కరోనా పుట్టుకపై కీలక దర్యాప్తు -జనవరిలో చైనాకు WHO బృందాలు
కరోనా మహమ్మారి పుట్టుకొచ్చి 13 నెలలు దాటినా దాని ప్రభావం ఇంకా తీవ్రంగానే కొనసాగుతున్నది. దేశాలకు దేశాలు ఆర్థికంగా దెబ్బతినగా, లక్షల మంది జనం చనిపోయారు. బుధవారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 7.4కోట్లు దాటేసింది. మరణాలు 17 లక్షలకు చేరువయ్యాయి. ఈ విలయానికి కారణమైన మహమ్మారి అసలు ఎలా పుట్టిందనేదానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దృష్టిసారించింది.
కొవిడ్-19 పుట్టుకపై విచారించేందుకు వచ్చే జనవరిలో డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని అంతర్జాతీయ నిపుణుల బృందం చైనాలో పర్యటించనుంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి హెడిన్ హాల్‌డర్సన్ బుధవారం ఒక ప్రకటన చేశారు. వైరస్ ఎక్కడ పుట్టింది, ఎలా వ్యాపించిందనే విషయంపై బృందాలు విచారణ చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఏడాది కాలం పూర్తైంది. ఇప్పటివరకూ ఆ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సుమారు 17 లక్షల మందిని బలితీసుకుంది. ఈ వైరస్ ఎక్కడ పుట్టింది? అనే విషయం మాత్రం సర్వత్రా మిస్టరీగా ఉండిపోయింది. ఆ విషయాల్ని కనుగొనేందుకు చైనాకు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పంపే విషయమై డబ్ల్యూహెచ్‌ఓ నెలల తరబడి పనిచేస్తోంది.
కాగా డబ్ల్యూహెచ్ఓ వైరస్ పుట్టుకపై దర్యాప్తు చేపట్టేందుకు ఇప్పటికే జులైలో ఓ బృందాన్ని బీజింగ్‌కు పంపిన విషయం తెలిసిందే. మొదట పరిశోధకులు చైనాలోని వుహాన్‌లోని విదేశీ జంతు మాంస విక్రయ మార్కెట్లో.. వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందని అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి ఆ మార్కెట్ కారణం కాకపోవచ్చు అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications