వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి? ఎలా పుట్టింది, ఎలా పెరుగుతోంది, బంగారంలో పెట్టుబడులు పెట్టాలా? బిట్‌కాయిన్‌లో మదుపు చేయాలా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ

క్రిప్టోకరెన్సీ అనేది ఇప్పుడు భారత యువతలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయింది. బంగారంలో పెట్టుబడులు పెట్టాలా? బిట్‌కాయిన్‌లో మదుపు చేయాలా? అనే దానిపై విశ్లేషణలు పెరిగిపోతున్నాయి.

బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్న భారతీయుల సంఖ్య దాదాపు రెండు కోట్లు ఉంటుందని అంచనా.

మరోవైపు.. క్రిప్టోకరెన్సీ యువత చేతుల్లోకి వెళితే వారిని చెడగొడతాయని.. వీటి నియంత్రణపై ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి మోదీ స్వయంగా చెప్తున్నారు.

దీనిపై నియంత్రణ కోసం వచ్చే పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టనున్నారనీ వార్తలు వస్తున్నాయి.

అసలింతకీ.. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు ఏమిటి? మనం వాడే కరెన్సీకి - క్రిప్టో కరెన్సీకి తేడా ఏమిటి? అర పైసా విలువతో మొదలైన బిట్‌కాయిన్ పన్నెండేళ్లలోనే 60 వేల డాలర్ల విలువకు ఎలా పెరిగిపోయింది? ఆ వివరాలవీ...

క్రిప్టో కరెన్సీ మీద చైనాలోనూ ఆంక్షలున్నాయి.

క్రిప్టోకరెన్సీ అంటే...

క్రిప్టోకరెన్సీ అనే పదం.. రెండు ఆంగ్ల పదాల కలయిక.

క్రిప్టో అంటే.. క్రిప్టోగ్రఫీ అనే కంప్యూటర్ సాంకేతిక శాస్త్రానికి సంక్షిప్త రూపం. క్రిప్టోగ్రఫీ అనేది ఏదైనా ఒక సమాచారాన్ని.. రహస్య సంకేతాల రూపంలోకి మార్చటం (ఎన్‌కోడింగ్ - ఎన్‌క్రిప్షన్), అటువంటి సంకేతాల రూపంలోకి మారిన దానిని మళ్లీ అర్థమయ్యేలా మార్చటం (డీకోడింగ్ - డిక్రిప్షన్) చేసే కంప్యూటర్ సైన్స్.

ఇంటర్నెట్‌ ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటానికి, దాచిపెట్టుకోవటానికి ఈ క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తారు. అంటే ఎన్‌క్రిప్ట్ అయిన సమాచారం.. దానికి సంబంధించిన పాస్‌వర్డ్ తదితర అనుమతులు లేనిదే డిక్రిప్ట్ కాదు. ఆ అనుమతులు ఉన్న వారికి మాత్రమే ఆ సమాచారం డీకోడ్ అయి కనిపిస్తుంది.

ఇక కరెన్సీ అంటే డబ్బు అనేది అందరికీ తెలిసిందే. వస్తువులు, సేవల మారకానికి ఉపయోగించే మాధ్యమమే డబ్బు. ఆదిలో వస్తువులను నేరుగా మార్చుకునేవారు. దీనినే బార్టరింగ్ అంటాం. వస్తు మార్పిడిలో ఉన్న ఇబ్బందులను అధిగమించటానికి మారకం మాధ్యమంగా బంగారం ఉపయోగించేవారు.

ఈ మారకం ప్రభుత్వాల నియంత్రణలోకి వచ్చింది. అలా బంగారు నాణేల రూపం తీసుకుంది. ఆ తర్వాత వెండి, రాగి, ఇనుప నాణేలు వచ్చాయి. ఆధునిక కాలంలో కరెన్సీగా కాగితపు నోట్లను ముద్రిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ విప్లవంతో ఇదే కరెన్సీతో డిజిటల్‌ లావాదేవీలు సాగిస్తున్నారు.

