భయపడిన యువరాజు.. ప్యాలెస్‌లు వదిలి బంకర్లలోకి
మిడిల్ ఈస్ట్‌లో అగ్రరాజ్యాల సమీకరణాలను, గల్ఫ్ దేశాల భద్రతను తీవ్రంగా సవాలు చేస్తున్న అత్యంత శక్తివంతమైన సాయుధ బలగాల్లో 'హౌతీలు' (Houthi Movement) అగ్రస్థానంలో ఉన్నారు. యెమెన్‌ను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న ఈ తిరుగుబాటు దళం.. కేవలం ఒక ప్రాంతీయ తిరుగుబాటు ముఠాగా కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను, సౌదీ అరేబియా సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. అత్యాధునిక డ్రోన్లు, మిస్సైళ్లతో సౌదీ నగరాలు, చమురు ప్రాసెసింగ్ ప్లాంట్లపై విరుచుకుపడుతూ అంతర్జాతీయ సమాజాన్ని సైతం విస్తుపోయేలా చేస్తున్నారు.
ఎవరు ఈ హౌతీలు? ఆవిర్భావం వెనుక చరిత్ర
హౌతీల అధికారిక పేరు 'అన్సారుల్లా' (దేవుడి సహాయకులు). యెమెన్‌లోని షియా ముస్లింలలోని 'జైదీ' అనే ఉపతెగకు చెందిన వీరు 1990 కాలంలో యెమెన్ ఉత్తర ప్రాంతంలో ఏర్పడ్డారు. యెమెన్‌లో తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న వివక్షకు వ్యతిరేకంగా, అలాగే నాటి యెమెన్ ప్రభుత్వంపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్న సౌదీ అరేబియా ప్రాభవాన్ని నిరోధించేందుకు ఈ ఉద్యమం ప్రారంభమైంది. అబ్దుల్ మాలిక్ అల్-హౌతీ నాయకత్వంలో బలపడిన ఈ సంస్థ.. 2014లో యెమెన్ రాజధాని సనాను ఆక్రమించుకుని నాటి ప్రభుత్వాన్ని పడగొట్టి యెమెన్‌లో అత్యంత శక్తివంతమైన బలంగా రూపాంతరం చెందింది.

సౌదీపైనే ప్రధానంగా దాడులు ఎందుకు?
యెమెన్‌లో హౌతీలు అధికారాన్ని చేజిక్కించుకోవడం తమ భద్రతకు తీవ్ర ముప్పుగా భావించిన సౌదీ అరేబియా, 2015లో ఇతర అరబ్ దేశాలతో కలిసి హౌతీలపై సైనిక చర్యను ప్రారంభించింది. నాటి నుంచి హౌతీలకు, సౌదీ నేతృత్వంలోని కూటమికి మధ్య ఘోరమైన యుద్ధం సాగుతోంది. సౌదీ అరేబియా తమ దేశంపై వేలాది వైమానిక దాడులు చేసి లక్షలాది మంది సామాన్యుల మరణానికి కారణమైందని హౌతీలు ఆరోపిస్తున్నారు. దానికి ప్రతీకారంగానే సౌదీకి చెందిన ఆరామ్‌కో (Aramco) చమురు శుద్ధి కేంద్రాలు, విమానాశ్రయాలు, రాజధాని రియాద్‌లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, బాలిస్టిక్ క్షిపణి దాడులకు తెగబడుతున్నారు.
హౌతీల వెనుక ఉన్న అసలు శక్తులు.. ఎంత శక్తివంతం?
హౌతీల వెనుక షియా ప్రాబల్యం ఉన్న ఇరాన్ పూర్తి స్థాయి మద్దతు ఉందనేది బహిరంగ రహస్యం. ఇరాన్ వీరికి అత్యాధునిక క్షిపణులు, డ్రోన్ సాంకేతికత, నిఘా పరికరాలు, సైనిక శిక్షణను అందిస్తోంది. దీంతో పాటు ఎర్ర సముద్రం ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతం హౌతీల గుప్పెట్లో ఉంది. అంతర్జాతీయ నౌకాయాన మార్గాలను క్షిపణులతో దెబ్బతీయగల సామర్థ్యం వీరికి ఉంది. కేవలం గొర్రెల కాపరులుగా, సాధారణ తిరుగుబాటుదారులుగా ప్రస్థానం ప్రారంభించిన వీరు, నేడు ఖండాలంతర బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించగల అత్యంత శక్తివంతమైన సైనిక బలగంగా మారారు.
సౌదీ యువరాజు ప్యాలెస్‌లు మార్చడానికి కారణమేంటి?
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) ఏఐ టెక్నలజీతో దేశాన్ని నడిపిస్తున్నప్పటికీ, హౌతీల క్షిపణి దాడులు ఆయన భద్రతకు పెద్ద సవాలుగా మారాయి. హౌతీలు ప్రయోగిస్తున్న కామికేజ్ డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు సౌదీలోని పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్‌లను కూడా దాటుకుని నేరుగా రియాద్‌లోని రాయల్ ప్యాలెస్‌ల పరిసరాల్లో పడటంతో భద్రతా విభాగాలు తీవ్ర ఆందోళన చెందాయి. ఖచ్చితమైన సమాచారంతో రాజభవనాలనే లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం హౌతీలకు ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా సౌదీ యువరాజు తన నివాసాలను, కార్యాలయాలను తరుచుగా మార్చాల్సి వస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
హౌతీల తుది లక్ష్యం ఏంటి?
హౌతీల ప్రధాన లక్ష్యం యెమెన్‌పై సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించడం, ఇస్లామిక్ ప్రపంచంలో పాశ్చాత్య దేశాలు .. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం. "అల్లాహ్ గొప్పవాడు, అమెరికాకు వినాశనం, ఇజ్రాయెల్‌కు వినాశనం, యూదులకు శాపం, ఇస్లాంకు విజయం" అనేదే వారి ప్రధాన నినాదం. మధ్యప్రాచ్యంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి, అంతర్జాతీయంగా తమ బలాన్ని చాటుకోవడానికి హౌతీలు ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడరనేది స్పష్టమవుతోంది.














Click it and Unblock the Notifications
