వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన అంతరార్థం ఏంటి, ఆయన భారత్‌కు ఇస్తున్న సందేశం ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన

టిబెట్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పోటాలా మార్కెట్ దుకాణదారులకు జులై 22న మీరంతా మీ షాపులు, సంస్థలు మూసేయాలని చైనా ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చినపుడు, అక్కడకు ఎవరు రాబోతున్నారనేది వాళ్లు అసలు ఊహించలేదు.

బహుశా, ప్రభుత్వ ప్రతినిధి బృందం ఏదో వస్తుందని, అందులో చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన పెద్ద నేత ఎవరో ఉంటారనే విషయం మాత్రం వాళ్లందరికీ కచ్చితంగా తెలుసు.

కానీ, ఎలాంటి ముందస్తు ప్రకటనా లేకుండా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ టిబెట్‌లో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడు అయ్యాక జిన్‌పింగ్ ఇలా టిబెట్ పర్యటన కోసం అక్కడికి రావడం అదే మొదటిసారి.

ఆ పర్యటన గురించి ముందుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు కాబట్టి ఆయనను హఠాత్తుగా అక్కడ చూసి వ్యూహాత్మక అంశాల్లో తలపండిన వారు కూడా అదిరిపడ్డారు.

ఆయన లాసాలోని పొటాలా మహల్‌కు బయట ఒక బహిరంగ సభలో ప్రసంగించారు కూడా.

"మనం ఎప్పటివరకూ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటామో, సోషలిజాన్ని అనుసరిస్తుంటామో అప్పటివరకూ నా దేశాన్ని నవీకరించడం నాకు సులభంగా ఉంటుంది" అని ఆయన అన్నట్లు చైనా ప్రభుత్వ ఏజెన్సీ షిన్హువా చెప్పింది.

జిన్‌పింగ్ లాసాలో ఒక పెద్ద ప్రధాన బౌద్ధ ఆరామాల్లో ఒకటైన ట్రెపూంగ్ మఠానికి కూడా వెళ్లారని, టిబెట్‌లో మత, సాంస్కృతిక సంరక్షణకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నారని చైనాలోని మరో ప్రభుత్వ మీడియా సీజీటిఎన్ చెప్పింది.

టిబెట్ ద్వారా నేపాల్‌తో బంధం బలోపేతం చేసుకునే ఉద్దేశం

టిబెట్ 70 ఏళ్ల స్వయంప్రతిపత్తికి గుర్తుగా జిన్‌పింగ్ పర్యటన చాలా కీలకమైనదని చైనా ప్రభుత్వ మీడియా చెప్పింది.

కానీ, లాసా వెళ్లడానికి రైలు ఎక్కే ముందు ఆయన న్యింగ్చీ రైల్వే స్టేషన్ వెళ్లారు. అది భారత దౌత్య, వ్యూహాత్మక వ్యవహారాలను పరిశీలించే వర్గాల్లో చాలా కలకలం రేపింది.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార వాణిగా భావించే గ్లోబల్ టైమ్స్ కూడా లాసా పర్యటన కంటే ఎక్కువగా జిన్‌పింగ్ న్యింగ్చీ పర్యటనకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆ నగరానికి కొంతదూరంలో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ఉండడంతో ఇది చైనాకు వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతం.

ఇక్కడికి వచ్చిన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఎన్నో దశాబ్దాలుగా భారత్, చైనా సరిహద్దుల్లోని ఈ నగరాన్ని పర్యటించిన మొట్టమొదటి చైనా అగ్రనేతగా నిలిచారు.

"వచ్చే పంచవర్ష ప్రణాళికలో ప్రధానంగా తమ తూర్పు, పశ్చిమ ప్రాంతాలను మరింత బాగా తనలో కలుపుకోడానికి చైనా ప్రణాళికలు రూపొందిస్తోంది" అని గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడిన చైనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్‌నేషనల్ రిలేషన్ డిప్యూటీ డైరెక్టర్ లోవూ చున్హావ్ అన్నారు.

సమాచార సాధనాల అభివృద్ధి ద్వారా టిబెట్‌ కూడా నైరుతి చైనాలో వ్యాపారానికి పెద్ద కేంద్రంగా ఆవిర్భవించవచ్చు అని ఆయన చెప్పారు.

తర్వాత టిబెట్ ద్వారా నేపాల్‌తో చైనా తన వ్యాపార, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవచ్చు.

షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన

చైనా-నేపాల్ సంబంధాలు లాసా-న్యింగ్చీ రైలు మార్గం

నేపాల్‌తో వ్యాపార, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా లాసా-న్యింగ్చీ రైలుమార్గం కీలక పాత్ర పోషిస్తోంది.

లాసా నుంచి న్యింగ్చీ వరకూ ఉన్న రైలు మార్గం గత నెలలోనే ప్రారంభమైంది. దీనిని సిచువాన్-టిబెట్ రైలు విభాగంలో వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.

మొత్తం 1740 కిలోమీటర్ల పొడవున్న ఈ రైలు మార్గం సిచువాన్‌ను లాసాకు కలుపుతుంది.

లాసా నుంచి న్యింగ్చీ వరకూ రైలు మార్గం విద్యుదీకరణ కూడా పూర్తయ్యింది. దీనిపై ఇప్పుడు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు దూసుకెళ్తోంది.

భారత్‌తో సరిహద్దు ఉన్న ప్రాంతంలో చైనా ఇలాంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం మొదట భారత్‌కు ఆందోళన కలిగించే విషయం. మరోవైపు, టిబెట్‌ మీద షీ జిన్‌పింగ్‌కు హఠాత్తుగా ఎక్కడలేని ఆసక్తి కలగడాన్ని కూడా అదే విధంగా చూడవచ్చు.

షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన

జిన్‌పింగ్ టిబెట్ వెళ్లడం యాదృచ్చికం కాదు

"షీ జిన్‌పింగ్‌కు హఠాత్తుగా టిబెట్‌ మీద ఆసక్తి కలగడం చూస్తే, చైనా అలా చేయడం ద్వారా భారత్ మీద ఒత్తిడి పెంచాలనుకుంటోంది అనడానికి సంకేతం" అని వ్యూహాత్మక అంశాల నిపుణులు లండన్ కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్ హర్ష్ వీ పంత్ అన్నారు.

"అయితే, టిబెట్‌ ప్రవాస ప్రభుత్వానికి గుర్తింపు ఇస్తుందా, లేక టిబెట్‌ను చైనా స్వయంప్రతిపత్తి ప్రాంతంగా భావించకుండా భిన్నమైన ధోరణిని అవలంభిస్తుందా అనేదానిపై భారత్ ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలూ ఇవ్వలేదు".

"షీ జిన్‌పింగ్ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా, నిర్ధారిత కార్యక్రమం లేకుండా లాసా చేరుకున్నారు. టిబెట్ చైనాకు ముగిసిన అంశం కాదని ఆయన చైనా కమ్యూనిస్ట్ పార్టీ, పీఎల్ఏ, టిబెట్ పాలకులకు ఒక సందేశం ఇవ్వాలనుకున్నారు. చైనా ఇటీవల తమ సైన్యంలో టిబెటన్లను మళ్లీ చేర్చుకునే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది" అని ఆయన బీబీసీకి చెప్పారు.

చైనా తమ సైన్యంలో టిబెటన్లను చేర్చుకోవడం అనేది, భారత్‌లో ప్రస్తుత 'టిబెటన్ ఫోర్స్' అంటే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్(ఎస్ఎఫ్ఎస్)కు సమాధానం ఇచ్చే చర్యలుగా కూడా చూడవచ్చు.

వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుల మధ్య కూడా షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన గురించి చాలా చర్చ జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న చైనా సరిహద్దుల్లోని న్యింగ్చీ నగరానికి ఆయన వెళ్లడం యాదృచ్చికం కానే కాదని వారు భావిస్తున్నారు.

షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన

టిబెట్‌తో వివాదం ముగియాలంటే చైనాతో చర్చలు ప్రారంభించాలి

"ఇదే నెల అంటే జులై 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టిబెట్ మత గురువు దలైలామా జన్మదినం సందర్భంగా ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపినపుడు... టిబెట్‌పై తమ విధానం నుంచి తప్పుకుంటున్నట్లు భారత్ నుంచి సంకేతాలు రావడం మొదలయ్యాయి" అని కూడా నిపుణులు చెబుతున్నారు.

2015 వరకూ మోదీ ట్వీట్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేవారు. 2016 నుంచి ఆయన ఆ సంప్రదాయం కూడా మానేశారు. తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వందేళ్లు పూర్తయిన సందర్భంలో కూడా భారత్ చైనాకు ఎలాంటి సందేశం పంపించలేదు. దాని ద్వారా మరో సంకేతం లభించింది.

"షీ జిన్‌పింగ్ 2013లో చైనా అధ్యక్షుడు అయ్యారు. అధ్యక్షుడుగా ఇది టిబెట్‌లో ఆయన మొదటి పర్యటన" అని ధర్మశాలలో ప్రస్తుత సెంట్రల్ టిబెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి టెన్జిన్ లెక్సాయ్ బీబీసీతో అన్నారు.

టిబెట్, చైనా మధ్య సుదీర్ఘ కాలం నుంచీ కొనసాగుతున్న వివాదం ముగిసిపోయేలా చైనా టిబెట్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సి ఉంటుందని టెన్జిన్ లెక్సాయ్ భావిస్తున్నారు.

"పర్యటన చేసినంత మాత్రాన సరిపోదు. జిన్‌పింగ్ నిజంగా టిబెట్ గురించి ఆలోచిస్తుంటే, ఆయన మొట్టమొదట ఈ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ప్రజల ఆకాంక్షలు, మత సంప్రదాయాలు, భాష, సంస్కృతిని గౌరవిస్తున్నానని అక్కడి వారికి ఒక సందేశం ఇవ్వాల్సుంటుంది. టిబెట్ నేతలు, చైనా ప్రభుత్వం మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యేలా ఈ వివాదానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరిగేవరకూ టిబెట్ ప్రజలు ఆయనను నమ్మలేరు" అని తెలిపారు.

చైనా అధ్యక్షుడు టిబెట్ పర్యటన అక్కడి ప్రజల కంటే, ముఖ్యంగా ఎల్ఏసీలో వివాదం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో భారత్‌కు ఒక పెద్ద సందేశం కావచ్చని లెక్సాయ్‌ భావిస్తున్నారు.

షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన

చైనా- టిబెట్ మధ్య వివాదం ఏంటి?

'ప్రపంచపు పైకప్పు' పేరుతో ప్రసిద్ధి చెందిన టిబెట్‌ను తమ నుంచి స్వయంప్రతిపత్తి హోదా పొందిన ప్రాంతంగా చైనా చూస్తోంది. ఈ ప్రాంతంపై శతాబ్దాల నుంచీ తమ సౌర్వభౌమాధికారం ఉందని చైనా చెబుతోంది. కానీ, టిబెట్ ప్రజలు చాలామంది బహిష్కృత ఆధ్యాత్మిక నేత దలైలామా పట్ల విధేయత చూపిస్తారు.

దలైలామాను ఆయన అనుచరులు ఒక సజీవ దైవంగా చూస్తే, చైనా ఆయన్ను ఒక వేర్పాటువాదిగా చూస్తుంది. ఆయన వల్ల చైనాకు ముప్పు రావచ్చని భావిస్తుంది.

టిబెట్‌పై ఒకప్పుడు మంగోలియా, చైనాలోని బలమైన రాజవంశాల పాలన సాగింది. 1950లో చైనా ఈ ప్రాంతంలో తమ జెండాను ఎగరవేసేందుకు వేల సంఖ్యలో సైనికులను పంపించింది.

టిబెట్‌లోని కొన్ని ప్రాంతాలను స్వయంప్రతిపత్తి ఉన్న ప్రాంతాలుగా మార్చారు. మిగతా వాటిని చైనాలోని ప్రాంతాల్లో విలీనం చేశారు.

1959లో చైనాకు వ్యతిరేకంగా విఫలమైన ఒక తిరుగుబాటుయత్నం తర్వాత 14వ దలైలామా టిబెట్ వదిలి భారత్‌లో ఆశ్రయం పొందారు. అక్కడే ఆయన ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన

60, 70వ దకాల్లో చైనా సాంస్కృతిక విప్లవం సమయంలో టిబెట్‌లోని చాలా బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేశారు. అణచివేత, సైనిక పాలనలో వేలాది టిబెటన్లు ప్రాణాలు కోల్పోయారని కూడా చెబుతారు.

నిజానికి టిబెట్ చట్టపరమైన స్థితి గురించి చైనా, టిబెట్ మధ్య వివాదం ఉంది.

టిబెట్ 13వ శతాబ్దం మధ్య నుంచీ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తుంటే, టిబెటన్లు మాత్రం టిబెట్ ఎన్నో శతాబ్దాలుగా స్వతంత్ర దేశంగా ఉందని, దానిపై చైనా వరుసగా ఎప్పుడూ అధికారం చెలాయించలేదని అంటున్నారు.

మంగోలు రాజు కుబ్లయీ ఖాన్ యువాన్ రాజవంశాన్ని స్థాపించారు. టిబెట్‌ వరకే కాకుండా చైనా, వియత్నాం, కొరియా వరకూ తన రాజ్యాన్ని విస్తరించారు.

తర్వాత 17వ శతాబ్దంలో చైనాకు చెందిన చింగ్ రాజవంశానికి, టిబెట్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. 260 ఏళ్ల బంధం తర్వాత చింగ్ సైన్యం టిబెట్‌ మీద అధికారం చేలాయించింది. కానీ మూడేళ్లకే టిబెటన్లు అతడిని తరిమేశారు. 1912లో 13వ దలైలామా టిబెట్‌ను స్వతంత్రంగా ప్రకటించారు.

తర్వాత 1951లో చైనా సైన్యం మరోసారి టిబెట్‌ను తమ అదీనంలోకి తెచ్చుకుంది. అప్పుడు టిబెట్‌కు చెందిన ఒక ప్రతినిధి బృందం టిబెట్ సౌర్వభౌమత్వాన్ని చైనాకు అప్పగిస్తూ ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది.

దాంతో, దలైలామా పారిపోయి భారత్ రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన టిబెట్ స్వయంప్రతిపత్తి కోసం సంఘర్షణ చేస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is the significance of Chinese President Xi Jinping's visit to Tibet and what message is he sending to India?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X