అయితే ఈ లావాదేవీలన్నీ ఒక ప్రభుత్వ నియంత్రణలో, బ్యాంకుల మధ్యవర్తిత్వంతో నడుస్తాయి. ఈ లావాదేవీలకు కూడా క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తారు.

బిట్ కాయిన్ పాపులారిటీకి నిదర్శనం

ఆన్‌లైన్ బ్యాంకింగ్, లావాదేవీల వల్ల ఎన్నో వెసులుబాట్లే కాదు.. అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యల్లో ప్రధానమైనవి భద్రత, గోప్యత. సాంకేతిక సమస్యలతో పాటు.. హ్యాకింగ్ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

ఇక లావాదేవీలన్నీ బ్యాంకులు, ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంటాయి. ఇక ఆర్థిక సంక్షోభాల సమయంలో బ్యాంకులు దివాళా తీసినపుడు సంప్రదాయ కరెన్సీల విలువ పతనమైపోతుంది.

ప్రభుత్వ నియంత్రణ కానీ, బ్యాంకుల మధ్యవర్తిత్వం కానీ ఏవీ లేని, ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థల మధ్య నేరుగా, సురక్షితంగా బదిలీ చేసుకోగల డిజిటల్ కరెన్సీని తయారు చేయాలని కొందరు ఔత్సాహికులు నడుంకట్టారు.

అలా పుట్టుకొచ్చిందే క్రిప్టోకరెన్సీ. ఈ కరెన్సీని ఏ ప్రభుత్వమూ జారీ చేయదు. ఇది ఏ బ్యాంకు నియంత్రణలోనూ ఉండదు. ఇది చాలా పకడ్బందీగా రూపొందించిన ఓపెన్‌సోర్స్ కంప్యూటర్ ఆల్గారిథమ్ ఆధారిత నెట్‌వర్క్ ద్వారా నడుస్తుంది.

మరో రకంగా చెప్పాలంటే.. క్రిప్టోకరెన్సీని దాని వినియోగదారులే నియంత్రించుకుంటారు.

ఇండియా రూపాయి, అమెరికా డాలరు, బ్రిటన్ పౌండ్ వంటి ప్రభుత్వాలు విడుదల చేసే నగదు బ్యాంకుల్లో నిల్వ ఉంటుంది.

వాటిని విత్‌డ్రా చేసుకోవటానికి బ్యాంకులకు వెళ్లటం, ఏటీఎంలకు వెళ్లటం, డిజిటల్‌గా బదిలీ చేసుకోవటం చేయాలి. ఈ సంప్రదాయ కరెన్సీ లావాదేవీల్లో బ్యాంకులు, ఎక్స్చేంజ్‌లు వంటి ఫీజుల రూపంలో కొంత డబ్బు తీసుకుంటారు.

క్రిప్టోకరెన్సీ అలా కాదు. దీనిపై నియంత్రణ ప్రభుత్వం, బ్యాంకుల వంటి కేంద్రీకృత సంస్థలకు ఉండదు. ఇది ఎవరో ఒక్కరి నియంత్రణలో ఉండని డీసెంట్రలైజడ్డ్ వ్యవస్థ. ఎవరికీ కమిషన్లు, భారీ ఫీజులు, లావాదేవీల మీద పరిమితులు ఉండవు. ఒక యాప్ ద్వారానే లావాదేవీలను జరుపుకోవచ్చు.

బ్లాక్‌చెయిన్ అనే టెక్నాలజీ ఆధారంగా నడుస్తుంది. ఈ బ్లాక్‌చెయిన్‌.. ప్రతి లావాదేవీని నమోదు చేసే పద్దు వంటిది. అలా నమోదైన లావాదేవీల్లో మార్పులు చేర్పులు చేయటానికి వీలుండదు. క్రిప్టోకరెన్సీ లావాదేవీలను సంబంధిత వ్యవస్థలో ఉండే ప్రతి కంప్యూటర్ నిర్ధరిస్తుంది.

ఏదైనా కరెన్సీకి విలువ ఉండాలంటే.. దానిని వినియోగించేవారు ఉండాలి. దానిని చెల్లింపుల కింద స్వీకరించేవారు ఉండాలి. ఆ కరెన్సీకి విలువ ఉందని, భవిష్యత్తులోనూ దాని విలువ కొనసాగుతుందని సమాజం విశ్వసించాలి.

మన సంప్రదాయ కరెన్సీకి.. విలువ ఉందని వాటిని ముద్రించే ప్రభుత్వాలు ప్రకటిస్తేనే వాటికి విలువ ఉంటుంది. విలువ లేదని ప్రకటిస్తే అవి చిత్తుకాగితాలే అవుతాయి.

భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగినపుడు ఈ విషయం అందరికీ అర్థమైంది. ఈ సంప్రదాయ కరెన్సీని ఆర్థికవేత్తలు ఫియట్ కరెన్సీ అని కూడా అంటారు.

2008 తర్వాత క్రిప్టో కరెన్సీ భావన ముందుకొచ్చింది.

తొట్టతొలి క్రిప్టోకరెన్సీ ఎలా పుట్టింది?

2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభంతో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో ఫియట్ కరెన్సీకి భద్రత లేకుండా పోయింది. ఆ సమయంలో.. బ్యాంకింగ్ వ్యవస్థతో నిమిత్తం లేని, ప్రభుత్వాల నియంత్రణ లేని ప్రత్యామ్నాయ డిజిటల్ కరెన్సీ ఆలోచన మరోసారి ముందుకువచ్చింది.

సటొషి నకమొటొ అనే పేరుతో గుర్తు తెలియని ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల బృందం.. 2008 అక్టోబర్ 31న ఓ 9 పేజీల వైట్ పేపర్ విడుదల చేశారు. సెంట్రలైజ్డ్ నియంత్రణ లేని, మధ్యవర్తులు లేని సంపూర్ణంగా 'పీర్ టు పీర్' ఎలక్ట్రానిక్ మనీ అలోచనను అందులో వివరించారు.

ఆ మరుసటి ఏడాదే.. అంటే 2009 జనవరి 3వ తేదీన.. సటోషి బ్లాక్‌చెయిన్ వ్యవస్థను ఆధారంగా పనిచేసే తొలి క్రిప్టోకరెన్సీ 'బిట్‌కాయిన్‌'ను తయారుచేశారు. ఈ నెట్‌వర్క్ క్రమంగా ప్రధాన స్రవంతిలోకి వస్తుండగా.. సటోషి 2011లో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆ పేరుతో ఎలాంటి ప్రకటనలూ రాలేదు.

అదృశ్యమయ్యేముందు.. బిట్‌కాయిన్ నెట్‌వర్క్ కీని, నియంత్రణను గావిన్ ఆండర్సన్‌కు అప్పగించారు. ఆండర్సన్ ఆ తర్వాత బిట్‌కాయిన్‌ మీద నియంత్రణను వికేంద్రీకరించారు.

కానీ.. సటోషి అనే వ్యక్తి లేదా ఆ బృందం 10 లక్షల బిట్‌కాయిన్లు మైనింగ్ చేసిందని, అవి వారి దగ్గరే ఉన్నాయని భావిస్తున్నారు. వాటి విలువ ఇప్పుడు బిలియన్ల డాలర్లు. సటోషి నకమొటొ అనే వ్యక్తి ఎవరో తెలుసుకోవటానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. ఇంతవరకూ ఏవీ ఫలించలేదు.

ఇక 2011 వరకూ బిట్‌కాయిన్ ఒక్కటే ఏకైక క్రిప్టోకరెన్సీగా ఉండేది. ఆ తర్వాత కొందరు ఔత్సాహికులు లైట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ క్రిప్టోకరెన్సీని తయారుచేయటం మొదలైంది.

ప్రస్తుతం ప్రపంచంలో పది వేల వరకూ క్రిప్టోకరెన్సీలు ఉన్నట్లు ఇన్వెస్టోపీడియా తాజా కథనంలో ఉటంకించింది. ఈ క్రిప్టోకరెన్సీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

క్రిప్టో కరెన్సీ మైనింగ్‌కు పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం అవుతుంది

క్రిప్టోకరెన్సీని ఎలా సృష్టిస్తారు? బిట్‌కాయిన్ మైనింగ్ ఎలా చేస్తారు?

బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలను.. మైనింగ్ అనే కంప్యూటర్ ప్రక్రియ ద్వారా సృష్టిస్తారు. మైనింగ్ అంటే అర్థం గనుల తవ్వకం. కానీ క్రిప్టోకరెన్సీలో మైనింగ్ అంటే తవ్వకం కాదు.

ఉదాహరణకు.. బిట్‌కాయిన్‌లో కొత్త కాయిన్లను పుట్టించాలంటే.. అందుకోసం బిట్‌కాయిన్ ఆల్గారిథమ్ సృష్టించే సంక్లిష్టమైన కంప్యూటర్ సమస్యలను పరిష్కరించాలి. అంటే.. అనేక లావాదేవీలను సరిచూసి ఒక బ్లాకుగా అమర్చాల్సి ఉంటుంది.

ఇలా ఒక బ్లాకును విజయవంతంగా పూర్తిచేసినపుడు ఆ పని పూర్తిచేసిన 'మైనర్‌'కు బహుమతిగా కొత్త బిట్‌కాయిన్లు లభిస్తాయి. వీటిని బ్లాక్ రివార్డులని వ్యవహరిస్తుంటారు. ఈ విధంగా కొత్త బిట్‌కాయిన్లను సృష్టిస్తారు.

అలాగే.. బిట్‌కాయిన్‌ లావాదేవీలను నిర్ధరించి, బ్లాక్‌చెయిన్‌లో నమోదు చేసే ప్రక్రియ కూడా ఈ మైనింగ్‌లో భాగమే. ఈ పని చేసినందుకు కొంత మొత్తంలో బిట్‌కాయిన్లు ఫీజు కింద లభిస్తాయి. దీనిని బిట్‌కాయిన్ యూజర్లు చెల్లిస్తారు.

2009లో సటోషి నకమొటొ తొలి బ్లాక్‌చెయిన్ బ్లాకును పూర్తిచేసి మొదటి 50 బిట్‌కాయిన్లను సృష్టించారు. ఆ తొలి బ్లాకును 'జెనెసిస్ బ్లాక్'గా పిలుస్తుంటారు.

అయితే.. బిట్‌కాయిన్‌ మైనింగ్‌లో ఇలా లభించే బ్లాకు రివార్డు.. దాదాపు ప్రతి నాలుగేళ్లకోసారి సగానికి తగ్గిపోతుంది. 2009లో బిట్‌కాయిన్ ప్రారంభమైనపుడు.. ఈ మైనింగ్‌లో పూర్తి చేసిన ప్రతి బ్లాకుకూ 50 బిట్‌కాయిన్లు రివార్డుగా లభించేది.

2013లో ఆ రివార్డు సగానికి అంటే 25 బిట్‌కాయిన్లకు తగ్గింది. అప్పటికి.. దాదాపు 1 కోటీ ఐదు లక్షల బిట్‌కాయిన్లను మైనింగ్ చేశారు. ఆ తర్వాత మరో 52 లక్షల 50 వేల బిట్‌కాయిన్లు మైనింగ్ చేశాక 2016లో బ్లాక్ రివార్డు 12.5 బిట్‌కాయిన్లకు తగ్గింది.

అనంతరం 26 లక్షల 25 వేల బిట్‌కాయిన్లు మైనింగ్ చేశాక.. 2020లో ఈ రివార్డు 6.25 బిట్‌కాయిన్లకు తగ్గింది. 2024కు ఈ రివార్డు సగానికి తగ్గుతుంది.

బిట్‌కాయిన్ ప్రొటోకాల్ ప్రకారం.. మొత్తంగా 2 కోట్ల 10 లక్షల బిట్‌కాయిన్లను మాత్రమే సృష్టించటానికి వీలుంది. ఈ మొత్తం కాయిన్ల సృష్టి పూర్తయ్యేసరికి రివార్డు 64 సార్లు సగానికి తగ్గేలా ప్రొటోకాల్‌ను రూపొందించారు.

ఇప్పటికే 1 కోటీ 70 లక్షలకు పైగా బిట్‌కాయిన్ల మైనింగ్ పూర్తయింది. సుమారు 2140 సంవత్సరానికి మొత్తం బిట్‌కాయిన్ల మైనింగ్ పూర్తవుతుంది.

బిట్‌కాయిన్ ప్రొటోకాల్ ప్రకారం.. ఆ తర్వాత మైనింగ్ ఉండదు. కొత్త బిట్‌కాయిన్ల సృష్టీ ఉండదు. రికార్డుల నిర్వహణకు, లావాదేవీల నిర్ధారణకు మాత్రం ఫీజులు లభిస్తాయి.

మొదట్లో డెస్క్‌టాప్ కంప్యూటర్లతోనే బిట్‌కాయిన్ మైనింగ్ చేసినా.. ఇప్పుడు మైనింగ్ చేయటానికి అత్యాధునికంగా, ప్రత్యేకంగా తయారుచేసిన పవర్‌ఫుల్ కంప్యూటర్లను వాడుతున్నారు. అయినప్పటికీ ఒక కంప్యూటర్‌తో మొత్తంగా ఒక బిట్‌కాయిన్ కన్నా తక్కువే మైనింగ్ చేయగలరు.

దీంతో వేల సంఖ్యలో కంప్యూటర్లను పెట్టుకుని ఈ మైనింగ్‌ను ఓ భారీ పరిశ్రమగా నడుపుతున్నారు కొందరు ఆర్గనైజర్లు. వాటికి చాలా మొత్తంలో విద్యుత్ కూడా అవసరం. దీంతో బిట్‌కాయిన్ మైనింగ్‌కు వాడుతున్న విద్యుత్ వల్ల పర్యావరణానికి చేటు పెరుగుతోందనే విమర్శలూ వస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

అర పైసా నుంచి 60 వేల డాలర్లకు ఎలా పెరిగిపోయింది?

సటోషి నకమొటొ మొదట సృష్టించిన 50 బిట్‌కాయిన్లను ఉపయోగించటానికి, ఖర్చుచేయటానికి వీలు లేదు. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఆ తర్వాత సటోషి తాను సృష్టించిన బిట్‌కాయిన్లలో 10 బిట్‌కాయిన్లను జనవరి 12వ తేదీన ఓ కంప్యూటర్ సైంటిస్ట్ అయిన హాల్ ఫిన్నేకి నేరుగా పంపించారు. బిట్‌కాయిన్ గురించి మొదటిసారి ట్వీట్ చేసింది ఫిన్నేనే.

బిట్‌కాయిన్ మొదట ట్రేడింగ్ మొదలైనపుడు ఒక కాయిన్ విలువ భారత కరెన్సీలో సుమారు అర పైసా మాత్రమే. 2010 నాటికి చాలా మందిలో బిట్‌కాయిన్ మీద ఆసక్తి పెరిగింది. దీంతో బిట్‌కాయిన్ ట్రేడింగ్ మొదలైంది.

సున్నా డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ 2010 చివరికి 83 సెంట్లకు (1 డాలరుకు 100 సెంట్లు) పెరిగింది.

బిట్‌కాయిన్లను మొట్టమొదటిసారి ఒక కరెన్సీగా వాణిజ్య లావాదేవీల కోసం ఉపయోగించింది 2010 మే 22వ తేదీన. ఫ్లోరిడాకు చెందిన లాస్జ్‌లో హాన్యే అనే ప్రోగ్రామర్.. 10,000 బిట్‌కాయిన్లు చెల్లించి రెండు పిజ్జాలు కొన్నాడు. అప్పుడు ఆ పది వేల బిట్‌కాయిన్ల విలువ సుమారు 47 డాలర్లు మాత్రమే.

2011 ఏప్రిల్‌లో 1 డాలరుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ.. జూన్ నాటికి 32 డాలర్లకు పెరిగింది. కానీ అదే ఏడాది నవంబర్‌లో మళ్లీ 2 డాలర్లకు పడిపోయింది. 2012 ఆగస్టు నాటికి 13.20 డాలర్లకు పెరిగింది.

