వర్క్ ఫ్రమ్ హోమ్ కాదిక..తెరపై టీచ్ ఫ్రమ్ హోమ్ టూల్: సుందర్ పిచాయ్ సంచలనం
న్యూయార్క్: భయానక కరోనా వైరస్ భూగోళాన్ని చుట్టు ముట్టింది. దీని బారిన పడని దేశమంటూ ఏదీ లేదనే పరిస్థితికి నెలకొంది. ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకడం వల్ల ఇది విస్తృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో.. దీన్ని నియంత్రించడానికి భారత్ సహా అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నాయి. విద్యాసంస్థలను మూసివేశాయి. ప్రాథమిక పాఠశాలలు మొదలుకుని యూనివర్శిటీల దాకా అన్నీ మూతపడ్డాయి.

విద్యాసంవత్సరం కొనసాగింపుపై అనిశ్చిత స్థితిలో...
విద్యాసంవత్సరం ముగింపుదశకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ వల్ల కళాశాలలను మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృధా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వార్షిక పరీక్షలు రద్దయ్యాయి. మరి కొన్నింటిని వాయిదా వేశారు. కరోనా వైరస్ తీవ్రత ఇలాగే కొనసాగితే విద్యాసంస్థలు, పాఠశాలల ఎప్పుడు తెరుస్తారనే ప్రశ్నల ప్రస్తుతం తలెత్తుతోంది. విద్యాసంవత్సరం కొనసాగింపుపై అనిశ్చిత పరిస్థితి నెలకొంది.

టెక్ ఫ్రమ్ హోమ్ పేరుతో సరికొత్త టూల్..
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. టీచ్ ఫ్రమ్ హోమ్ అనే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించిన తరహాలోనే.. విద్యార్థుల కోసం టీచ్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చింది. కరోనా వైరస్ భయం వల్ల ఇళ్లకే పరిమితమైన కోట్లాదిమంది విద్యార్థుల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు గూగుల్ ముఖ్యకార్యనిర్వహణాధికారి సుందర్ పిచాయ్ తెలిపారు.

ఇంటిపట్టునే ఉంటూ..
తాము కొత్తగా తీసుకొస్తోన్న టీచ్ ఫ్రమ్ హోమ్ అనే టూల్ వల్ల కోట్లాదిమంది విద్యార్థులు ఇళ్లల్లో ఉంటూ కూడా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి వీలు ఉంటుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఈ టూల్ వల్ల ఇంటిపట్టునే ఉంటూ విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించవచ్చని ఆయన తెలిపారు. ఈ టూల్ ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో విద్యార్థులు నిరాటంకంగా చదువుకోవచ్చని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ క్లాసులు.. పుస్తకాలు..
టీచ్ ఫ్రమ్ హోమ్ టూల్ ద్వారా తాము చదువుకుంటోన్న విద్యాసంస్థలతో విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు అనుసంధానం కావచ్చని అదే తరహాలో ఇ-బుక్స్‌ను పొందవచ్చని సుంచర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఇదే విధానంతో కొత్తగా యాప్‌ను కూడా రూపొందిస్తామని, యునెస్కో సహకారాన్ని తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఈ తరహా కొత్త వ్యవస్థను అభివృద్ధి చేయడానిక 10 మిలియన్ డాలర్లను వ్యయం చేస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.