నేపాల్ తొలి మహిళా పైలట్ సాహసం! ఎవరీ కెప్టెన్ ప్రియా అధికారి?
మంచు కొండలు.. నిలువునా విరిగిపడే కొండచరియలు.. ఎటు చూసినా దిగ్బంధం చేసిన బురద నీటి ప్రవాహం! ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో సామాన్యులు అడుగు పెట్టడానికే వణికిపోతారు. కానీ, ఆకాశంలో ధైర్యంగా విహరిస్తూ, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వందలాది మంది బాధితులకు తానొక దేవతలా కనిపిస్తోంది. ఆమె పేరు కెప్టెన్ ప్రియా అధికారి! నేపాల్ దేశపు తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ అయిన ప్రియ, ఇటీవల నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన వినాశకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో చూపిన సాహసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది.
వారంలోనే 100కి పైగా రెస్క్యూ మిషన్లు.. నిద్ర లేని రాత్రులు!
వరదలు దారుణంగా ముంచెత్తిన రసువా జిల్లాలోని 'తిమురే' ప్రాంతంలో పరిస్థితులు వర్ణనాతీతంగా మారాయి. అలాంటి ప్రమాదకర శ్రేణుల్లో కెప్టెన్ ప్రియా కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే ఏకంగా 100కు పైగా అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్లు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. సన్నటి లోయలు, దట్టమైన పొగమంచు, ల్యాండింగ్ చేయడానికి కూడా వీల్లేని బురద నేలల మధ్య హెలికాప్టర్‌ను అదుపు చేస్తూ వందలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. "మేమంతా తీవ్ర అలసటకు గురయ్యాం, కానీ ఇలాంటి కష్టసమయాల్లో ప్రజలను కాపాడటానికే మేము ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం" అని సీఎన్ఎన్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

క్యాబిన్ క్రూ నుంచి హిమాలయాల పైలట్ వరకు!
ప్రియా అధికారి ప్రయాణం అంత తేలిగ్గా సాగలేదు. మొదట్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివిన ఆమె, విమానంలో క్యాబిన్ క్రూగా తన కెరీర్ ప్రారంభించారు. అయితే ఒకసారి హెలికాప్టర్‌లో ప్రయాణించినప్పుడు కలిగిన అనుభూతి ఆమె ఆశయాల దిశను మార్చేసింది. ఎలాగైనా పైలట్ కావాలనే పట్టుదలతో ఫిలిప్పీన్స్ వెళ్లి శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2017 నాటికి ఫుల్-టైమ్ హెలికాప్టర్ పైలట్‌గా మారడమే కాకుండా, పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ రంగంలో నేపాల్‌కే మొదటి మహిళా హెలికాప్టర్ కెప్టెన్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు. హిమాలయాల్లో సుమారు 6,200 మీటర్ల అత్యంత ఎత్తైన ప్రాంతాలలో చిక్కుకున్న పర్వతారోహకులను కాపాడటంలో ఆమె సిద్ధహస్తురాలు.
చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయిన గ్రామాలు.. భయంకర దృశ్యాలు!
వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని వివరిస్తూ.. "ఆకాశం నుంచి చూస్తుంటే సర్వస్వం తుడిచిపెట్టుకుపోయినట్లు కనిపించింది. ఆ ప్రాంతంలో ఉన్న ఐదు జలవిద్యుత్ ప్రాజెక్టులతో పాటు వందలాది ఇళ్లు, మనుషులు కొట్టుకుపోయారు. నేలమీద మృతదేహాలు తేలియాడుతున్నాయి. 2015లో సంభవించిన భయంకరమైన భూకంపం కంటే ఈ విపత్తు చాలా దారుణంగా ఉంది" అని ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ల్యాండ్ చేసే సమయంలో అక్కడ బురద ఎంత ఎక్కువగా ఉందంటే, ఇంజిన్ ఆపితే విమానం దిగబడిపోయే ప్రమాదం ఉందని.. అందుకే ఇంజిన్ రన్ అవుతుండగానే బాధితులను లోపలికి ఎక్కించుకుని సురక్షితంగా బయటపడ్డామని ఆమె తెలిపారు.
Kapten Priya Adhikari, Perempuan Pertama Nepal yg menjadi Kapten Helikopter, telah menjalankan sekitar 100 Misi Penyelamatan untuk Mengevakuasi Ratusan Warga Terdampak Banjir Bandang di Perbatasan Nepal-Tibet. pic.twitter.com/NOmt53vQAb
— NyxNara (@NaraSenyap) September 2, 2026
బాధితుల చేతి సంకేతాలే నా ఊపిరి!
సహాయక చర్యల సమయంలో ఒకే ప్రదేశంలో దాదాపు 5 నుంచి 6 హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వాల్సి వచ్చేదని, రేడియో కమ్యూనికేషన్ ద్వారా పైలట్లందరూ ఎంతో సమన్వయంతో పనిచేశారని ఆమె చెప్పారు. నిరంతర ప్రయాణాల వల్ల శరీరం సహకరించకపోయినా.. "మేము ఉన్నాం.. మమ్మల్ని కాపాడండి" అంటూ కింద నుంచి బాధితులు ఆశగా చేతులు ఊపే దృశ్యమే తనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని కెప్టెన్ ప్రియా చెప్పారు. చావు అంచుల వరకు వెళ్లి మృత్యువుతో పోరాడుతున్న ప్రజలకు కొత్త జీవితాన్ని ఇస్తున్న కెప్టెన్ ప్రియా అధికారి సాహసానికి ప్రపంచం మొత్తం జోహార్లు అర్పిస్తోంది.














Click it and Unblock the Notifications