అయితే.. 2013లో బిట్‌కాయిన్ ధర తొలిసారి భారీగా పెరిగింది. ఏప్రిల్ మొదట్లో 220 డాలర్లకు చేరుకున్న ధర.. ఆ నెల మధ్యకే 70 డాలర్లకు పడిపోయింది. కానీ డిసెంబర్ కల్లా మళ్లీ 1,156 డాలర్లకు పెరిగిపోయింది. మూడు రోజుల్లోనే ధర పతనమై 760 డాలర్లకు దిగివచ్చింది.

ఈ ఎగుడు దిగుళ్లు కొనసాగటంతో 2015 ఆరంభంలో బిట్‌కాయిన్ 315 డాలర్ల దగ్గర ట్రేడయింది.

ఇక 2017 ఆరంభంలో సుమారు 1,000 డాలర్ల దగ్గర ట్రేడవుతున్న బిట్‌కాయిన్ డిసెంబర్ కల్లా 20,000 డాలర్లు దాటిపోయింది. దీంతో బిట్‌కాయిన్‌ పతాకశీర్షికల్లో నిలిచింది. ప్రభుత్వాలు, ఆర్థికవేత్తలు దీనిపై దృష్టిసారించారు. బిట్‌కాయిన్‌తో పోటీగా డిజిటల్ కరెన్సీల తయారీని మొదలుపెట్టారు.

2019లో బిట్‌కాయిన్ ధర 10,000 డాలర్ల నుంచి 7,000 డాలర్లకు తగ్గింది. అయితే.. 2020లో కోవిడ్ మహహ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయిన పరిస్థితుల్లో బిట్‌కాయిన్ మళ్లీ దూసుకుపోయింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద పెట్టుబడిదారుల్లో భయాందోళనలు నెలకొనటంతో బిట్‌కాయిన్ మీదకు వారి దృష్టి మళ్లింది. ఫలితంగా.. 2020 డిసెంబర్‌లో 24,000 డాలర్ల దగ్గర ట్రేడవుతున్న బిట్‌కాయిన్ ధర 2021 జనవరిలో 40,000 డాలర్లకు, మార్చి నాటికి ఏకంగా 60,000 డాలర్లకు దూసుకుపోయింది. 2021 ఏప్రిల్ 14న బిట్‌కాయిన్ ధర 64,000 డాలర్లు దాటింది.

ఆ తర్వాత వేసవిలో మళ్లీ 32,000 డాలర్లకు పడిపోయిన ధర.. మళ్లీ నవంబర్ 5వ తేదీ నాటికి 68,521 డాలర్లకు పెరిగిపోయింది.

నవంబర్ 22వ తేదీన ఒక బిట్‌కాయిన్ ధర భారత కరెన్సీలో 43,33,656 రూపాయల దగ్గర ట్రేడవుతోంది.

క్రిప్టోకరెన్సీ యూజర్ల వివరాల గోప్యత, వీటిపై నియంత్రణ అనేవి మున్ముందు చాలా వివాదాస్పద అంశాలుగా మారవచ్చు

భవిష్యత్తు క్రిప్టోకరెన్సీలదేనా?

క్రిప్టోకరెన్సీల విషయంలో పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు.. సంప్రదాయ కరెన్సీల కన్నా క్రిప్టో కరెన్సీలే మేలని బిల్ గేట్స్, అల్ గోర్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వారు మద్దతిస్తున్నారు.

అయితే వారెన్ బఫెట్, పాల్ క్రుగ్‌మన్, రిచర్డ్ షిల్లర్ వంటి ఆర్థికవేత్తలు.. క్రిప్టోకరెన్సీ అనేది ఒక గొలుసుకట్టు స్కీమ్ వంటిదని, నేరాలకు మార్గం పరుస్తుందని దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

క్రిప్టోకరెన్సీలకు, పలు టెర్రరిస్టు దాడులకు లింకులు ఉన్నట్లు వెలుగులోకి రావటం, డార్క్‌నెట్‌లో క్రిప్టోకరెన్సీలతో నేరపూరిత వ్యవహారాలు జరుగుతుండటం వల్ల.. క్రిప్టోకరెన్సీల వినియోగంపై ప్రభుత్వాలు నియంత్రణ విధించాలని భావించవచ్చు.

దీనివల్ల.. క్రిప్టోకరెన్సీ యూజర్ల వివరాల గోప్యత, వీటిపై నియంత్రణ అనేవి మున్ముందు చాలా వివాదాస్పద అంశాలుగా మారవచ్చు.

అయితే.. 2030 నాటికి ప్రపంచ కరెన్సీ చలామణిలో నాలుగో వంతు క్రిప్టోకరెన్సీలు ఉంటాయని ఆర్థిక నిపుణుల అంచనా. అంటే లావాదేవీల్లో క్రిప్టోకరెన్సీల వినియోగం అంతకంతకూ పెరుగుతుందని, అదే సమయంలో వీటి విలువలు కూడా ఎగుడుదిగుళ్లకు లోనవుతాయని చెప్తున్నారు.

ఇండియన్ యూత్‌లో క్రిప్టో క్రేజ్...

మరోవైపు.. క్రిప్టోకరెన్సీలను భారతదేశంలో నిషేధిస్తూ 2018 ఆర్‌బీఐ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు 2020 మార్చిలో కొట్టివేసింది. అదే సమయంలో క్రిప్టో కరెన్సీ విలువ అమాంతంగా పెరిగిపోతుండటంతో దీనిపై భారతీయుల ఆసక్తి కూడా పెరిగింది.

ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ యజమానులు ప్రపంచంలోకెల్లా అత్యధికంగా భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా ఉన్నారని బ్రోకర్‌చూసర్ అనే సంస్థ గత నెలలో తెలిపినట్లు మింట్ ఒక కథనంలో చెప్పింది. అయితే.. ఆ లెక్కలు తప్పని, దేశంలో ఒకటిన్నర నుంచి రెండు కోట్ల మంది క్రిప్టో యూజర్లు ఉండవచ్చునని క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ వాజిర్ఎక్స్ వ్యవస్థాపకుడు నిశ్చల్ శెట్టి ట్వీట్ చేశారు.

https://twitter.com/NischalShetty/status/1452890537770487809

దేశంలోని క్రిప్టో ట్రేడర్లలో ఎక్కువ మంది 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వారేనని పలు ఎక్సేంజ్ సంస్థలు చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే నెలకు ఒక్కొక్కరు సగటున 10,000 రూపాయలు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నారని అంచనా వేస్తున్నాయి.

ఇదిలావుంటే.. క్రిప్టోకరెన్సీ సేవలకు సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే ఇండియాలో 100 స్టార్టప్ కంపెనీలు ఏర్పడ్డాయి. మొత్తంగా దాదాపు 400 స్టార్టప్ కంపెనీలు క్రిప్టోకరెన్సీ సంబంధిత సేవలు అందించటానికి సిద్ధమయ్యాయని 'హిందూ బిజినెస్‌లైన్' ఒక కథనంలో తెలిపింది.

భారత్‌లో నిషేధిస్తారా? నియంత్రిస్తారా?

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్ 18వ తేదీన సైబర్ టెక్నాలజీస్ మీద జరిగిన సిడ్నీ డైలాగ్ అనే సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ''ఉదాహరణకు బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలను చూడండి.. ఇవి తప్పుడు చేతుల్లోకి వెళితే మన యువతను చెడగొట్టగలదు. అలా జరగకుండా ఉండేలా దీనిపై ప్రజాస్వామిక దేశాలు కలసి పనిచేయటం ముఖ్యం'' అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో.. భారతదేశంలో రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీల మీద ఒక సమగ్ర బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

క్రిప్టోకరెన్సీల మీద నియంత్రణ, వాటి వర్గీకరణ, వాటి మీద వచ్చే ఆదాయంపై పన్నుల వసూళ్లు వంటివి ఈ బిల్లులో ప్రధానాంశాలుగా ఉంటాయని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is cryptocurrency? How was it born, how is it growing, investments in Gold
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X