సౌదీ అరేబియా ఇక ఎంతమాత్రం సురక్షితం కాదు- హౌతీల వార్నింగ్: భారత్ అడ్వైజరీ జారీ
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులు పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. పౌర విమానయాన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోందా దేశాన్ని. రియాద్ మాత్రమే కాకుండా దమ్మామ్ లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్నికూడా హౌతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా మలచుకోవడం ఆ దేశ ఆయువుపట్టును దెబ్బకొట్టినట్టవుతోంది.
ఈ దాడులకు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటు సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. సౌదీ అరేబియాలోని కీలక విమానాశ్రయాలు, ఆర్థిక మౌలిక సదుపాయాలపై భవిష్యత్తులోనూ మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరి ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వరుస దాడులకు తామే బాధ్యత వహిస్తోన్నట్లు ప్రకటించారు.

సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు ఇకపై ఎంత మాత్రం కూడా సురక్షితం కాదని, విమాన సంస్థలు, ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది.. సౌదీ వైమానిక కేంద్రాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. యెమెన్‌లో సౌదీ అరేబియా చేపట్టిన సైనిక చర్యలు నిలిపివేయకపోతే రాబోయే రోజుల్లో మరింత తీవ్రమైన దాడులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ దేశ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా తమ దాడులు ఉంటాయనీ అన్నారు. మక్కా, మదీనా మినహాయించి ఏ ఒక్క ఎయిర్ పోర్ట్ కూడా ఎంతమాత్రం సురక్షితం కాదని యాహ్యా తేల్చి చెప్పారు.
ఈ పరిణామాల నేపత్యంలో భారత్, అమెరికా, బ్రిటన్ వంటి వివిధ దేశాలు సౌదీలో నివసిస్తోన్న తమ దేశ పౌరుల కోసం సేఫ్టీ అడ్వైజరీని జారీ చేశాయి. సౌదీలో లక్షలాది మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్న నేపథ్యంలో వారి రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అక్కడి ప్రస్తుత భద్రతా వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని భారతీయ పౌరులందరూ తీవ్ర అప్రమత్తతతో ఉండాలని సూచించింది.
స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు విడుదల చేసే భద్రతా మార్గదర్శకాలు, సూచనలను కచ్చితంగా పాటించాలని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో కోరింది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం శ్రేయస్కరమని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రవాస భారతీయులకు అవసరమైన సహాయం అందించడానికి రాయబార కార్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 00-966-11-4884697 నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా గానీ, లేదా [email protected] ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది.
అమెరికా విదేశాంగ శాఖ కూడా తన దౌత్య సిబ్బంది ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. యెమెన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల పరిధిలో అమెరికన్ పౌరులు గానీ, అధికారులు, సిబ్బంది ప్రయాణించడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనికోసం ముందుగా అనుమతి పొందాల్సి ఉంటుందని రాయబార కార్యాలయ అధికారులకు సూచించింది. అలాగే సౌదీలోని జిజాన్, అసీర్, నజ్రాన్ ప్రావిన్స్, ఖతీఫ్, యంబూ. తాయిఫ్ నగరాలకు వెళ్లేందుకు కూడా అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక అనుమతి అవసరమని అమెరికన్ మిషన్ స్పష్టం చేసింది.
బ్రిటన్ విదేశాంగ శాఖ కూడా తమ దేశ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను సవరించింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. సౌదీ అరేబియాను వీడి స్వదేశానికి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే బ్రిటన్ పౌరులు రోడ్డు మార్గాలను వినియోగించుకోవాలని సూచించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ దేశాలకు వెళ్లి, అక్కడి నుంచి విమాన సర్వీసులను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.












Click it and Unblock the Notifications
