వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ కరెన్సీ నోట్లపై జిన్నా చిత్రం ముద్రించడంపై ఎందుకు వ్యతిరేకత వచ్చింది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అది 1957 డిసెంబర్ 24. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ మొదటిసారి 100 రూపాయల నోటు విడుదల చేసింది. దానిపై పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చిత్రం ముద్రించారు.

ఆ ఆకుపచ్చ నోటుపై రెండో వైపు లాహోర్‌లోని బాద్షాహీ మసీదు చిత్రం ఉంది. ఈ కరెన్సీ నోటును కరాచీ, లాహోర్, ఢాకా (ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని)లో ఒకేసారి విడుదల చేశారు. ఈ నోటు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అప్పటి గవర్నర్ అబ్దుల్ ఖాదిర్ ఉర్దూలో సంతకం చేశారు.

Pak currency

ఒక మనిషి చిత్రం ముద్రించిన పాకిస్తాన్ మొదటి కరెన్సీ నోటు ఇదే. మహమ్మద్ అలీ జిన్నా చిత్రం ఉన్న ఆ కరెన్సీ నోటు విడుదలపై తర్వాత ఉలేమా, మిగతా వారి నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతలు వెల్లువెత్తాయి.

జిన్నాకు ఇష్టం లేదన్నారు

ఈ నోటుపై వ్యతిరేకతల గురించి మొదటి వార్త 1957 డిసెంబర్ 30న దైనిక్ జంగ్ పత్రికలో ప్రచురితమైంది.

సెంట్రల్ జమీయత్ ఉలేమా-ఎ-పాకిస్తాన్ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ హమీద్ బదాయునీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జీవించి ఉన్నప్పుడే ఆయన చిత్రాన్ని పోస్టల్ స్టాంప్ మీద ముద్రించడంపై సమస్యలు వచ్చాయని, జిన్నాకు స్వయంగా అది నచ్చలేదని ఆయన అన్నారు.

ఆ స్టాంప్ మీద చంద్రుడు నక్షత్రం లేదా ఏదైనా ప్రముఖ పాకిస్తానీ కట్టడానికి సంబంధించిన చిత్రం ఉంటే బాగుంటుందని అప్పట్లో జిన్నా భావించారని హమీద్ చెప్పారు.

అలాగే, ఇస్లాంను గౌరవించేవారందరూ జిన్నా చిత్రం ఉన్న 100 నోట్లను బహిష్కరించాలని కుల్ పాకిస్తాన్ దస్తూర్ (ఆల్ పాకిస్తాన్ కాన్‌స్టిట్యూషన్) పార్టీ అధ్యక్షుడు మౌలానా అసద్-ఉల్-కాద్రీ పిలుపునిచ్చారు.

ఆ నోట్లను బహిష్కరిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు వాటిని తిరిగి వెనక్కి తీసుకుంటారని భావించారు.

"ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ముస్లిం మనోభావాలను కించపరిచేలా ఉంది, ఇది కచ్చితంగా ఇస్లాంకు విరుద్ధం" అని మౌలానా అసద్ అన్నారు.

ప్రజల మనోభావాలను గౌరవించి 100 నోట్లను వెనక్కు తీసుకోవాలని ఆయన దేశ అధ్యక్షుడు ఇస్కందర్ మిర్జా, ఆర్థిక మంత్రిని కూడా కోరారు.

జిన్నా జ్ఞాపకంగా జారీ

అదే రోజు వార్తల్లో సెంట్రల్ జమీయత్ ఉలేమా-ఎ-ఇస్లామ్ ఉపాధ్యక్షుడు మౌలానా ముఫ్తీ మొహమ్మద్ షఫీ చేసిన ప్రకటన కూడా ప్రచురితమైంది.

ఆయన పాకిస్తాన్ వ్యవస్థాపకుడి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న మొహమ్మద్ అలీ జిన్నా చిత్రం ఉన్న ఒక కొత్త 100 రూపాయల నోటు విడుదల చేస్తున్నారు, దానిని పాకిస్తాన్ వ్యవస్థాపకుడి జ్ఞాపకార్థంగా విడుదల చేస్తున్నట్టు చెబుతున్నారని అన్నారు.

"పాకిస్తాన్ జాతిపిత పట్ల కొందరు ఇలా చేస్తుండడం విచారకరం. ఆయన ఒక్కొక్క జ్ఞాపకాన్నీ ఎంపిక చేసి మరీ చెరిపివేస్తున్నారు. ఇదంతా ఆయన పేరు మీదే జరుగుతుండడం హాస్యాస్పదం" అన్నారు.

"మొహమ్మద్ అలీ జిన్నా ప్రజాస్వామ్యాన్ని సమర్థించేవారు. పాకిస్తాన్‌లో దాని అమలుకు చాలా ప్రయత్నించారు. కానీ, ఆయన్ను జాతిపితగా పిలిచేవారే పదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చారు. మన పార్లమెంట్, ప్రభుత్వం కుతంత్రాలకు అడ్డాగా మారిపోయింది" అని మౌలానా ముఫ్తీ మొహమ్మద్ షఫీ అన్నారు.

