Train Force One: విమానాన్ని వాడని మోదీ
PM Modi visit Ukrain: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌లో అడుగుపెట్టారు. కొద్దిసేపటి కిందటే రాజధాని కీవ్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. కీవ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు మోదీకి స్వాగతం పలికారు.
ఈ నెల 21వ తేదీన ఆయన రెండు దేశాల పర్యటనను చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత పోలెండ్ వెళ్లారు. రాజధాని వార్సాలో ఆ దేశాధ్యక్షుడు ఆంద్రెజ్ దూదా, ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్‌తో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, రక్షణ ఒప్పందాలపై చర్చించారు. మోదీ.. పోలెండ్ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగింది. కొద్దిసేపటి కిందటే ఉక్రెయిన్‌కి చేరుకున్నారు.

ఒక భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటిస్తోండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది ఉక్రెయిన్. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌కు చెందిన ఏ ప్రధాని కూడా ఆ దేశానికి వెళ్లలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్లిన తొలి ప్రధానిగా రికార్డు నెలకొల్పారు మోదీ.
సుదీర్ఘకాలంగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ.. ఉక్రెయిన్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ప్రత్యేకించి- ఈ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేలా, కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరేలా చర్చలు సాగించనున్నారు.
ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా మోదీ విమానాన్ని వినియోగించలేదు. పోలెండ్ నుంచి కీవ్ వరకు రైలులో ప్రయాణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా విదేశీ పర్యటనల కోసం ఆయన ఎయిరిండియా వన్ లగ్జరీ విమానాన్ని వినియోగిస్తుంటారు. ఢిల్లీ నుంచి పోలెండ్‌కు ఈ ఫ్లైట్‌లో బయలుదేరి వెళ్లారు కూడా.
అక్కడి నుంచి కీవ్‌కు రైలులో ప్రయాణించారు. దీనికోసం ఉక్రెయిన్ ప్రభుత్వానికి చెందిన ట్రైన్ ఫోర్స్ వన్‌ను వినియోగించారు. దీనికి కారణం లేకపోలేదు. రష్యాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో- ముందుజాగ్రత్త చర్యగా దేశంలోని అన్ని విమానాశ్రయాలనూ మూసివేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం.

ఎక్కడి నుంచి మిస్సైల్స్ వచ్చి పడతాయో తెలియని పరిస్థితుల్లో ఉంది ఉక్రెయిన్. అందుకే గగనతలాన్ని మూసివేసింది. చాలాకాలంగా ఒక్క విమానం కూడా ఎగరట్లేదక్కడ. దూర ప్రయాణాలకు రైళ్లనే వినియోగిస్తోన్నారు. జెలెన్‌స్కీ సైతం రైలులోనే రాకపోకలు సాగిస్తోన్నారు.
గతంలో ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయెల మాక్రాన్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్, ఇటలీ మాజీ ప్రధాని మారియో డ్రఘీ కూడా ఇదే ట్రైన్ ఫోర్స్ వన్‌లో ఉక్రెయిన్‌కు చేరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications