అమెరికాను తాకిన రాహుల్ గాంధీ స్పీచ్ సెగ: కీలక ప్రకటన
వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగం కలకలం రేపుతోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన పలు అంశాలపై మోడీ సర్కార్ తీరును ఏకిపడేశారు. పెగాసస్ స్పైవేర్, బడ్జెట్, శాంతిభద్రతలు.. ఇలా అన్ని అంశాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు.

చైనా-పాక్ చేరువ
ప్రత్యేకించి- మోడీ సర్కార్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు.. అంతర్జాతీయ స్థాయిలో దుమారానికి కారణమైంది. ఆయన చేసిన విమర్శల పట్ల అగ్రరాజ్యం అమెరికా స్పందించిందంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మోడీ సర్కార్ అమలు చేస్తోన్న విదేశాంగ విధానాల వల్ల భారత్ శతృవులు ఏకం అయ్యారని రాహుల్ గాంధీ విమర్శించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా చైనా-పాకిస్తాన్ మరింత చేరువ అయ్యాయని అన్నారు.

విదేశాంగ విధానం మూలసూత్రం..
శతృవులు ఎప్పుడూ ఏకీకృతం కాకుండా ఉండాలనేది భారత విదేశాంగ విధానం మూలసూత్రమని, మోడీ సర్కార్ దీన్ని ధ్వంసం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రత్యేకించి- పాకిస్తాన్.. చైనాలను ఎప్పుడూ వేరుగా ఉంచాలనేది వ్యూహాత్మక విదేశాంగ విధానమని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం ఇదేనని రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. తమ ముందు నిలిచిన ఆయా దేశాలను తక్కువగా అంచనా వేయొద్దని హితవు పలికారు. అంతా బాగుందనే భ్రమల్లో దేశ ప్రజలను ఉంచే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

స్పందించిన అమెరికా..
పరస్పరం సహకరించుకునే స్థాయికి చైనా-పాకిస్తాన్ చేరువ అయ్యాయని, దీనికి ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విదేశాంగ విధానమే కారణమని విమర్శించారు. ఇలాంటి సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవని పేర్కొన్నారు. ఇలాంటి పాలసీలు దేశానికి మేలు చేయబోవని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలు, వ్యాఖ్యానాల తీవ్రత అమెరికాను తాకింది. దీనిపై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందించారు.

ఏకీభవించట్లేదు..
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించట్లేదని నెడ్ ప్రైస్ స్పష్టం చేశారు. ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారనేది తెలియదని పేర్కొన్నారు. చైనా-పాకిస్తాన్ ఇదివరకెప్పుడూ లేనివిధంగా చేరువ అయ్యాయనే విమర్శలు సహేతుకం కాదని తాము భావిస్తున్నామని అన్నారు. చైనా- పాకిస్తాన్ చేరువ అయ్యాయనే వ్యాఖ్యలను తోసిపుచ్చుతున్నామని, దీన్ని సమర్థించట్లేదని తేల్చి చెప్పారు. దీనిపై చైనా, పాకిస్తాన్ కూడా స్పందించాల్సి ఉంటుందని నెడ్ ప్రైస్ చెప్పారు. పాకిస్తాన్, చైనా దేశాల ప్రజల సంబంధాలపై దీన్ని వదిలేస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications