంటే అవుననే అంటున్నాయి అమెరికా భద్రతా బలగాలు. గత వారం కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు, ఉగ్రవాది ఫరూఖ్ సెల్‌ఫోన్‌లో స్థానిక పాఠశాలను వివిధ యాంగిల్స్‌లో తీసుకున్న ఫోటోలు కనిపించాయి.
దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఐదేళ్లుగా ప్రజారోగ్యశాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఫరూఖ్ విధుల్లో భాగంగా పలు స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే విధుల్లో భాగంగా అతను ఫోటోలు తీయాల్సిన అవసరం లేదని వారు పేర్కొన్నారు. దీని ప్రకారం ఉగ్రవాదులు ఆ స్కూల్‌పై కన్నేశారన్న అనుమానం కలుగుతోందని అన్నారు.

ఈ విషయం తెలుసుకున్న సదరు స్కూలు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఈ స్కూలులో 2,500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అన్ని పాఠశాలల్లో బాంబు స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు.
ఇటీవల కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నార్డినో ప్రాంతంలో పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ జంట విచక్షణారహితంగా కాల్పులు జరపగా 14మంది మృతిచెందారు. అనంతరం ఆ జంట పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే.
కాగా, గతంలో పాకిస్థాన్‌లోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు చొరబడి విద్యార్థులపై తుపాకులతో విరుచుకుపడి దాదాపు 150మందికిపైగా విద్యార్థులు, సిబ్బంది మరణానికి కారణమైన విషయం విధితమే.












Click it and Unblock the Notifications