"పాకిస్తాన్ నాణేల మీద తనదిగానీ, వేరే ఎవరి చిత్రం గానీ ఉండకూడదు అనేది ఆయన గొప్ప లక్షణాల్లో ఒకటి. అది ఆయనకు ఇష్టం లేదు. ఎవరో ఆయనకు అలాంటి సలహా ఇచ్చినా జిన్నా దానిని తోసిపుచ్చారు. ఇస్లాం బోధనల ప్రకారం ఆయన చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. మిగతా ఇస్లాం దేశాలకు ఆదర్శంగా నిలిచారు".

"ఆయన జీవించి ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. కానీ, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా జాతిపితకు భక్తులుగా చెప్పుకునేవారే, చివరికి ఆ సంప్రదాయాన్ని ముక్కలు చేశారు. వంద రూపాయల నోటుపై ఆయన చిత్రాన్ని ముద్రించి, జిన్నాకు, పాకిస్తాన్‌కు చాలా సేవ చేసినట్లు భావిస్తున్నారు" అని చెప్పారు.

అప్పటి వార్తా పత్రికలను పరిశీలించడం ద్వారా 100 కరెన్సీ నోటు మీద మొహమ్మద్ అలీ జిన్నా చిత్రం ముద్రించడంపై మతపరమైన వ్యతిరేకతతోపాటూ, వ్యాపారుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినట్లు తెలిసింది.

1957 డిసెంబర్ 31న ప్రచురితమైన ఒక వార్త ప్రకారం సర్‌గోధాలో 8 రకరకాల మతపరమైన, ఇతర పార్టీల నేతలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

పాకిస్తాన్ కరెన్సీ నోట్లపై ఫొటోలు ముద్రించడానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ చేసిన కొత్త ప్రతిపాదన రాజ్యాంగ మార్గదర్శకాలకు, ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆ ప్రకటనలో వారు చెప్పారు.

"రాజ్యాంగం పట్ల విధేయులుగా ఉంటామని ప్రమాణం చేసిన అధికారులు ఇలాంటి ప్రతిపాదనను చేయడాన్ని, మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాకిస్తాన్ నాణేలు, నోట్లపై ఒక వ్యక్తి చిత్రం ముద్రించే సంప్రదాయం మొదలవకుండా ఇలాంటి ప్రతిపాదనలను రద్దు చేయాలని, గవర్నర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం" అన్నారు.

"పాకిస్తాన్ ఒక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ రాచరికపు కట్టడాలను కూడా పునరుద్ధరించకూడదు" అన్నారు.

ఈ ప్రకటనపై ఆయా పార్టీల నేతలందరూ సంతకాలు చేశారు. అదే సమయంలో వార్తా పత్రికల్లో పాఠకుల లేఖలు కూడా ప్రచురించేవారు. వాటిలో ఉలేమాను వ్యతిరేకిస్తూ, సమర్థిస్తూ కొన్ని లేఖలు కనిపించాయి.

కరెన్సీ నోటు మీద పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నా చిత్రం ముద్రించడంపై అప్పటి ప్రముఖ కవి ఎహసాన్ దానిష్ తన మనసులోని భావాలు వ్యక్తం చేస్తూ ఉర్దూలో ఒక కవిత కూడా రాశారు.

"చూశారా, చూశారా.. ఏం అద్భుతం… వంద రూపాయల నోటుపై మొహమ్మద్ అలీ జిన్నా చిత్రం.. ఈ చిత్రంతోనే లంచాలు ఇవ్వడం, తీసుకోవడం కూడా జరుగుతుందా... ఇదే చిత్రంతో రాత్రీ పగలూ స్మగ్లింగ్ కూడా జరుగుతుందా... ఇదే చిత్రంతో మద్యం కూడా కొనుగోలు చేస్తారా... ఈ చిత్రంతోనే దేశవ్యాప్తంగా జూదం కూడా ఆడుతారా... ఈ చిత్రంతో మీ వ్యాపారాలు కూడా జోరుగా జరుపుతారా.. ఇది ఎవరి తెలివితక్కువ పని, ఇలా చేసింది ఎవరు.." అని ఆయన ఆ కవితలో ప్రశ్నించారు.

ఉలేమా వ్యతిరేకించినప్పటికీ కొన్ని రోజుల్లోనే ఈ వేడి చల్లారిపోయింది. వంద రూపాయల నోటుతో మొదలైన జిన్నా చిత్రం ముద్రించే పరంపర మిగతా కరెన్సీ నోట్లపై కూడా కొనసాగింది. ఐదు రూపాయలు, అంతకంటే ఎక్కువ విలువైన అన్ని నోట్ల మీద పాకిస్తాన్ వ్యవస్థాపకుడి ఫొటో ముద్రించడం కొనసాగింది.

ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. 1948 అక్టోబర్ 3న బహావల్పూర్ సంస్థానం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. దానిపై పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా, బహావల్పూర్ అమీర్ సర్ సాదిక్ మొహమ్మద్ ఖాన్ అబ్బాసీ ఫొటోను ప్రచురించారు.

ప్రపంచంలో మొహమ్మద్ అలీ జిన్నా చిత్రం ప్రచురించిన మొదటి పోస్టల్ స్టాంప్ ఇదే. పాకిస్తాన్ పోస్టల్ స్టాంపుల మీద అధికారికంగా జిన్నా చిత్రం మొదటిసారి 1966 డిసెంబర్ 25న ప్రచురించింది. 15 పైసలు, 50 పైసల స్టాంపులపై ఆ ఫొటో ఉండేది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why there was opposition to printing Jinnah's image on Pakistani currency notes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X