వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టోక్యో ఒలింపిక్స్ వచ్చే నెలలో మొదలవుతాయా... ఈ క్రీడా వేడుకకు కోవిడ్ అడ్డంకి అవుతుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టోక్యో ఒలిపింక్స్

జపాన్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ వచ్చే నెలలో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.

నగరంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ, ఒలింపిక్ క్రీడలు కచ్చితంగా ప్రారంభమవుతాయని టోక్యో 2020 అధ్యక్షుడు సీకో హషిమోటో నమ్మకంగా చెప్పారు.

ఒలింపిక్స్ ఎప్పుడు, ఎక్కడ?

2020 సమ్మర్ ఒలింపిక్ క్రీడలు జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జపాన్ రాజధాని టొక్యోలో జరగనున్నాయి.

పారాలింపిక్ క్రీడలు ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరుగుతాయి.

ఈ క్రీడలు కిందటి సంవత్సరమే జరగాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి.

ఒలింపిక్ క్రీడల్లో 33 పోటీలు, 339 ఈవెంట్స్ 42 వేదికల్లో జరుగుతాయి. పారా ఒలింపిక్స్‌లో 22 క్రీడల్లో 539 ఈవెంట్స్ 21 వేదికల్లో జరుగుతాయి.

వీటిల్లో చాలామటుకు గ్రేటర్ టోక్యోలోనే జరగనున్నాయి. కొన్ని ఫుట్‌బాల్ పోటీలు, మారథాన్ హక్కైడోలోని సపోరోలో జరగనున్నాయి. ఇక్కడ కూడా కోవిడ్ అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది.

టోక్యో ఒలిపింక్స్

జపాన్‌లో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది?

ఇతర దేశాలతో పోల్చి చూస్తే జపాన్‌లో కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇప్పటివరకూ సుమారు 7,50,000 పాజిటివ్ కేసులు, 13,200 మరణాలు సంభవించాయి.

అయితే, ఈ ఏప్రిల్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ జపాన్‌ను బలంగా తాకింది. కొన్ని ప్రాంతాల్లో జూన్ 20 వరకు ఆంక్షలు విధించారు.

ఫిబ్రవరిలో జపాన్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే జపాన్‌లో కాస్త ఆలస్యంగానే మొదలుపెట్టినట్టు లెక్క. కాగా, ఇప్పటివరకు కేవలం 36 లక్షల మందికి అంటే 3 శాతం జనాభాకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు అందించారు.

టోక్యో, ఒసాకా నగరాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. జులై చివరికల్లా 65 ఏళ్లకు పైబడినవారందరికీ టీకాలు వేయగలుగుతారని అధికారులు చెబుతున్నారు.

ఒలింపిక్స్‌కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

విదేశీయులను జపాన్‌లోకి అనుమతించట్లేదు. కాబట్టి అంతర్జాతీయ అభిమానులు ఒలింపిక్ క్రీడలను నేరుగా వీక్షించడానికి వీలు పడదు.

జూన్ 19న టోక్యోలో కోవిడ్ అత్యవసర పరిస్థితి ముగియనుంది. ఆ తరువాత, స్థానిక క్రీడాభిమానులను ఆటలు చూడ్డానికి అనుమతించాలా వద్దా అనే విషయంలో అధికారులు ఓ నిర్ణయానికొస్తారు.

అంతర్జాతీయ క్రీడాకారులకు, ఇతర సిబ్బందికి వారి వారి దేశాల్లో బయలుదేరే ముందు, జపాన్‌లో ప్రవేశించిన తరువాత కోవిడ్ పరీక్షలు జరుపుతారు.

వీరిని క్వారంటైన్‌లో ఉంచరు కానీ, బబుల్స్‌లోనే ఉండాలి. స్థానికులను కలవకూడదు.

అథ్లెట్లు వ్యాక్సీన్ వేసుకోకపోయినా ఫరవాలేదు. అయితే 80% క్రీడాకారులు ఇప్పటికే టీకాలు వేసుకుని ఉంటారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అంచనా వేస్తోంది.

క్రీడల్లో పాల్గొనేవారికి రోజూ కోవిడ్ పరీక్షలు జరుపుతారు.

టోక్యో ఒలిపింక్స్

జపాన్ ప్రజలు ఒలింపిక్స్ జరగాలని కోరుకుంటున్నారా?

ఆ దేశానికి చెందిన ప్రముఖ వార్తాపత్రిక 'ఆసాహి షింబున్' ఇటీవల నిర్వహించిన ఒక పోల్‌లో 80% కంటే ఎక్కువ మంది ఒలింపిక్ క్రీడలను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని కోరుకుంటున్నారని తేలింది.

కోవిడ్ వ్యాప్తి చెందుతుందనే భయంతో పలు నగరాలు అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించాయి.

కోవిడ్ మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం "అసాధ్యమని" మే నెలలో డాక్టర్ల యూనియన్ ఆ దేశ ప్రభుత్వానికి తెలిపింది.

ఆసాహి షింబున్ పత్రిక కూడా క్రీడలను రద్దు చేయాలని పిలుపునిచ్చింది.

అథ్లెట్ల ప్రతినిధులు ఏమంటున్నారు?

పలువురు నిపుణులు, సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.

కఠినమైన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అథ్లెట్ల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వరల్డ్ ప్లేయర్ల్స్ అసోసియేషన్, ఐఓసీని కోరింది.

అయితే, జపాన్ అథ్లెట్లు దీనిపై ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ దేశ స్పోర్ట్స్ స్టార్, టెన్నిస్ ఛాంపియన్ నవోమీ ఒసాకా, దీనిపై చర్చ జరగాలని అన్నారు.

ఇతర దేశాలు ఏమంటున్నాయి?

పెద్ద దేశాలేవీ కూడా ఒలింపిక్ క్రీడలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు.

జపాన్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశీ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, తమ దేశ అథ్లెట్లు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటారని విశ్వాసం వ్యక్తం చేసింది.

"మా క్రీడాకారుల బృందం మొత్తాన్ని ఒలింపిక్స్‌కు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని" టీం జీబీ తెలిపింది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

2022లో జరగబోయే వింటర్ ఒలింపిక్ క్రీడలకు చైనా వేదిక కానుంది.

టోక్యో ఒలిపింక్స్

ఒలింపిక్ క్రీడలు ఎప్పుడైనా రద్దవుతాయా?

అవుతాయి. యుద్ధం లేదా తీవ్ర సంక్షోభం లాంటి అసాధారణ పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను రద్దు చేసే అవకాశం ఉంది.

అయితే, ప్రస్తుతం ఒలింపిక్స్‌ను రద్దు చేసే అధికారం ఐఓసీకి మాత్రమే ఉందని ఒప్పందం.

దీనికి అయ్యే ఖర్చులో 70 శాతాన్ని ప్రసార హక్కుల ద్వారా, 18 శాతాన్ని స్పాన్సర్‌షిప్ ద్వారా రాబట్టాలని ఐఓసీ భావిస్తోంది.

ఈ ఏడాది ఒలింపిక్ క్రీడలు జరగకపోతే ఐఓసీ ఆర్థిక పరిస్థితులకు పెద్ద దెబ్బే తగులుతుంది. అలాగే, భవిషత్తులో ఈ క్రీడలు నిర్వహించడం కష్టమైపోవచ్చు.

కాగా, ఈ క్రీడలు కచ్చితంగా జరుగుతాయని ఐఓసీ పదే పదే చెబుతోంది కాబట్టి రద్దు చేయడం దాదాపు అసాధ్యమనే అనిపిస్తోంది.

ఐఓసీ కాకుండా టోక్యో స్వయంగా క్రీడలను రద్దు చేస్తే, ఒప్పందాన్ని అధిగమించినట్లవుతుంది. దీని భారం మొత్తం జపాన్‌పై పడుతుంది.

టోక్యో 2020 ఒలింపిక్ క్రీడలకు 12.6 బిలియన్ డాలర్లను కేటాయించారు. అయితే, వాస్తవంలో ఇంతకు రెట్టింపు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

వీటికి భారీ ఇన్సూరెన్సులు ఉన్నప్పటికీ, నష్టాలు అధికంగా ఉండవచ్చు.

నిర్వాహకులు మాత్రం క్రీడలను నిర్వహించాలన్న పట్టుదలతోనే ఉన్నారు.

"ఈ క్రీడలు జరుగుతాయన్న నమ్మకం నాకుంది. మేము చేయగలిగినదంతా చేస్తున్నాం" అని హషిమోటో బీబీసీకి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Will the Tokyo Olympics start next month,will covid be an obstacle to this sporting event
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X