భారతీయులే: చాప్లిన్, పికాసోల మధ్య ఓ సారుప్యత
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా రాణించి, వివిధ రంగాల్లో కీర్తి గడించిన చార్లీ చాప్లిన్, ప్లాబో పికాసో, ఎల్విస్ ప్రెస్లీలు భారతీయులనేట. వీరంతా ఒకే సంచార తెగకు చెందిన వారని, ఆ తెగ పేరే రోమా అని వరల్డ్ రోమా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జోవాన్ డాంజానోవిక్ తెలిపారు.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్, అంతర్ రాష్ట్రీయ సహయోగ్ పరిషత్ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో అంతర్జాతీయ రోమా కాన్ఫెరెన్స్ జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి సుస్మాస్వరాజ్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జోవాన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బంజారా, గుజ్జర్, డోమ్, సాన్సి, చౌహాన్ వంటి తెగలతోపాటు రోమా కూడా భారత్‌కు చెందిన ఓ మైనారిటీ తెగగా అభివర్ణించారు. సంచార జీవులు అయిన రోమా తెగ ప్రజలు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే భారత్‌ను వదిలి యూరప్‌కు వెళ్లిపోయారని పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా రోమా తెగకు చెందిన ప్రజలు సుమారు 12 నుంచి 15 మిలియన్లు మంది ఉంటారని తెలిపారు. వీరంతా కూడా ప్రస్తుతం యూరప్, మధ్య ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు. అయితే వీరంతా తమ భారతీయ మూలాలను మాత్రం మరిచిపోలేదని పేర్కొన్నారు.
వీరంతా తమను తాము రాము సంతానంగానే భావించుకుంటారని తెలిపారు. యూరోపియన్ యూనియన్‌లో సెర్బియా దేశం తరుపున మాజీ మంత్రిగా జోవాన్ డాంజానోవిక్ సేవలందించారు.భారతీయుల్లో మంచి నైపుణ్యం ఉందని కనిపెట్టిన విదేశీయలు, ఇక్కడి కళాకారులను, నిపుణులను, అందమైన స్త్రీలను విదేశాలకు బలవంతంగా తరలించుకుపోయారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత్‌లో రోమా తెగకు చెందిన మూలాలున్నాయని చార్లీ చాప్లిన్, ప్రఖ్యాత చిత్రకారుడు ప్లాబో పికాసో, కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్ ప్రెస్లీ లాంటి వారు ఈ తెగకు చెందిన వారేనన్నారు. అంతేకాదు ప్రపంచాన్ని జయించాలని బయల్దేరిన విజేత అలగ్జాండర్‌ను ఓడించిన వీరులుగా భారతీయలకు ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు ఉందన్నారు.
మొట్టమొదటి రోమా కాన్ఫరెన్స్‌ను 1976లో చండీగడ్‌లో నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హాజరయ్యారు. ఆ తర్వాత 1983లో జరిగిన అంతర్జాతీయ రోమా కల్చరల్ ఫెస్టివల్‌ను కూడా ఆమె ప్రారంభించారు. 2001లో నిర్వహించిన రోమా ఫెస్టివల్‌కు 12 దేశాల నుంచి 33 మంది రోమా స్కాలర్స్ హాజరయ్యారు.












Click it and Unblock the Notifications