Panjshir: సింహాలగడ్డను తాలిబన్లు ఎలా గెలిచారు ? పక్కా వ్యూహాలు-పాకిస్తాన్ మద్దతు సహా 5 కారణాలు
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లకు పంజ్ షీర్ లోయ మాత్రం పెను సవాల్ విసిరింది. ఎందుకంటే గతంలో ఆప్ఘనిస్తాన్ లో అధికారం అనుభవించిన నాటి పరిస్ధితులే మరోసారి వారికి ఎదురయ్యాయి. ఈ భీకర పోరులో వందలాది మంది తాలిబన్ ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. సింహాలగడ్డను సులువుగా చేజిక్కించుకోవడం కుదరని వారికీ అర్ధమైపోయింది. దీంతో ఆప్ఘన్ ను గెలిచినా పంజ్ షీర్ ను గెలిచే పరిస్ధితి లేదని తాలిబన్లకూ అర్ధమైంది. ఈ నేపథ్యంలో తాలిబన్లు ఉన్నట్లుండి పంజ్ షీర్ ను చేజిక్కించుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఆప్ఘన్ వ్యవహారాల గురించి కాస్తో కూస్తో తెలిసిన ప్రతీ ఒక్కరూ నివ్వెరపోతున్నారు.
Recommended Video

సింహాల గడ్డ పంజ్ షీర్
ఆఫ్ఘనిస్తాన్ లోని పంజ్ షీర్ కు సింహాల గడ్డగా పేరుంది. అక్కడ పుట్టే ప్రతీ ఒక్కరూ శతధృవంశం తరహాలో వంద మందిని చంపితే కానీ చావరన్న నానుడీ ఉంది. 1990ల నుంచీ పంజ్ షీర్ పై పట్టుకోసం వివిధ దేశాలు, ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. పక్కనే ఉన్న తజికిస్ధాన్ తో పాటు ఇతర దేశాల మద్దతుతో గతంలో ఆప్ఘనిస్తాన్ ను పావించిన ప్రజా ప్రభుత్వానికి పంజ్ షీర్ పెద్ద అండ. అలాంటిది ఇప్పుడు పంజ్ షీర్ తాలిబన్ల వశమైపోయింది. సింహాల గడ్డగా పేరున్న పంజ్ షీర్ దళాలు తాలిబన్లకు తల వంచేశాయి. దీంతో ఇప్పుడు పంజ్ షీర్ లో ఏం జరిగిందనే చర్చ అంతర్జాతీయంగా పలు దేశాల్లో సాగుతోంది.

పంజ్ షీర్ లో తాలిబన్ల విజయం వెనుక ?
పంజ్ షీర్ లో తాలిబన్లు తొలిసారి విజయం సాధించడం వెనుక, అదీ స్వల్ప సమయంలోనే ఈ లోయపై పట్టు సంపాదించడం వెనుక పలు ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో తాలిబన్లు ఈసారి మార్చి ప్రయోగించిన వ్యూహాలు ఓ ఎత్తయితే పాకిస్తాన్ నుంచి తీసుకున్న మద్దతు మరో కారణంగా కనిపిస్తోంది. తద్వారా తమకు ఇన్నాళ్లూ లొంగని పంజ్ షీర్ పై తాలిబన్లు వ్యూహాత్మక విజయం అందుకున్నారు. దీంతో ఆప్ఘనిస్తాన్ వారి వశమైనట్లయింది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు సైతం తొలగిపోయాయి.

పంజ్ షీర్ ను చుట్టుముట్టిన వ్యూహం
పంజ్ షీర్ లో నార్తన్ అలయన్స్ దళాల్ని దెబ్బతీయాలంటే సాధారణ వ్యూహం అస్సలు పనిచేయదు. ముఖ్యంగా తజికిస్దాన్ వంటి దేశాల నుంచి విదేశీ సాయం కూడా అందుతున్న వేళ పంజ్ షీర్ దళాల్ని అడ్డుకోవాలంటే వారికి ఆ సాయం అందకుండా చేయాలి. ముఖ్యంగా ఆహారం, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మానవ వనరులు అందకుండా చేయాలి. ఇలా చేయాలంటే ఎటువైపు నుంచి ప్రవేశించాలని తాలిబన్లు తెగ మధన పడ్డారు. చివరికి పంజ్ షీర్ ఉత్తర భాగం నుంచే ఇవన్నీ వారికి అందుతున్నాయని గుర్తించారు. చివరికి ఉత్తరం నుంచే పంజ్ షీర్ లో ప్రవేశించి వారిని దారుణంగా దెబ్బతీశారు.

బాంబుల వర్షంతో పాకిస్తాన్ సాయం
పంజ్ షీర్ లో నార్తన్ అలయన్స్ బలగాలను దెబ్బతీయాలంటే తాలిబన్ల వ్యూహాలు ఒక్కటే సరిపోవు. అత్యాధునిక ఆయుధాలు, బాంబులు అన్నీ కావాలి. వీటితో ముప్పేట దాడి చేయాల్సిందే. దీంతో తాలిబన్లు పాకిస్తాన్ సాయం కోరారు. వెంటనే రంగంలోకి దిగిన పాకిస్తాన్ యుద్ధ విమానాలు పంజ్ షీర్ పై బాంబుల వర్షం కురిపించాయి. ఓవైపు పై నుంచి బాంబుల వర్షం కురుస్తుంటే చెల్లాచెదురైన పంజ్ షీర్ బలగాలపై తాలిబన్లు భూభాగంపై నుంచి కాల్పులకు దిగాయి. దీంతో ఇరువైపుల నుంచి తాలిబన్లు, పాకిస్తాన్ బాంబుల్ని తట్టుకోవడం పంజ్ షీర్ బలగాలకు కష్టంగా మారిపోయింది. చివరికి వారు చేతులెత్తేయక తప్పని పరిస్ధితి వచ్చింది.

పంజ్ షీర్ సింహాలు పిల్లులైన వేళ
ఆప్ఘనిస్తాన్ ను తాలిబన్లు తమ వశం చేసుకున్నాక పంజ్ షీర్ లోయను మాత్రం దక్కించుకోలేకపోయామన్న ఆవేదనలో ఉన్నారు. అలాంటి సమయంలో పంజ్ షీర్ దళాలకు అండగా ఉంటున్న వారిపై దృష్టిపెట్టారు. ఇలా వారి కమాండర్ ఫహీమ్ దస్తీ ని తాలిబన్లు చంపేశారు. ఆ తర్వాత ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సాలేహ్ వంతు వచ్చింది. చివరికి ఆయన కూడా పంజ్ షీర్ కు హ్యాండిచ్చి తజికిస్ధాన్ కు పారిపోయారు. దీంతో ఓవైపు తాలిబన్లు, పాకిస్తాన్ బాంబుదాడులు, మరోవైపు నమ్మకుున్న వ్యక్తులు చనిపోవడం, హ్యాండివ్వడం కారణంగా పంజ్ షీర్ సింహాలు కాస్తా పిల్లుల్లా మారిపోయాయి. దీంతో తాలిబన్లకు పంజ్ షీర్ లోయ వశమైంది. ఒకప్పుడు 1990లలో రష్యాను సైతం ఎదిరించిన చరిత్ర కలిగిన పంజ్ షీర్ దళాలు ఇప్పుడు ముప్పేట దాడితో చేతులెత్తేయడంతో తొలిసారిగా తాలిబన్ల పతాకం అక్కడ ఎగురుతోంది.












Click it and Unblock the Notifications